– నరవణె పుస్తకంపై భయపడుతున్న ప్రభుత్వం
– కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు
న్యూదిల్లీ, ఫిబ్రవరి4: పార్లమెంటు బ్జడెట్ సమావేశాల్లో యూరోపియన్ యూనియన్, అమెరికాతో చేసుకున్న ఒప్పందాల వివరాలను పార్లమెంటు ముందుంచాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం కూడా లోక్‌సభ ప్రారంభం అవ్వగానే ప్రతిపక్ష సభ్యులు ఈ ఒప్పందాలపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిణామాలతో సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపై తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఇక భారత సైన్యం మాజీ అధిపతి ఎం.ఎం.నరవణె పుస్తకంలోని ఓ అంశంపై వివాదం కొనసాగుతోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆ పుస్తకం చదివితే చైనా మన సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు మన దేశ నాయకత్వం దానిపై ఎలా స్పందించిందనే విషయం బయటపడిపోతుందని ప్రభుత్వం భయపడుతోందన్నారు. అందుకే తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈ విషయంపై పార్లమెంటులో మాట్లాడనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. భాజపా నాయకులు మాట్లాడేటప్పుడు కూడా పుస్తకాలు, పత్రికల గురించి ప్రస్తావిస్తారన్నారు. గతంలో ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసేవి. కానీ, ఇప్పుడు ఓ వ్యక్తి అభిప్రాయాన్ని మాత్రమే ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. వారికి సంబంధించి ఏ విషయాలు బయటపడతాయోనని ప్రభుత్వం భయపడుతోందన్నారు. అందుకే ఆ పుస్తకం ప్రచురణకు అనుమతించడం లేదని ఆరోపించారు. ఇంకా ప్రచురణ కాని నరవణె రాసిన పుస్తకాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు ప్రధాని మోదీ లోక్‌సభకు వస్తారని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ మోదీ వస్తే తానే స్వయంగా ఆయనకు ఈ పుస్తకాన్ని అందజేస్తానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





