- కెసిఆర్ మీ ఆటలు ఇక సాగవు.. రాష్ట్ర ప్రజలకు అంతా అర్థమయింది
- గత ప్రభుత్వంలో మాట్లాడడానికి హక్కు లేదు.. అడిగితే నాడు అరెస్టులు
- తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏమాత్రం తగ్గనివ్వం…
- దేశంలో అద్భుత రాష్ట్రంగా నిలబెడతాం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కల్వకుర్తి, ప్రజాతంత్ర, మే 26 : పాలమూరు- రంగారెడ్డి (Palamuru-Ranga Reddy ) ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనేది ప్రజా ప్రభుత్వం ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకోనపల్లి మండలం ఖానాపురం గ్రామంలో పలు విద్యుత్తు సబ్ స్టేషన్లకు శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పెండింగ్లో ఉన్న రిజర్వాయర్ల కు భూ సేకరణకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఏనాడైనా నీళ్లు తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని గుర్తు చేశారు. జూరాల, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, శ్రీశైలం ఎత్తిపోతల నేడు పాలమూరు రంగారెడ్డి అన్ని కాంగ్రెస్ హయాంలో ప్రారంభించి పూర్తి చేసినవే అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు 70 వేల కోట్లు ఖర్చు చేస్తుంది, కేవలం రైతుల సంక్షేమం కోసం 45 వేల కోట్లు వెచ్చిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. కెసిఆర్ హయాంలో ఇల్లు లేక, కరెంటు, సబ్ స్టేషన్లు , తిండి లేక పేద, మధ్యతరగతి వర్గాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయని వివరించారు. పరాడు కేసీఆర్ హయాంలో మాట్లాడే హక్కు కూడా లేదు, ఇబ్బందులను స్వేచ్ఛగా ఒకరికి చెప్పుకునే పరిస్థితి లేదు అడిగిన మాట్లాడిన అరెస్టులు, సభ పెట్టి చెబుదామంటే హౌస్ అరెస్టులు చేశారని ఆనాటి సంఘటనలను డిప్యూటీ సీఎం వివరించారు. ఆ దయ్యాలన్నిటిని వదిలించుకొని ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిన మేం ప్రణాళిక బద్దంగా ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
మాది పాలకుల కోసం దోపిడీ చేసే ప్రభుత్వం కాదని రూపాయి రూపాయి కూడా పెట్టి సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతాం అన్నారు. కెసిఆర్ ఇక మీ ఆటలు సాగవు రాష్ట్ర ప్రజలకు అంత అర్థమయింది ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే అప్పుల పాలు చేసి నేడు ప్రతినెల మీరు చేసిన అప్పులకు 6500 కోట్లు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం తెలిపారు. అప్పుల భారం లేకపోతే ప్రజా ప్రభుత్వం మరెన్నో బ్రహ్మాండాలు చేసేది అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏమాత్రం తగ్గనివ్వం, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అని డిప్యూటీ సీఎం ధీమా వ్యక్తం చేశారు. కాళ్లల్లో కట్టెలు పెడితే ఆగిపోయే ప్రభుత్వం మాది కాదు అన్నారు. కెసిఆర్ ఆయన కుటుంబం అదిరింపులు బెదిరింపులకు ఎవరు భయపడరని తెలిపారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాలేశ్వరం నుంచి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి పది సంవత్సరాల్లో ఒక్క నది నుంచి చుక్కనీరు రైతుల పొలాలకు తీసుకురాలేదని అన్నారు. రాష్ట్ర రైతాంగం పై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ప్రేమ ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా సన్నధాన్యానికి క్వింటాకు మద్దతు ధర 500 చొప్పున చెల్లిస్తున్నాం పది సంవత్సరాల్లో కెసిఆర్ ప్రభుత్వం రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సన్నధాన్యం బోనస్ కింద రాష్ట్ర ప్రభుత్వం 1800 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.
రైతుల ఇన్సూరెన్స్ కోసం 1,589 కోట్లు ఖర్చు చేస్తున్నాం 10 సంవత్సరాల్లో కెసిఆర్ ఈ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నాం ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ప్రతి సంవత్సరం 11,496 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుందని వివరించారు . భూమిలేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ప్రతి సంవత్సరం 12,000 వారి ఖాతాలో జమ చేస్తున్నాం ఇందుకు గాను ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. రైతు భరోసా కింద 2000 అదనంగా పెంచి ప్రతి సంవత్సరం 17,530 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు చేస్తుందని తెలిపారు.
గత పాలకులు 10 సంవత్సరాల్లో లక్ష రూపాయల రుణమాఫీని ఒకేసారి చేయలేక 25 వేలు నాలుగు దఫాలుగా చెల్లిస్తే అది వడ్డీలకే సరిపోయిందని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే 22 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. మరి పది సంవత్సరాల్లో కెసిఆర్ ఎందుకు రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో లబ్ధిదారులందరికీ తెలుసునని డిప్యూటీ సీఎం అన్నారు. ఫామ్ హౌస్ లో పడుకొని నష్టం జరిగిందని అంటున్నారు నష్టం నీకు జరిగింది కేసీఆర్, కవిత చెప్పిన దెయ్యాలకు జరిగిందని డిప్యూటీ సీఎం అన్నారు.
11,496 కోట్లు చేయిత పథకం కింద ప్రతినెల పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నాం, ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకం కింద 3600 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని తెలిపారు. మూసేస్తారు అనుకున్న ఆర్టీసీ ఈ పథకం మూలంగా లాభం లోకి వచ్చి అత్యంత ఆరోగ్యంగా ముందుకు వెళుతుందని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం మూలంగా ప్రస్తుతం గ్రామాల్లో 85 నుంచి 90 శాతం మంది కరెంటు బిల్లు చెల్లించే అవసరం లేకుండా పోయిందన్నారు వారి పక్షాన ప్రభుత్వమే 2,400 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుందని వివరించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షల పెంచాం ఫలితంగా 90 లక్షల కుటుంబాలకు రద్దు చేకూరింది ఈ పథకానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో సంవత్సరం 22,500 కోట్లు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఖర్చు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాము, దేశంలో ఒకే ఒక రాష్ట్రం అది తెలంగాణ ఈ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. 500లకే గ్యాస్ సిలిండర్ పథకానికి 720 కోట్లు వెచ్చిస్తున్నామని వివరించారు. మరో 44 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలకు త్వరలో జీవో జారీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను 25 ఎకరాల్లో 200 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 40 శాతం డైట్ చార్జీలు 25% కాస్మోటిక్ చార్జీలు పెంచాం అన్నారు.