రెడ్డి రామకృష్ణ
కవిత్వం అంటే అర్థంకాని గందరగోళం అనుకునే కాలం దాదాపుగా గతించిపోయింది. సున్నితమైన అంశాలను కూడా స్పృశిస్తూ గొప్ప భావుకతతో చెప్పగలుగుతున్నారునేటి కవులు. కొందరు కొన్నికొన్ని కవితల్లో తేలిపోతున్నా కొన్నికొన్ని కవితలు బాగా రాస్తున్నారు. కొంతమంది మాత్రం అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. మంచి కవిత్వాన్ని సరళమైనభాషలోనే వ్యక్తీకరిస్తున్నారు. అలాంటి మంచికవిత్వం రాస్తున్న వారిలో మొయిద శ్రీనివాసరావు ఒకరు. విజయనగరానికి చెందిన ఈ కవి ఆధునిక వర్తమాన సమాజంనుండి వర్తమాన సంఘటనల నుండే విషయాన్ని గ్రహిస్తూ అధునాతనమైన పోలికలతో, వీలైనంత వరకు పాతవాసనలు లేకుండా సరికొత్తగా రాస్తున్నాడు. అతని రెండవ కవితా సంపుటి ‘కరవాక’. ఇందులోని ‘కొనాలి’ కవిత ద్వారా మార్కెట్ చేస్తున్న మాయాజాలాన్ని కవి ఎలా విప్పి చూపిస్తున్నాడో చూద్దాం.
నేటిజీవితం పూర్తిగా మార్కెట్ మీద ఆధారపడి ఉంది. బజారులో ఏదీ కొనకుండా నేటిమనిషికి మనుగడలేదు. పారిశ్రామిక విప్లవానంతరం వచ్చిన మార్పుల్లో సరుకుల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వాటిని అమ్ముకోవటానికి వస్తువుల్లోనే సుఖము, సంతోషము ఉన్నాయని, వస్తు వినియోగముతోనే జీవితం ఆనందమయం కాగలుగుతుందని నమ్మకంగా చెపుతుంది బజారు. దాంతో ఉత్పత్తి అయిన సరుకులు గ్రామగ్రామానికి ఇంటింటికి చొచ్చుకు పోతున్నాయి.
“పొద్దున్నే/ పదిగంటలకే/ పండు మిరపకాయలా/ ఎండ మండిపోతుంటే” అని మొదలవుతుంది కవిత. ఎండని పండు మిరపకాయతో పోల్చడం ద్వారా ఎండ యొక్క తీవ్రతని చెప్తున్నాడు. మిరపకాయ ఘాటు ఎలావుంటుందో ఎండయొక్క తీవ్రత అలా వుందని మనకు అర్ధమవుతుంది. అంతేకాదు, మిరపకాయ మన నిత్యావసర వస్తువు. దానితో పోల్చిచెప్పడం వలన, అదనంగా, నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయన్న ధ్వని వినపడుతుంది.
“అంతవరకు ఆ ఊరిలో/ కాకిలా తిరిగిన నేను/ తాటికమ్మల కింద/ తాబేలులా వున్న ఓ బడ్డీకాడ/ కాసేపు కూర్చున్నాను” ఇక్కడ కిరాణాబడ్డీని తాబేలుతో పోల్చ డం ముందుగా ఆకట్టుకుంటుంది. బడ్డీకొట్టుపై తాటికమ్మలతో కప్పడం గ్రామాల్లో సహజంగా చూస్తున్నదే. తాటికమ్మలు వేయటం కూడా ఎండతీవ్రతని సూచిస్తుంది. ఇలా ఒక చరణంలో ఎండతీవ్రతను రెండు భిన్నరూపాలలో సూచిస్తాడు. కవి ఒక గ్రామీణవ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఈ కవితలో. అంతవరకు కాకిలా తిరుగుతున్నా డట. కాకి ఎందుకు తిరుగుతుంది తన ఆహారసంపాదన కోసమే తిరుగుతుంది. ఇతడు బహుశా పనికోసం తిరిగితిరిగి పనిదొరక్క, బడ్డీనీడని కాసేపు కూర్చున్నాడు. ఆ బడ్డీ దగ్గర తను ఏం గమనించాడో చెప్తున్నాడు కవితలో. ఎండిన రిట్టకాయ రంగున్న/ ఓ పిల్లాడు/ ఒత్తయినజుత్తు బొమ్మలున్న/ రెండు చిక్ షాంపులు పట్టుకెళ్లాడు/ పలచగా పలకర్రలా వున్న ఓ పిల్ల/ డొర్రిపల్లెల్లబెట్టి నవ్వుతూ/ క్లోజప్ లా కదిలిపోయింది/ శొంఠికొమ్ములాంటి ముసలాయన/ నవరత్న ప్యాకెట్లా నడిచిపోయాడు/ సగముడికిన కూరలాంటి/ ఓ ముసలామె ప్రియా పచ్చడి ప్యాకెట్టై/ ముందుకు సాగిపోయింది.
కవిత మొత్తం గ్రామంలో కొనుక్కుంటున్న కొన్నివస్తువుల్ని మనకి చూపించాడు. ఇలా చూపించడం ద్వారా ఇక్కడ కవి ఏం చెప్తున్నాడు!? అని గనక ఆలోచిస్తే ప్రతిచరణం మొదటిలైనులో అంతకుముందు వారసత్వంగా వాడుతూ వచ్చిన, గ్రామంలో దొరికే వస్తువులను చూపించాడు. రిట్టకాయ, పలకర్రా, శొంఠి కొమ్ము, కూర మొదలైనవి. రెండవ లైన్ కి వచ్చేసరికి మొదట చెప్పినవాటికి బదులుగా కొనుక్కుంటున్న వస్తువులు చూపించాడు. చిక్ షాంపు ప్యాకెట్లు, క్లోజప్ టూత్ పేస్ట్, నవరత్న ఆయిల్ ప్యాకెట్, ప్రియా పచ్చడి, మొదలైనవి. అంటే పాతవస్తువుల స్థానే వచ్చిన కొత్తవస్తువులను చూపించాడు. అంటే పల్లెటూరు షాపులలో చిన్నప్యాకెట్లలో జరుగుతున్న అమ్మకాలలోని వ్యాపారసూత్రాన్ని చెప్పదలుచుకున్నాడని. అర్ధమవుతుంది.
ఇప్పుడు అన్నీ చిన్నవేలాగున్నాయన్న/ నా ప్రశ్నకు/ అందరూ కొనాలి కదా సార్ అన్న సమాధానం వచ్చింది. అందరికీ సరుకు అందుబాటులోకి రావడానికి చేసే ప్రయత్నమే ఈ చిన్నప్యాకెట్లు. అంటే పెట్టుబడి ప్రతి ఇంటిలోనా చొరబడి వాళ్ళ జేబులను ఖాళీ చేస్తోందని చెప్పడం. పెట్టుబడి పని అదే. అంతకుముందు మనవద్ద ఉన్న వస్తువులని ధ్వంసంచేసి, పూర్తిగా ధ్వంసమైన తరువాత, వాటికి బదులు లేబుల్ మార్చి అదే వస్తువుని మరోరూపంలో తిరిగి మనకి అమ్ముతుంది మార్కెట్ ద్వారా. పెట్టుబడి యొక్క ఈ లక్షణాన్ని చాలా బాగా చెప్పాడు కవి ఈ కవితలో అనాదిగా మనం వాడే వస్తువులను, విధానాలను చిన్నబుచ్చి అనాగరికమనో, అనారోగ్యకరమనో, ఏదో ఒకటి చెప్పి నమ్మింప జేసి, మనచేతే వాటిని ధ్వంసం చేయించి, పూర్తిగా ధ్వంసం అయ్యాక సరికొత్త లేబుల్స్ తో తన సరుకుని కొనిపింపచేస్తోంది పెట్టుబడి. పెట్టుబడి ఎప్పుడూ మానవశ్రమని, తనవైపు లాక్కొనే ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది.
అమ్మకాలు పెరిగేకొద్దీ పెట్టుబడిదారుడికే లాభం. సరుకు అమ్మకం పెరుగుతున్నప్పుడు, సరుకు ఉత్పత్తి పెరుగుతుంది. సరుకు ఉత్పత్తి పెరుగుతున్నప్పుడల్లా కార్మికుల శ్రమలోంచి అదనపు విలువను లాక్కోగలుగుతాడు పెట్టుబడిదారుడు. ఈ మార్క్సిస్టు సూత్రాన్ని చాలా సులభశైలిలో కవిత్వీకరించి చెప్పాడు కవి. ఈ కవిత్వము అనుభూతితో పాటు ఆలోచనలను రేకిత్తిస్తుందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు.