రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 28 : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (konda surekha) తెలిపారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజక వర్గం బల్దియా పరిధిలోని 12, 21, 24, 32, 41వ డివిజన్లలో కోటి 50 లక్షల బల్దియా సాధారణ నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మేయర్ గుండు సుధారాణి, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని వాకడే, అదనపు కలెక్టర్ సంధ్య రాణి కార్పొరేటర్లు కావటి కవిత, ముహమ్మద్ ఫుర్ఖాన్, పోశాల పద్మ, పల్లం పద్మ, రామా తేజేశ్వి శిరీష్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, బల్దియా ఈ ఈ శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్ ,డి ఈ రాజ్ కుమార్ ఏ ఈ హారికుమార్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఐదేళ్లలో తెలంగాణ రూపురేఖలు మార్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిధుల వరద కురిపించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఒక వైపు మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతో పాటు మరోవైపు భూగర్భ మురుగు కాలువల వ్యవస్థను సహకారం చేసేందుకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ చికిత్స పరిమతిని 10 లక్షల వరకు పెంచడం తదితర పథకాలను లబ్ధిదారులకు అందించామన్నారు.
రెండో విడతలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టి ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఈనెల 26వ తేదీన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించామని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు దశలవారీగా సంక్షేమ కార్యక్రమాలను అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అనంతరం శాఖరాశి కుంట నుండి కీర్తి బార్ వరకు గల నాలను పరిశీలించి నాల కు ఆనుకొని ఉన్న స్థలం ఆక్రమణకు గురికాకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే నిర్వహించాలని, బల్దియా అధికారులను నాలను శుభ్రం చేయాలని మంత్రి ఆదేశించారు.



