అమిత్‌ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఉద్యమం

  • కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, రాహుల్‌ ప్రకటన
  • ప్రజలకు క్షమాపణలు చెప్పి, రాజీనామా చేయాలని డిమాండ్‌

న్యూదిల్లీ,డిసెంబర్‌19: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అవమానించారని, అందుకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పునరుద్ఘాటించారు.  ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. దిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, రాహుల్‌ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.‘అమిత్‌ షాను బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశాం. అది జరగదని మాకు తెలుసు. అందుకే నిరసనలు చేపట్టాం.

అంబేడ్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యల అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు భాజపా ఇతర అంశాలను లేవనెత్తుతోంది.  భాజపా ఎంపీలు మమ్మల్ని పార్లమెంటులోకి రానీయకుండా అడ్డుకున్నారు. నన్ను నెట్టారు. నేను బ్యాలెన్స్‌ తప్పి కింద పడ్డాను‘ అని ఖర్గే  అన్నారు. భాజపా-ఆరెస్సెస్‌ ఆలోచన రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు వ్యతిరేకమని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను అమిత్‌ షా క్షమాపణలు చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, అదానీ వ్యవహరంపైనా తమ డిమాండ్‌ను లేవనెత్తుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page