Take a fresh look at your lifestyle.

వరదలపై పూర్తి స్థాయిలో.. అప్రమత్తంగా ఉండాలి

ప్రాణనష్టం కలుగకుండా అధికారులు శ్రమించాలి
కంట్రోల్‌ ‌రూమ్‌లతో 24 గంటలు పరిస్థితిని సమీక్షించాలి
వరంగల్‌లో వరదల పరిస్థితిపై ప్రత్యేక  ఆరా
రాష్ట్రంలో వరదలు, సహాయక చర్యలపై సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష

రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్థి నష్టం జరుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరో నాలుగైదు రోజుల పాటు అతి భారీ వర్ష సూచన ఉన్నందున అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.  సోమవారం ప్రగతి భవన్‌ ‌నుంచి రాష్ట్రంలో వరదలు, సహాయ పునరావాస చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లా కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సహాయ పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలనీ, ఎక్కడికక్కడ కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిరంతరాయంగా పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టడానికి ఎంత ఖర్చయినా వెనుకాడవద్దనీ, అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల నుంచి ప్రతీ రోజు నివేదిక తెప్పించుకుని పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారీ ప్రకృతి వైపరిత్యం సంభవించినా ఎక్కడా ఏమాత్రం అంతరాయం లేకుండా విద్యుత్‌ ‌సరఫరా చేయడంతో పాటు గ్రిడ్‌ ‌ఫెయిల్‌ ‌కాకుండా సమర్థవంతంగా వ్యవహరించిన విద్యుత్‌ ‌శాఖను, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో పెద్ద కష్టం, భారీ నష్టం కలుగకుండా చర్యలు తీసుకున్న మున్సిపల్‌ ‌శాఖను ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

కాగా, వరంగల్‌ అర్బన్‌, ‌వరంగల్‌ ‌రూరల్‌, ‌కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాలలో భారీ వర్షాలతో పాటు వరదల ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేకంగా సమీక్షించారు. గడచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువులు నిండాయి, అన్ని జలాశయాల్లోకి వరద నీరు వస్తున్నది ఇప్పటి వరకు పరిస్థితి అదుపులోనే ఉంది కానీ, రాబోయే మూడు నాలుగు రోజులు కూడా ముఖ్యం ఈశాన్య మధ్యప్రదేశ్‌, అల్పపీడనానికి అనుబంధంగా 5.8 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, ప్రాణహిత ఇంద్రావతి నదులకు నీరందించే క్యాచ్‌మెంట్‌ ఏరియా కలిగిన ఎగువ రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ కారణాల వల్ల రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడి భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ ‌కోరారు.

వరద తగ్గిన వెంటనే నష్టంపై సాయం : జిల్లాల్లో వరదలపై మంత్రుల సక్ష
రాష్ట్రంలో వరదల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మంత్రులు పరిస్థితిని సక్షించారు. అధికారులకు తగిన సూచనలుచేశారు. రాబోయే 48 గంటలు భారీ వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి సహాయం అందించాలన్నారు. ఇప్పటికే రెండు కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సిఎస్‌ ఆధ్వర్యంలో కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నడుస్తుందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి ప్రత్యేక బృందాలను పంపిస్తున్నారన్నారు. అవసరం ఉన్న చోట ప్రజలను షెల్టర్‌లకు తరలించి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌లో కొన్ని ప్రాంతాలు, ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్‌ ‌జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయన్నారు. తెగిపోయిన చెరువులు, మునిగిపోయిన పంటపొలాలు, కూలిపోయిన ఇళ్ళ విషయంలో ఇప్పటికే కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఇరిగేషన్‌, ‌వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పర్యటించి జరిగిన నష్టం అంచనాలు వేస్తున్నారన్నారు. వరద తగ్గిన తర్వాత జరిగిన నష్టంపై సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పుడు వెంటనే ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ ఆహారం, కావలసిన సహకారాలు అందిస్తామన్నారు. రైతాంగానికి జరిగిన పంట నష్టంపై సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇదిలావుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ‌పరిస్థితిని ఎప్పటికప్పుడు సక్షిస్తున్నారు.  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గాల వారీగా సమాచారం తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. పంటలు నీట మునిగాయి. రాబోయే మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇరు జిల్లాల కలెక్టర్‌ ‌లతో ఫోన్‌లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితులను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. తక్షణ సహాయం అందించేందుకు ఇప్పటికే అన్ని బలగాలను సిద్ధం చేశారు. ప్రజారవాణా, సరుకు రవాణాకు, ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Leave a Reply