ఆగస్ట్1965 లో నేను హైదరాబాదు తిరిగి వచ్చాను. కొద్ది రోజులకే కనాట్ ప్లేస్ లో పరధ్యానంగా రోడ్డు దాటుతూ బస్సు కింది కొచ్చి గోపాలకృష్ణమూర్తి మరణించాడని తెలిసింది. పార్థసారథి గారి ద్వారా పరిచయమైన రిజర్వ్ బ్యాంక్ సహోద్యోగి లీపారియా పేరుతో సృజనలో రాసిన మరో ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్, భూమయ్య, కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు 1974-75 ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన వి. ఎల్. ప్రసాదరావు తమ్ముడే గోపాలకృష్ణమూర్తి. పార్థసారథి గారిని తలచుకున్నపుడల్లా చలం ఇచ్చిన మరో మిత్రుడు గోపాలకృష్ణ మూర్తి గురించి తలచుకోకుండా ఉండలేను.
గోపాలకృష్ణ మూర్తి అనే ఇంకొకాయనను కూడా 1960-61లోనే కలుసుకొమ్మని చలం రాసారు.ఆయన డిఫెన్స్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం కోసం పరీక్ష రాసి హైదరాబాదు లో ఆయన అన్న దగ్గర ఉంటున్నాడు.చలంగారి సూచన పై ఆయనే వచ్చి కలిసాడు.రెస్ట్ లెస్ గా ఉండేవారు. చలం తో ఉత్తరాలు, చలం సాహిత్యం తప్ప ఇంకే ప్రపంచం తో సంబంధం లేదు. ఢిల్లీలో డిఫెన్స్ లో చిన్న ఉద్యోగం వచ్చివెళ్లిపోయాడు. ఆర్కేపురంలో ఉండేవాడు. 1965 జనవరిలో ఉద్యోగం వచ్చి నేను మొదట ఆయన దగ్గరే ఉన్నాను.
మా ఇద్దరికీ మరో రెండు అభిరుచులు కలిసాయి. చార్లీ చాప్లిన్ ఆయన సినిమాలు. ఆ రోజుల్లోనే ఆయన ‘మై ఆటోబయోగ్రఫీ’ వచ్చింది. ఇద్దరం కలిసి ఆ పుస్తకం కొని అదే లోకంగా చదివి చలంగారికి పోస్ట్ చేసాం. నేను, నా సహచరిని, మా అమ్మను తీసుకొచ్చుకోవాలంటే ఆ రూమ్ నాకు వదిలేసి ఆయన వేరే చోటికి మారాడు. నేను డిఎవిపి (సమాచార మంత్రిత్వ శాఖ) లో పనిచేసే వాణ్ణి గనుక ఆలిండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లో ఏ ఫంక్షన్ అయినా ఆహ్వానం వచ్చేది. 1965 జనవరి 26 కోసం ఆకాశవాణి అఖిల భారతదేశ భాషల కవి సమ్మేళనానికి సాహిర్ లూథ్యాన్వి వచ్చాడు. ఎవరినైనా తీసుకవెళ్లే పాసులు నాకు ఉంటాయి. కాని గోపాల కృష్ణ మూర్తి కి అవేమీ పట్టవు. కనుక రావడానికి ఆసక్తి చూపలేదు. నేను సాహిర్ ను కలిసి పలకరించి తన్మయంతో చెప్పబోయినా ఆసక్తి చూపలేదు.
మొదటిసారిగా 1965 జనవరిలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగింది. ఆరంభం సత్యజిత్ రాయ్ సినిమాలతో. బలవంతంగా తీసుకపోయాను. కాసేపు చూసి వెళ్లి పోయాడు. కార్టూన్లు వేసేవాడు. పొలిటికల్ అనలేము గానీ మానవనైజం, సంక్లిష్టతలకు సంబంధించి. కనుక ఇద్దరికీ మరొక ఇష్టమైన అంశం శంకర్స్ వీక్లీ. ఆయన వేసిన కార్టూన్లు అన్నీ తీసుకొని బహదూర్ షా మార్గ్ లో ఉన్న శంకర్స్ వీక్లీ ఆఫీసుకు వెళ్లాం. అక్కడ పని చేసిన కార్టూనిస్టులందరూ ఆ తర్వాత కాలంలో దేశంలోనే సుప్రసిద్ధ కార్టూనిస్టులయ్యారు. ఒ.వి.విజయన్ వారిలో నాకు శంకర్ తర్వాత ఇష్టమైన కార్టూనిస్టు. ఆయన కార్టూన్ చూసి నేను రాసిన కాడి-రెండెద్దులు కవిత జీవనాడిలో ఉంది. ఆ కార్టూన్ ఆ సంకలనం కవర్ మీద వేయాలని 1970-71లో శేషాచలం కంపెనీ యజమాని ఎం. ఎన్. రావు గారిని అడిగాను, కానీ కాపీరైట్ సమస్యలుంటాయని బాపుతో చాలా అర్థవంతమైన కవర్ వేయించారు.
ఒ.వి.విజయన్ చనిపోయినపుడు నేనాయన గురించి బహుశా ప్రజాతంత్ర లోనే వ్యాసం రాసాను. ఆ విషయం తెలిసి హైదరాబాదు లోని కేరళ సమాజం నన్ను ఆయన సంస్మరణ సభకు పిలిచింది. అక్కడివాళ్ల ఆహ్వానం పై వచ్చిన ఆయన భార్యను కలిసాను. ఇంతకూ అప్పటికెప్పుడో ఆయన కేరళకు వెళ్లి మలయాళం, ఇంగ్లీష్ రచయితగా సుప్రసిద్ధుయ్యాడు. నా ఈ స్వీయశాఖ చంక్రమణం నుంచి గోపాలకృష్ణ మూర్తి విషయానికే వస్తే శంకర్ తో కలిసి మాట్లాడి ఆయన కార్టూన్ లు శంకర్ కు ఇచ్చివచ్చాం. ఆగస్ట్1965 లో నేను హైదరాబాదు తిరిగి వచ్చాను. కొద్ది రోజులకే కనాట్ ప్లేస్ లో పరధ్యానంగా రోడ్డు దాటుతూ బస్సు కింది కొచ్చి గోపాలకృష్ణమూర్తి మరణించాడని తెలిసింది. పార్థసారథి గారి ద్వారా పరిచయమైన రిజర్వ్ బ్యాంక్ సహోద్యోగి లీపారియా పేరుతో సృజనలో రాసిన మరో ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్, భూమయ్య, కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు 1974-75 ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన వి. ఎల్. ప్రసాదరావు తమ్ముడే గోపాలకృష్ణమూర్తి. పార్థసారథి గారిని తలచుకున్నపుడల్లా చలం ఇచ్చిన మరో మిత్రుడు గోపాలకృష్ణ మూర్తి గురించి తలచుకోకుండా ఉండలేను.
-వి. వి.
09-03-2026





