- ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలంబాట
- భూములన్నీ పచ్చగా మారాలన్న మంత్రి
హుస్నాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : నిత్యం సమీక్షలు, సమావేశాలు, ప్రజలతో మమేకమవుతూ బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా రైతుల (farmers)తో కలిసి పొలంబాట పట్టారు. ఉత్సాహంగా నాగలి పట్టి పొలం దుక్కి దున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మాందాటి వెంకట్ రెడ్డికు చెందిన పొలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నదాతలతో ఆప్యాయంగా కలిసిపోయి పెసర విత్తనాలు చల్లారు. ఈసందర్భంగా ఆయన రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న , ఆయిల్ పాం లేదా ఇతర ఏదైనా పంటలు వేయాలన్నారు. ఎక్కడా ఖాళీ బీడు లేకుండా చూడాలన్నారు. రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. ఈసారి మంచి వర్షాలు పాడి పంటలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. అందుకు రైతుల శ్రమ ప్రకృతి సహకారం అవసరం. హుస్నాబాద్ నియోజకవర్గం లో అన్ని రాజకీయ మిత్రులు అధికారులు ఎక్కడ ఖాళీ స్థలం లేకుండా చూసుకోవాలి. విత్తనాలు వేసుకునే శక్తి లేని వారికి మా కార్యాలయాన్ని సంప్రదించండి.. మేం విత్తనాలు అందిస్తాం..ఇటీవలే హుస్నాబాద్ లో మూడు రోజుల పాటు రైతు మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయ విధానాలు పద్ధతులు పై మూడు రోజుల కాన్ఫరెన్స్ జరిగింది. పంటలు ,యాంత్రీకరణ తదితర అంశాలపై రైతులు అవగాహన చేసుకున్నారని మంత్రి పొన్నం తెలిపారు.
బస్వాపూర్ గ్రామంలో పర్యటన
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పర్యటించారు. గ్రామంలో వివిధ సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. అంగడి బజార్ లో కూరగాయలు అమ్మే వ్యాపారులతో ముచ్చటించారు స్థానిక టీ కొట్టులో చాయ్ తాగుతూ ప్రజలతో ముచ్చటించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వెంటనే అధికారులతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం చేశారు ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కార్యకర్తలకు సూచించారు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు వెంటనే ఇల్లు ప్రారంభించాలని వారికి సూచించారు.





