రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు..

  • అర్హులంద‌రికీ పార‌ద‌ర్శ‌కంగా ఇళ్లు ఇస్తాం..
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ… ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.పేదల సొంతింటి కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అని ఆయ‌న కొనియాడారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం రూపొందించిన‌ మొబైల్ యాప్ ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..
ఏడాది పాలనలో అందరి సంపూర్ణ సహకారంతో తెలంగాణ రైజింగ్ అనే విధంగా రెండో వసంతంలోకి అడుగుపెడుతున్నామ‌ని తెలిపారు. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల.. ఆ పేదల కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఆనాడే కృషి చేశారు. వ్యవసాయ భూమి పేదల ఆత్మగౌరవమ‌ని గుర్తించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఘనత ఇందిరా గాంధీది. తెలంగాణలోనే దాదాపు 35 లక్షల ఎకరాల భూమిని ఇందిరమ్మ పంపిణీ చేశారు.. భూమిపై పేదలకు హక్కు కలిగించిన గొప్ప నాయకురాలు ఇందిరమ్మ. రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ… ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని మేం గర్వంగా చెప్పగలం పేదల సొంతింటి కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ.. రూ.4వేలతో మొదలైన ఈ పథకం వైఎస్ హయాం వరకు రూ.లక్షా 21వేలకు చేరుకుంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక దీన్ని రూ.5లక్షలకు పెంచింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
లక్ష్యం ఎంతగా గొప్పదైనా అమలులో లోపాలు ఉండొద్దని సాంకేతికను జోడించామ‌ని సీఎం అన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ద‌క్కాల‌నే ఉద్దేశంతో కొత్త‌గా యాప్ ను తీసుకొచ్చాం.. విధి విధానాలను కూడా సరళీకృతం చేసి లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించాం.. వారి స్థోమతకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించామ‌ని చెప్పారు. పేదలకు న్యాయం జరిగేందుకు తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంద‌న్నారు. మొదటి ఏడాదిలో నియోజకవర్గానికి 3,500 చొప్పున… 4.50 లక్షల ఇండ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చాం.. అత్యంత నిరుపేదలు మా మొదటి ప్రాధాన్యత దళితులు, గిరిజనులు, వ్యవసాయ కూలీలు,పారిశుధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెడర్స్ కు ప్రాధాన్యతగా తీసుకుంటామ‌ని, ఐటీడీఏ ప్రాంతాలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణిస్తుంది. వారి కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామ‌ని తెలిపారు. . 2004 నుంచి 2014 వరకు 25 లక్షల 4 వేల ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది.. బీఆరెస్ అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూంల కోసం మా ప్రభుత్వం రూ.195 కోట్లు విడుదల చేశామ‌ని రేవంత్ రెడ్డి వివరించారు… అర్ధంతరంగా అసంపూర్తిగా వదిలేసి మేమే కట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రగతి భవన్ కట్టుకున్నారు.. ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు… పార్టీ కార్యాలయాలకు కోట్లు కేటాయించారు… వారి ప్రాధాన్యత వారి స్వార్ధం కోసం తప్ప పేదల కోసం కాదు… డబుల్ బెడ్రూంలు ఇవ్వలేదు కానీ.. బెల్టు షాపులు వాడవాడలా పెంచారు.

కేసీఆర్ అసెంబ్లీకి వొచ్చి మీ పెద్దరికం చూపండి..

మిగులు బడ్జెట్ తో కేసీఆర్ కు రాష్ట్రం అప్పగిస్తే… మాకు 7లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగించారు. వేల ఎకరాల భూములు అమ్మేశారు. లక్షల ఎకరాల పేదల భూములు గుంజుకున్నారు.. పదేళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు. ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ.. సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నాం.. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ హరీష్ రావు నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం వైఎస్ ను కలిసిన పరిస్థితి ఆనాడు ఉంది. కానీ పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో కేసీఆర్ ఎవరినీ కలవలేదు. పాలకపక్షం ప్రతిపక్షణం అంటే శత్రువులు అనే పరిస్థితిని కేసీఆర్ సృష్టించారు. ఇప్పటికైనా ఆయనలో పరివర్తన రావాలి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలి.. ప్రభుత్వం అంటే కేవలం 65 మంది సభ్యులే కాదు.. ప్రభుత్వం అంటే 119 మంది శాసన సభ్యులు.. తెలంగాణ ప్రజలు సభలో అందరికి ప్రాతినిధ్యం ఇచ్చారు.. ఎవరి బాధ్యత వారు సరిగ్గా నేరవేరిస్తేనే ప్రజలు హర్షిస్తారు.. ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి.. కుర్చీ ఖాలీగా ఉండటం తెలంగాణకు మంచిదా..? మీరు వొచ్చి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి… ప్రశ్నించండి.. సూచనలు ఇవ్వండి.. మాకు భేషజాలు లేవు… వయసులో, అనుభవంలో మీరు పెద్ద వారు.. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి.. మీ పిల్లలు అల్లరి చిల్లర చేస్తే పెద్దమనిషిగా మీరు వారికి సర్దిచెప్పాలి కదా.. వారిని నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా.. మీ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి.. రామాయణంలో మారీచుడు, సుబాహువులా మా ప్రభుత్వం పై వారిని ఉసిగొల్పడం మంచిదా ఆలోచించండి.. అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని రాజకీయాలు ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన సమస్యపై తమిళనాడు నేతలు కలిసికట్టుగా పోరాడుతారని, పార్లమెంట్‌లో కొట్లాడి నిధులు తెచుకుంటారు.. ఆ స్ఫూర్తి తెలంగాణలో ఎందుకు కొరవడింది.. మీకు నచ్చినా.. నచ్చకపోయినా ప్రజలు తీర్పుఇచ్చారు.. ప్రజా తీర్పున‌కు ఎవరైనా తలొగ్గాల్సిందే.. ప్రజా తీర్పుకు నిజాం ప్రభువే తల వొంచక తప్పలేదు… కేసీఆర్ ను ఈ వేదికగా ఆహ్వానిస్తున్నా…మొదటి సంవత్సర వేడుకల్లో పాల్గొనండి… మా మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు.. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జరిగే వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయండి..అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *