30–40 వేల ఉద్యోగాల అవకాశాలు…
పార్క్ పెండింగ్ పనులు పూర్తి చేయండి
కేసీఆర్ చేసిన మహా రూపకల్పనను వృథా చేయొద్దు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నాటి సీఎం కేసీఆర్ దూరదృష్టికి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సజీవ సాక్ష్యమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును సందర్శించిన అనంతరం పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ప్రస్తుత పరిస్థితిని వివరించి, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుచేశారు. ఆజంజాహీ మిల్లుకు వారసత్వంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ప్రస్తుత పరిస్థితి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఒకనాడు వరంగల్ జిల్లా, ఓరుగల్లు జిల్లా అంటేనే ఆజంజాహీ మిల్లుకు, ఇక్కడ పండే బ్రహ్మాండమైన పత్తికి ఆలంబనగా నిలిచి, చుట్టుపక్కల జిల్లాల నేతన్నలకు ఉపాధి కల్పించిన ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లా తన పూర్వ వైభవాన్ని కోల్పోయి, నేతన్నలు సూరత్, షోలాపూర్, బివాండి వంటి ప్రాంతాలకు వలసపోయే దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని మార్చి, వరంగల్‌ను ఒక సూరత్ లాగా, తమిళనాడులోని తిరుపూర్ లాగా టెక్స్‌టైల్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో ‘ఫామ్ టు ఫ్యాషన్’ – అంటే నల్లరేగడి నేలల్లో పండే తెల్ల బంగారం (పత్తి) తో రైతుకు, పరిశ్రమలో పనిచేసే మహిళలకు ఉపాధి దొరకాలనే సంకల్పంతో – భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.” సరిగ్గా ఎనిమిది ఏళ్ల కిందట, 2017 అక్టోబర్ 22 నాడు కేసీఆర్ ఇదే ప్రాంగణంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. మధ్యలో కరోనా కారణంగా రెండేళ్లు ఇబ్బంది కలిగినా, ఈరోజు ఇక్కడికి వొచ్చి చూస్తే కైటెక్స్, యంగ్‌వన్, గణేషా లాంటి పరిశ్రమలు దాదాపు 25-30 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోవడం సంతోషదాయకం. మేము కిటెక్స్ పరిశ్రమను సందర్శించి, అందులోని అత్యాధునిక స్పిన్నింగ్, గార్మెంటింగ్ పరిశ్రమలను పరిశీలించాం. దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌వన్ సంస్థకు కూడా పెద్ద ఎత్తున భూమిని కేటాయించాం. ఆ రోజు ధర్మా రెడ్డి శాసనసభ్యుడిగా రైతులను ఒప్పించి, ఉపాధి అవకాశాల గురించి వివరించి, బతిమిలాడి భూసేకరణ చేశారు. ఆ కల సాకారమై పరిశ్రమలు వచ్చి 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరడం చాలా సంతోషం. ఈ పార్కును ప్రారంభించిన నాడు భారతదేశంలో ఇలాంటి పాలసీ కూడా లేదు. పక్కన ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో వస్త్ర ఉత్పత్తి భారతదేశం (4%) కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. మన తెలంగాణను టెక్స్‌టైల్ హబ్‌గా మార్చాలనే విజన్‌తో ఈ పార్కును ఏర్పాటు చేశాం. ఈ రోజు ఈ రెండు మూడు పరిశ్రమలు తొందరగా ఉత్పత్తి పూర్తి చేసి, పూర్తి స్థాయిలో విస్తరిస్తే 30-40 వేల మందికి ప్రత్యక్షంగా, రెట్టింపు పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను ప్రారంభించిన తదనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నుండి స్ఫూర్తి పొంది, పీఎం మిత్ర అనే స్కీమ్‌ను నాలుగు సంవత్సరాల తర్వాత తీసుకొచ్చింది. ‘తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది’ అనే పద్ధతిలో మనం పెట్టిన ఈ పార్క్ భారతదేశానికి ఆదర్శంగా నిలబడటం చాలా సంతోషం. *ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి* గవర్నమెంట్లు, పార్టీలు మారవచ్చు గాక, కానీ రాష్ట్రం శాశ్వతం, రాష్ట్ర ప్రయోజనం శాశ్వతం. ప్రజలకు ఉపాధి కల్పించే ఇలాంటి దీర్ఘకాలిక కార్యక్రమాలు శాశ్వతం. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ ఇచ్చిన ఈ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. అయితే, ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన ఫ్లైఓవర్ (ఆర్.ఓ.బీ) పనులను పూర్తి చేయాలి. పార్క్ లోపల డ్రైనేజ్, సివరేజ్ సిస్టమ్, కామన్ ఫెసిలిటీస్ పనులు మందకొడిగా నడుస్తున్నాయి. వాటిని కూడా పూర్తి చేయాలని కోరుతున్నా.” “స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఉపాధి అవకాశాల విషయంలో చొరవ తీసుకుని, స్థానికులకే ఉద్యోగాలు దొరికే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేసిన ఈ కార్యక్రమాన్ని (దాదాపు 1500-1600 ఎకరాలలో డిజైన్ చేసింది) ముందుకు తీసుకెళ్లాలి. దానికి మా పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు మా సహకారం అందిస్తామని తెలియజేస్తూ, కేసీఆర్ గారి విజన్‌కు, దార్శనికతకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.





