*బాకీ కార్డులతో ప్రజలకు వివరిస్తాం -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు
*జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట సమత కాలనీలో ఇంటింటికి కేటీఆర్
తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట, సమత కాలనీలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలతో కలిసి విస్తృతంగా పర్యటించిన కేటీఆర్, ఇంటింటికీ తిరుగుతూ ‘కాంగ్రెస్ బకాయి కార్డు’లను ప్రజలకు అందించి, కాంగ్రెస్ మోసపూరిత పాలనను వివరించారు. దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చెంప పెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, అరచేతిలో స్వర్గం చూపించి వోట్లు దండుకున్న కాంగ్రెస్, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, ఇప్పటికి ఒక్కో మహిళకు రూ.55,000 బాకీ పడ్డారని చెప్పారు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇవ్వకుండా ఒక్కొక్కరికి రూ.44,000 బాకీ ఉన్నారని తెలిపారు. అలానే విద్యార్థులకు స్కూటీ ఇవ్వలేదు కానీ, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మోసాలన్నింటినీ గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే అద్భుత అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందన్నారు కేటీఆర్. ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే మరో మూడేళ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కులమతాలకు అతీతంగా తెలంగాణలోని సబ్బండ వర్ణాలు, కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అసలు అభివృద్ధే జరగడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాసం రాస్తే, తన నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు వంద కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఏకంగా ప్రపంచ బ్యాంకుకే లేఖ రాశారని కేటీఆర్ చెప్పారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులంతా టూరిస్టులే అన్న కేటీఆర్, ఎన్నికలు అయిపోగానే వాళ్లంతా గాయబ్ అవుతారన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది బీఆర్ఎస్ నేతలే అని స్పష్టం చేశారు. ప్రజెంట్ సిటీ’ వరదలతో మునుగుతుంటే, దోమలతో జనం ఇబ్బందులు పడుతుంటే, ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని సిఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్ తరాలే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్న మెట్రోను రద్దుచేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు.





