- ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లోనూ స్థానిక కోటా
- తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం
- నిర్దారణకు మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 5(ఆర్‌ఎన్‌ఎ) : రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి స్థానికత వివాదంపై పూర్తిస్థాయి వాదనలను విన్న హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. స్థానికులు ఎవరనే అంశంపై సరైన మార్గనిర్దేశకాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది.
స్థానికత నిర్ధారణకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. కాళోజీ నారాయణరావు వైద్య యూనివర్సిటీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని ఆదేశించింది. మెడికల్ అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ రూల్ ’3ఏ’ను చేరుస్తూ ప్రభుత్వం జీవో 33ను జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బి.మయూర్‌రెడ్డి, డి.వి.సీతారాంమూర్తి తదితరులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల సవరణ వల్ల స్థానికులకే ఎక్కువ నష్టం వాటిల్లుందన్నారు. ఇతర రాష్ట్రాల వారితోపాటు భారతీయ మూలాలున్న ప్రవాసులు ఇక్కడ 4 ఏళ్లు చదువుకుంటే 85 శాతం స్థానిక కోటా కింద అవకాశం దక్కించుకుంటారన్నారు. దీనివల్ల తెలంగాణలో పుట్టిపెరిగిన వారికి నష్టం వాటిల్లుతుందన్నారు. స్థానిక కోటా ఇక్కడ నివాసం ఉన్నవాళ్లకే అడుగుతున్నామని, చదువుకున్నవారు అన్న దానిపై అడగడం లేదన్నారు. ఉద్యోగులు బదిలీ కావడం వంటి పరిస్థితుల్లోనూ..అలాగే మెరుగైన విద్య కోసం..ఇంటర్ మరో రాష్ట్రంలో చదువుకున్న తెలంగాణ విద్యార్థి స్థానికుడు కాదనడం సరికాదన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఇస్తామన్న ప్రభుత్వం..ప్రైవేటు ఉద్యోగుల పిల్లలకు అవకాశం నిరాకరించడం వివక్ష చూపడమేనన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకువచ్చినట్లు తెలిపారు. నిబంధనలు తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి ఇరుపక్షాల వారు పలు సుప్రీమ్ కోర్టు, హైకోర్టుల తీర్పులను ధర్మాసనం ముందుంచారు. వాదనలను విన్న ధర్మాసనం తీర్పు వెలువరించింది.
స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం తీర్పును వెలువరించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని సచించింది. కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల్లో స్థానికత జీవోకు సంబంధించిన అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. వైద్యారోగ్యశాఖ జారీ చేసిన జీవోను పలువురు విద్యార్థులు సవాల్ చేశారు. ఆయా పిటిషన్లపై వాదనలు విన్న సీజే ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.





