మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క.
ఏటూరునాగారం, ప్రజాతంత్ర, మార్చి 29 : దివ్యాంగుల ఆత్మగౌరవమే ప్రజా ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. దివ్యాంగులలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాల పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. శనివారం ములుగు జిల్లా (Mulugu District ) ఏటూరునాగారంలోని గిరిజన భవన్ లో జిల్లా సంక్షేమ అధికారి కూచన శిరీష అధ్యక్షతన దివ్యాంగులకు వివిధ రకాల సహాయ ఉపకరణాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి ధనసరి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దివ్యాంగులలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాల పంపిణీ చేస్తున్నామన్నారు.వారిని ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని అన్నారు.
ములుగు జిల్లాలోని దివ్యాంగులకు గతంలో 4 చోట్ల ప్రత్యేకమైన శిబిరాలను నిర్వహించి దరఖాస్తులను స్వీకరించి అందులో నుంచి అర్హులను ఎంపిక చేశారని తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు అలింకో సంస్థ సహకారంతో ఉపకరణాలను అందిస్తున్నామని అన్నారు. ఈ సహాయ ఉపకరణాలతో లబ్ధిదారులు పునరుత్తేజంతో తమ జీవితాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైకల్యం అనేది ఏదో ఒక్క అవయవానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి వైకల్యం ఉన్న అవయవాన్ని గురించి వేదనకు గురికాకుండా ఆరోగ్యంగా ఉన్న మిగతా అవయవాలతో ధైర్యంగా ముందుకు వెళ్లాలనిసూచించారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందులో భాగంగానే వారికి ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. వారికి వివిధ రకాలుగా ప్రోత్సాహకాలు, అందిస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం వంటి వివిధ సంక్షేమ పథకాల్లో 5% రిజర్వేషన్ అలాగే ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ అందించే దిశగా ప్రభుత్వం అడుగువేసిందని చెప్పారు.
ప్రభుత్వం దివ్యాoగుల కోసం వారు చిరు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా లోన్లు, ప్రత్యేకంగా వాహనాలను రూపొందిస్తున్నామని త్వరలోనే ఆ కార్యక్రమం ప్రారంభిస్తామని అన్నారు. దివ్యాంగులు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సేవలను వివియోగించుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకరన్ మాట్లాడుతూ దివ్యాంగులు కూడా సమాజం తో అన్ని విధాలా పోటీ పడాలని, వారు అన్నిరంగాల్లో స్వయం సమృద్ధి సాధించేలా సహకారం అందిస్తామని అన్నారు. గతంలో అవకాశం రాని దివ్యాంగుల కోసం భవిష్యత్ లో ఈ శిబిరాలను జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలలో నిర్వహించి వారికి కూడా సహాయ ఉపకరణాలు అందిస్తామని అన్నారు. దివ్యాంగులు ఈ సహాయ ఉపకరణాలను వినియోగించుకొని మరింత ధైర్యంతో వారిలోని వైకల్యాన్ని దాటి ముందడుగు వేయాలని సూచించారు.
అనంతరం మంత్రి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందచేశారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన ఇందిర క్రాంతి క్యాంటీన్ మంత్రి సీతక్క ప్రారంభించారు. కార్యక్రమం లో జిల్లా సంక్షేమాధికారిణి సూచన శిరీష, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఏఎస్పి శివం ఉపాధ్యాయ, ఆర్డిఓ వెంకటేష్, సిడిపిఓ ప్రేమలత, దివ్యాంగుల సంక్షేమ నాయకులు పూజరి మాణిక్యం, భాస్కర్, దివ్యాంగుల శాఖ సీనియర్ అసిస్టెంట్ గణేష్, రమాదేవి, అలింకో సంస్థ ప్రతినిధులు సాయి, లబ్ధిదారులైన దివ్యాంగులు పాల్గొన్నారు.