– సంక్రాంతి కానుకగా మహిళల ఖాతాల్లో రూ.30వేలు జమ
– మద్దతు ధరలకు అదనంగా రూ.300 నుంచి రూ.400 చెల్లింపు
– సొంతూరికి 70 కి. దూరంలోనే ఉద్యోగుల బదిలీలు
– మీడియా సమావేశంలో ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్
పాట్నా, నవంబర్ 4: బీహార్ ఎన్నికలలో ఆర్‌జెడి నేత, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన తేజస్వియాదవ్ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా రైతులు పండించిన వరి, గోధుమలకు ఎంఎస్‌పి కంటే అదనపంగా క్వింటాకు రూ. 300, 400 చొప్పున చెల్లించనున్నట్లు హామీనిచ్చారు. మహిళల బ్యాంకు ఖాతాలో రూ.30 వేల చొప్పున జమ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులు, టీచర్లు, ఆరోగ్య కార్యక్తల బదిలీలు వారి సొంత ఇంటికి 70 కిలోమీటర్లలోపే ఉంటాయని ప్రకటించారు. ఇప్పటికే ఇంటికో ఉద్యోగం ప్రకటించిన తేజస్వీ ఎన్‌డిఎ కూటమిని దెబ్బతీసేందుకు అలవికాని హామీలు ఇస్తున్నారు. తాజాగా మహిళా వోటర్లను ఆకట్టుకునేందుకు కీలక హామీ ప్రకటించారు. పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో మంగళవారం తేజస్వియాదవ్ మాట్లాడుతూ ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ‘మై-బహిన్ మాన్ యోజన’ను ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగా జనవరి 14 సంక్రాంతి రోజున రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి రూ.30వేలు కానుకగా అందచేస్తామని వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బిహార్ ప్రభుత్వం ఇటీవల అక్కడి మహిళలకు నవరాత్రి కానుకగా ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసిన నేపథ్యంలో తేజస్వీ ఈ ప్రకటన చేశారు. గత వారం ప్రతిపక్షాలు విడుదల చేసిన మేనిఫెస్టో ప్రకారం డిసెంబర్ 1 నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయంగా రాబోయే ఐదేళ్లు ఒక్కో సంవత్సరానికి మొత్తం రూ.30,000 ఇస్తామని తేజస్వీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అధికారంలోకి వొచ్చిన వెంటనే మొదటి ఏడాదికి మహిళలకు రూ.30వేలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మహిళల కోరిక మేరకు ఏడాదికి చెల్లించే మొత్తం రూ.30 వేలను జనవరి 14న వారి ఖాతాలకు బదిలీ చేస్తామని తేజస్వీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ ఇటీవల ‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రణ్’ పేరుతో తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులో తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర హామీలను అమలు చేస్తామని పేర్కొంది. రైతులకు నీటి పారుదల కోసం ఉచిత విద్యుత్ అందిస్తాము. మై బహీన్ మాన్ యోజన కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో జనవరి 14వ తేదీకల్లా రూ.30,000లు జమ చేస్తాం. ఇది సంవత్సరం మొత్తానికి వర్తిస్తుంది. నూతన సంవత్సరం, మకర సంక్రాంతి పండుగల సందర్భంగా ముందుగానే నగదును జమ చేస్తాం. నిత్యవసర ధరలు పెరిగిన ఈ సమయంలో ఈ డబ్బుతో వారికి కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రంలోని మా తల్లులు, సోదరీమణుల డిమాండ్ల మేరకే మా ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి మహాగట్బంధన్ కట్టుబడి ఉందని తేజస్వి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తల బదిలీలు వారి ఇంటి నుండి 70 కిలోటర్ల లోపే వారి బదిలీలు చేస్తాము. బదిలీల పోస్టింగ్‌లో కచ్చితంగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాము. దీన్నే మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించామని తేజస్వి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





