ఇరాన్ సుప్రీం లీడర్‌  అయతొల్లా అలీ ఖమేనీ మృతి  

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్‌పై జరిగిన దాడుల వల్ల దశాబ్దాలుగా దేశ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ఇరాన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇజ్రాయెల్ మరియు అమెరికాకు ఉమ్మడి ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన ఖమెనీ మరణం దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే సంఘటనగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల ముందే సుప్రీం లీడర్ మరణాన్ని ప్రకటిస్తూ, ఇరాన్ ప్రజలు ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని పిలుపునిచ్చారు. యుద్ధం రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో దాడుల తరంగం కొనసాగుతుండగా, ఆదివారం ఉదయం ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ కూడా ఖమెనీ మరణాన్ని ధృవీకరించింది.

ఇరాన్ వార్తా సంస్థ తస్నీమ్ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం తెల్లవారుజామున ఆయన నివాసంలోని కార్యాలయంపై జరిగిన దాడిలో ఖమెనీ మరణించారు. ఈ దాడుల్లో మరికొందరు ఉన్నత స్థాయి ఇరాన్ నాయకులు కూడా మరణించినట్లు ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలిసిన వర్గాల ప్రకారం, ఇరాన్ నాయకత్వంపై అమెరికా, ఇజ్రాయెల్ నెలల తరబడి లోతైన గూఢచారి సమాచారాన్ని సేకరించాయి. ఖమెనీ మరణ వార్తతో టెహ్రాన్ సహా ఇరాన్‌లోని అనేక నగరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోగా, మరికొందరు ఆయన మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. సుప్రీం లీడర్‌కు నేరుగా విధేయంగా పనిచేసే శక్తివంతమైన సంస్థ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.

అధికార మార్పిడి కాలంలో ఇరాన్ అధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్‌కు చెందిన ఒక న్యాయవేత్త కలిసి దేశ బాధ్యతలు నిర్వహిస్తారని సీనియర్ రాజకీయ నాయకుడు మొహమ్మద్ మొఖ్బర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. అయితే సుప్రీం లీడర్ మరణంతో చివరికి దేశాన్ని ఎవరు నడిపిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 86 ఏళ్ల ఖమెనీ మరణం  ఆయన నిర్మించిన రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకువస్తుందా అనే విషయం స్పష్టంగా లేదు. అధికారంలో ఉన్న అనేక మంది ఆయన ఆశ్రయంతోనే తమ పదవులు పొందారు. ఇటీవల భారీ ప్రజా నిరసనలను వేలాది మందిని హతమార్చుతూ అణచివేసిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దేశంపై తమ పట్టు ఎంత బలంగా ఉందో చూపించింది.

శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఒక గంట సమయంలో ప్రారంభమైన ఇరాన్‌పై తొలి దాడుల నుంచే ప్రభుత్వ మార్పు తమ లక్ష్యమని అధ్యక్షుడు ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. “మేము పూర్తిచేసిన తర్వాత మీ ప్రభుత్వం మీదే ఉంటుంది. దానిని మీరు స్వాధీనం చేసుకోండి,” అని ట్రంప్ వీడియో సందేశంలో ఇరాన్ ప్రజలకు తెలిపారు.

ఇరాన్ సుప్రీం లీడర్ మరణం ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ, అధికార శూన్యత మరియు అస్తవ్యస్త పరిస్థితుల వాతావరణం  కనిపిస్తుంది . దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై పలుసార్లు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. అక్కడ అధికారులు ఒకరు మరణించినట్లు తెలిపారు. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ దేశాలు కూడా దాడులకు గురైనట్లు ప్రకటించగా, జోర్డాన్ కూడా లక్ష్యంగా మారింది. ఇరాన్ క్షిపణి దాడుల నుంచి పడిన శకలాలు ఎమిరేట్స్‌లో కనీసం ఒకరి మరణానికి కారణమైనట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.

ఈ యుద్ధం ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు రవాణా జరిగే హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకాశ్రయ రవాణాను పూర్తిగా నిలిపివేసిందని షిప్పింగ్ కంపెనీలు మరియు తస్నీమ్ పేర్కొన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అనేక ప్రధాన విమానాశ్రయాలు, విస్తృత వైమానిక మార్గాలు మూసివేయబడ్డాయి. ఈ దాడులు స్పష్టమైన ముగింపు లేకుండా అమెరికాను దీర్ఘకాలిక యుద్ధంలోకి లాగవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విస్తృత సైనిక సామర్థ్యాలు మరియు ప్రాంతీయ మద్దతు బలగాల నెట్‌వర్క్‌పై ఇరాన్ నాయకత్వం నియంత్రణ కలిగి ఉండటం వల్ల ప్రతిఘటన దీర్ఘకాలం కొనసాగవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *