గల్ఫ్‌ ఎక్స్ గ్రేషియా చెల్లింపున‌కు మరో రూ.కోటి విడుదల

వేముల‌వాడ‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20 : గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర‌ ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం బుధవారం అదనంగా మ‌రో కోటి రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో బుధవారం 17 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున రూ.85 లక్షల ఆర్థిక సహాయం మంజూరు పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో నిధుల కొరత లేకుండా అదనంగా మరో కోటి రూపాయలు విడుదల చేశారు. గత నెలలో విడుదల చేసిన రూ.6 కోట్ల 45 లక్షలకు ఇది అదనం. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నేనున్నానంటూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భరోసాగా నిలిచారని, గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ అభయహస్తం అందిస్తోంద‌ని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డాక్ట‌ర్‌ బిఎం వినోద్ కుమార్, కాంగ్రెస్‌ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.25 లక్షలు, కామారెడ్డికి రూ.20 లక్షలు, జగిత్యాలకు రూ.15 లక్షలు, నిజామాబాద్, రంగారెడ్డి, నిర్మల్ జిల్లాలకు రూ.10లక్షల చొప్పున, హైదరాబాద్, నల్ల‌గొండ‌ జిల్లాకు రూ.5 లక్షల చొప్పున మొత్తం ఒక కోటి రూపాయలు గల్ఫ్‌ ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం ప్రభుత్వం అదనంగా కేటాయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *