ధర్మాసనం సీరియస్..
చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు
ఎలాంటి పనులు చేపట్టవద్దన్న ‘సుప్రీమ్’ ధర్మాసనం..
గచ్చీబౌలి భూములపై ప్రభుత్వానికి షాక్
తీర్పుపై హెచ్‌సీయూ విద్యార్థులు హర్షం..
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనం.. ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ గవాయ్ ధర్మాసనం సీరియస్ అయ్యింది. మూడు రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీన్ని చాలా సీరియస్ అంశంగా పరిగణించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని మండిపడింది. విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను ఉన్నత న్యాయస్థానం పరిశీలించింది.
అలాగే మీడియా కథనాలను సైతం జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు అమికస్ క్యూరీ పరమేశ్వర్ ఉంచగా.. వాటిని పరిశీలించింది. కాగా, ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చింది. ఇంత అత్యవసరంగా భూముల్లో చెట్లు తొలగించి పనులు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వొచ్చిందని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15న నియమించిన కమిటీలోని అధికారులు సైతం సమాధానం చెప్పాలని హుకుం జారీ చేసింది. ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా.. చెట్లు కొట్టేసే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికలోని ఫొటోలు చూసి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చని చెప్పింది. వందల కొద్దీ యంత్రాలు మోహరించాల్సిన అగత్యం ఏంటో అర్థం కావడం లేదని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీం కోర్టుకు తెలుపగా.. హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని జస్టిస్ బీర్ గవాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన పనులపై స్టే విధించింది ఉన్నత న్యాయస్థానం. అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 16న తదుపరి విచారణ చేపట్టనుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై హెచ్‌సీయూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గో బ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. భారీ వర్షంలోనూ నిరసనలు తెలుపుతున్నారు. విద్యార్థుల నినాదాలతో యూనివర్శిటీ ప్రాంగణం దద్దరిల్లింది.