– పొన్నం వ్యాఖ్యలపై దళితవర్గాల్లో ఆగ్రహం
– ఇద్దరి మధ్య చిచ్చుపెట్టిన ఇథనాల్ ప్రాజెక్టు
– రెండేళ్ల క్రితమే విభేదాలు
– పొన్నం క్షమాపణలు పై పూతేనా?
– రహస్య వైరం కొనసాగితే కాంగ్రెస్‌కు నష్టం
– రెండేళ్ల క్రితమే విభేదాలు
– పొన్నం క్షమాపణలు పై పూతేనా?
– రహస్య వైరం కొనసాగితే కాంగ్రెస్‌కు నష్టం
జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: రాష్ట్ర రాజకీయ వేదికపై మరోసారి మాటల తుపాకీ పేలింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన “దున్నపోతు” వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అవమానంగా కాక దళిత ఆత్మగౌరవం మీద దాడిగా మారాయి. ఈ సంఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపల నెలకొన్న విభేదాలు తిరిగి బయటపడ్డాయి. ముఖ్యంగా ప్రజా వేదికపై సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అవమానకర వ్యాఖ్యలు చేయడం సామాజిక న్యాయం అనే సిద్ధాంతం జెండా ఎగరేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన ఇబ్బందిని తెచ్చిపెట్టింది. ఈ ఇద్దరు నేతల మధ్య అసంతృప్తి కొత్తది కాదు. ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్ మండలం పాసిగామ గ్రామం వద్ద క్రిబ్ కో కంపెనీ ప్రతిపాదించిన ఇథనాల్ ప్రాజెక్టు కాలంలోనే ఈ విభేదాల విత్తనం పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రిగా పనిచేస్తున్న కొప్పుల ఈశ్వర్ ఇథనాల్ ప్రాజెక్టుకు అనుకూలంగా అక్కడ భూమి పూజ కూడా చేసి పనులను ప్రారంభించారు. దీనిని అప్పట్లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గా వ్యవహరిస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజా ప్రయోజనాల కోసం ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలిచారు. ఇథనాల్ ప్రాజెక్టు వస్తే రైతుల భూములు పాడవుతాయి, భూగర్భ జలాలు కలుషితమవుతాయి, గ్రామ ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అని ఆందోళన నిర్వహించారు. ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాల ద్వారా భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. అప్పటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, జగిత్యాల నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కూడా ప్రాణత్యాగం చేసైనా ప్రాజెక్టును అడ్డుకుంటానని ఆందోళనకారుల ఉద్యమంలో హామీ ఇచ్చారు. అయితే అదే సమయంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ 2023 మే 13న క్రిబ్ కో కంపెనీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధ్యక్షతన జరిగిన ప్రజా అవగాహన సమావేశంలో క్రిబ్ కంపెనీ డైరెక్టర్‌గా ఆ ప్రాజెక్టును సమర్థించారు. ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఉపాధి లభిస్తుంది, రైతులకు లాభం కలుగుతుంది, పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదన్నారు. అయితే ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్గాల్లో విభేదాలు తారస్థాయికి చేరాయి. జగిత్యాల కాంగ్రెస్ నాయకులు కూడా అప్పట్లో పార్టీ లోపల రెండు వైఖరులు ఎందుకు అంటూ బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు. ఒకే పార్టీకి చెందిన నేతలు ప్రజల ముందే విభిన్న ధోరణులతో నిలవడం అప్పట్లోనే కాంగ్రెస్ లోపల సూక్ష్మ విభజనకు కారణమైంది. నేడు అదే అసంతృప్తి మళ్లీ బయటపడినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బహిరంగ సభలో సహచరుడిని కించపరిచే స్థాయిలో మాట్లాడడం రాజకీయ నైతికతకు మచ్చ. అదీ అదే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరుగుతుండటం మరింత విచారకరం. పొన్నం మంత్రి హోదాలో ఉన్న సమయంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన “దున్నపోతు” వ్యాఖ్యలు, ఆ పాత ఇథనాల్ వివాదం గాయాలను మళ్లీ రేపినట్లు కనిపిస్తున్నాయి. దళిత వర్గాల ప్రతినిధిగా ఉన్న లక్ష్మణ్ కుమార్‌పై బహిరంగ వేదికపై ఇలాంటి వ్యాఖ్య చేయడం సామాజిక న్యాయం అనే కాంగ్రెస్ విలువలను ప్రశ్నించే పరిస్థితి తెచ్చింది. ఇప్పటి వరకు పొన్నం ప్రభాకర్ సామాజికంగా మితభాషి, సహనవంతుడిగా పేరుపొందారు. అయితే ఈసారి ఆయన వ్యాఖ్యలు దళిత సోదరులను గాయపరిచాయి. దళిత వర్గాలు ఈ వ్యాఖ్యలను సామాజిక అవమానంగా తీసుకున్నాయి. ఒక దళిత మంత్రి గురించి శరీరాకృతిని చులకన చేయడం కేవలం వ్యక్తిగత వ్యంగ్యం కాదు, అది మొత్తం వర్గంపై పరోక్ష దూషణ అంటూ దళిత సామాజిక వర్గాలు మంత్రి పొన్నం ప్రభాకర్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. రాజకీయాల్లో మాటలకు హుందాతనం ఉండాలి. అది ముఖ్యంగా మంత్రివర్గ స్థాయిలో ఉన్న నేతల మాట అయితే, అది మరింతగా ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు దళిత, బీసీ వర్గాల మధ్య ఉన్న సహజ అనుబంధాన్ని దెబ్బతీయగలవు. కాంగ్రెస్ పార్టీకి ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామం అవుతుంది. ఎందుకంటే ఈ రెండు వర్గాలే ఆ పార్టీకి మద్దతు అందించే వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకంతో కేవలం ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమం, సామాజిక సమానత్వం ఆశతో ఎన్నుకున్నారు. కానీ ఇటీవలి కాలంలో ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నేతల మాటలతో ఆ నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తున్నది. పొన్నం వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం స్పష్టమైన చర్య తీసుకోకపోతే అది పార్టీ అంతర్గత అనుబంధాలను బలహీనపరుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందన చూపకుంటే,దళిత వర్గాల పట్ల ప్రభుత్వం గౌరవం చూపడం లేదనే సందేశం ప్రజలలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. రాజకీయాలు అంటే కేవలం అధికార సాధన కాదు. అది సామాజిక బాధ్యత కూడా. ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయగలవు. ఇలాంటి సందర్భాల్లో మౌనం కూడా తప్పు. పార్టీకి ప్రతిష్ఠ పెరగాలంటే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం అవసరం.
—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





