“ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఎనిమిదో మహాసభలు ఫిబ్రవరి 7 & 8 తారీఖుల్లో కర్నూల్లోని కెవిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగనున్నాయి. మహాసభల అంశం: ద్రావిడ సమాజ సాహిత్యాలు – సారూప్యత- ఐక్యత – పోరాటం. ఈ సందర్భంగా ప్రజాతంత్ర ‘శోభ’ పేజీ పాఠకుల కోసం- సభలో పాల్గొంటున్న వక్తలకి ‘ద్రావిడ సాహిత్యోద్యమం రాబోతున్నదా?’ అన్న ప్రశ్న ఇచ్చి సమాధానాలు తీసుకుని ప్రచురిస్తున్నాం.”
కె ఎన్ మల్లీశ్వరి (శోభ టీమ్)
ఎపుడో మొదలైంది
ప్రాచీనకాలం నుంచీ అలిఖిత, మౌఖిక, చిత్రరూప సాహిత్యం చాలా వుంది. అవి అతి ప్రాచీనమైన ద్రావిడ సాహిత్యరూపాలు. ఆది ద్రావిడ భాషాకుటుంబంలోని సాహిత్యమే ద్రావిడసాహిత్యం. ఒకే భాషా కుటుంబం పరిణామక్రమంలో విడివడినప్పటికీ, దాని సారం ద్రావిడమే. అందువల్ల తమిళ, కన్నడ, మళయాల, తులు, కువి, తదితరభాషలలోని పాటలు, కావ్యాలు, నాటకాలు, ఇతరేతర రూపాలన్నీ ద్రావిడసాహిత్యమే అవుతుంది. తెలుగులో, అది అచ్చతెలుగు కావ్యాల రూపంలో వచ్చింది. పద్యకావ్యాలను సరళం చేస్తూ, బౌద్ధనీతిని బోధించే నీతిశతకాలు ద్రావిడ సాహిత్యమే అవుతుంది. ఆధునికకాలంలో గ్రాంధికభాషకు వ్యతిరేకంగా వచ్చిన వ్యవహారిక భాషా ఉద్యమం కూడా ద్రావిడ సాహిత్యమే. ద్రావిడ సాహిత్య మౌలిక తాత్వికత సమానత్వం. ప్రబంధ సాహిత్యం వర్ణ, కులవ్యవస్థను సమర్ధిస్తున్నది కాబట్టి, అది ద్రావిడ సాహిత్యం పరిధిలోకి రాలేదు.
కన్నడం, తెలుగులో వచ్చిన అద్భుతమైన వచన సాహిత్యం అంతా ద్రావిడమే. మహాకవీ, సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు, అక్క మహాదేవి, హరళయ్య, చెన్నయ్యల వచనాలు, పాల్కురికి సోమన ద్విపద కావ్యాలు, పోతులూరి వీరబ్రహ్మం, యోగి వేమన పద్యాలు అన్నీ ద్రావిడమే. వలస పాలన కాలంలో తొలి నవలారచయిత నరహరి గోపాలకృష్ణమశెట్టి రాసిన రంగరాజచరిత్రము ద్రావిడమే. మానవ సమాజంలోని అన్నిరకాలైన అసమానతలను వ్యతిరేకించి, సమానత్వాన్ని ప్రతిపాదించే సాహిత్యమంతా ద్రావిడసాహిత్యమేని నా భావన. అది సామాజికన్యాయాన్ని సమర్ధిస్తుంది. కుల, వర్గనిర్మూలనలను ప్రతిపాదిస్తుంది. అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీవాద, తెలంగాణ ప్రాంతీయ, ముస్లిం, మైనార్టీ వాదాలన్నీ ద్రావిడ సాహిత్యమే అవుతుంది. అందువల్ల ద్రావిడ సాహిత్యం ఎప్పుడో మొదలైంది. కానీ వేర్వేరుపేర్లతో వ్యక్తమైంది. ఇప్పుడు దాని పాతపేరును గుర్తుచేయాలి. అది సమిష్టి నామ్నీకరణమని రచయితలు, సాహిత్యపాఠకులు అంగీకరిస్తే చాలు. ద్రావిడసాహిత్యం ఫాసిస్టుపీడన సందర్భంలో నిజమైన ప్రత్యామ్నాయంగా, పరిష్కార మార్గంగా అర్థమవుతుంది.





