పోలింగ్ తేదీ ప్రకటనతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయపార్టీల హడావుడి కొనసాగుతున్నది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ జూబ్లీహిల్స్‌పైనే ఫోకస్ పెడుతున్నాయి. కాగా రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఎన్నికలో పార్టీల విజయావకాశాలపై లెక్క లేస్తున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధానపార్టీలు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ ఈ ఎన్నికలో ఎట్టిపరిస్థితిలో కైవసం చేసుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. . అలాగే తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బిఆర్‌ఎస్ శక్తిమేర పోరాటానికి సిద్దమైంది. ఇతర పార్టీలకన్నా ముందే తన అభ్యర్థిని ప్రకటించడంతోపాటు, ప్రచారకార్యక్రమాన్ని చాలా ముందు నుండే బిఆర్‌ఎస్ ప్రారంభించింది. స్థానిక బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాలీ అయిన ఈ స్థానంలో ఆయన కుటుంబానికే అవకాశం ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి ప్రజల్లో ఉన్న సానుభూతి ని వోట్లుగా మలుచుకోవాలన్నది బిఆర్‌ఎస్ ఆలోచన.
మూడుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గోపీనాథ్ భార్య మాగంటి సునీతకే బిఆర్‌ఎస్ టికట్ ఇచ్చింది. కాగా కాంగ్రెస్, బిజెపిలు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ విషయంలో ఈ రెండు పార్టీలు కొంతకాలంగా తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఆశావహుల సంఖ్యకూడా పెద్దగానే ఉంది. ఎట్టి పరిస్థితిలో ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దన్న లక్ష్యంగా ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ గల్లీ స్థాయినుంచి దిల్లీవరకు అభ్యర్థి ఎన్నిక విషయంలో మంతనాలు జరుపుతున్నది.
వాస్తవానికి ఈ 22 నెలల పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నది. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్ వెంకటస్వామిలతో దీనిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి అభ్యర్థి ఎంపికపై సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధిష్టానానికి అందజేస్తున్నారు. అలాగే కొందరు ఆశావహులు అభ్యర్థిత్వం కోసం స్వచ్ఛందంగా సమర్పించిన దరఖాస్తుల సంఖ్య అంతా కలిపి రెండంకెలకు చేరుకుంది. వాటిని వడబోస్తున్న అధిష్టానం ఇప్పటికే ఒకరిద్దరి పేర్లను దృష్టిలో పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.
ఇదిలాఉంటే ఇటీవలకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో పట్టుదలను ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిని ఎంపిక చేయడమన్నది కాంగ్రెస్ చేతిలోపని. ఇక్కడ బీసీ అభ్యర్థిని ఎంపిక చేయడం ద్వారా తమ బీసీ నినాదానికి మరింత బలాన్ని చేకూర్చినట్లు అవుతుందన్న అభిప్రాయం కాంగ్రెస్‌కున్నట్లు తెలుస్తున్నది. దానికి తగినట్లుగా ఈ నియోజకవర్గంలో బీసీ వోటర్ల సంఖ్య అధికం కావడం కూడా ఒక కారణమవుతున్నది. అలాంటి పక్షంలో అభ్యర్థిత్వంకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నవీన్ యాదవ్, గత మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో నవీన్‌యాదవ్‌నే అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా, గత రెండు, మూడు సార్లు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయడం వల్ల స్థానిక ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా ఆయనకే అవకాశం లభించవొచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్‌కూడా తమ అభ్యర్థిని మంగళవారం రాత్రివరకు లేదా బుధవారం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.
ఇకపోతే బిజెపి కూడా ఇవ్వాళ రేపటిలోగా అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ఎందుకంటే ఆ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఎనిమిది అసెంబ్లీ, ఎనిమిది పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడం ద్వారా ప్రజల్లో తమ పార్టీ ఇమేజ్ పెరిగిందన్నది బిజెపి భావన. పైగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడం తమకు అనుకూలమంటున్నారు ఆ పార్టీ నేతలు. బిజెపి కూడా అభ్యర్థి ఎంపికపై త్రిసభ్య కమిటీ వేసింది. మంగళవారం సమావేశం అవుతున్న బిజెపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ దీనిపై త్వరలో ఒక నిర్ణయానికి వొచ్చే అవకాశమున్నప్పటికీ, ప్రధానంగా కొన్నిపేర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి.
గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమిచవిచూసిన లంకల దీపక్‌రెడ్డికే తిరిగి టికట్ లభిస్తుందనుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం బిజెపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాగా బిఆర్‌ఎస్ మహిళ అభ్యర్థిని నిలబెటుతుండడంతో తాము కూడా మహిళకు అవకాశమిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా బిజెపి చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ మహిళకు ఇవ్వాలనుకుంటే పారిశ్రామిక వేత్తగా పేరున్న జూటూరి కీర్తిరెడ్డి, జూబ్లీహిల్స్‌లో వైద్యురాలిగా పేరున్న వీరపనేని పద్మకు అవకాశం లభించవొచ్చనుకుంటున్నారు. ఇటీవల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సినీనటి జయసుధను కలవడంతో ఆమె పేరు కూడా ప్రచారంలో ఉంది. మొత్తం మీద ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థి ఎంపికపై అన్ని కోణాల్లో కసరత్తుచేయడం చూస్తుంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎంత ప్రాధాన్యత ఉన్నదన్నది అర్థమవుతున్నది.





