హాజరుకానున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : సిరిసిల్లలోని పెద్దూరు అపెరల్ పార్కులో రూ. 102 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక దుస్తుల పరిశ్రమను వ్యవసాయ, జౌళి, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబులు శుక్రవారం నాడు ప్రారంభించనున్నారు. ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్ల గురించి గురువారం సచివాలయంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఇతర అధికారులతో మంత్రులు సమీక్ష జరిపారు. అంతంత మాత్రం ఆదాయంతో ఇబ్బంది పడుతున్న బీడీలు చుట్టే మహిళలు, పద్మశాలి సామాజిక వర్గం వారికి కుట్టు పనిలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.
పారిశ్రామిక షెడ్లు, విద్యుత్ సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా బెంగళూరుకు చెందిన టెక్స్ పోర్ట్ ఇండస్ట్రీస్ రూ.40 కోట్లతో యంత్రాలను ఏర్పాటు చేసి పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఇక్కడ రూపొంచిన దుస్తులను ‘టెక్స్ పోర్ట్’ వంద శాతం ఎగుమతి చేస్తుంది. ఏటా రూ. 300 కోట్ల విలువైన దుస్తులను టామీ హిల్ఫిగర్, రాబర్ట్ గ్రాహం, వ్యాన్స్, మైఖేల్ కోర్స్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరా చేస్తుంది. ఏటా 70 లక్షల పీస్ లు తయారు అవుతాయి. ప్రస్తుతం వెయ్యి కుట్టు మిషన్లను ఏర్పాటు చేసి రెండు షిఫ్టుల్లో 1600 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తారు. మరో 3 ఏళ్లలో ఇంకో 2000 కి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ప్రారంభ కార్యక్రమం అనంతరం మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు ఉద్యోగాలు పొందిన మహిళలకు నియామక పత్రాలు అందజేస్తారు. 1.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీజీఐఐసీ బిల్ట్ టు సూట్ యూనిట్ ను నిర్మించింది . దీనికి రూ.62 కోట్ల వ్యయం అయింది.