మంటగలుస్తున్న మానవ సంబంధాలు

తాత మనవడు  సినిమాలో సినారె రాసిన   అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం  ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అని ప్రతి ఒక్కరూ పాడుకునేలా  చేస్తున్నాయి  నేటి మనుషుల తీరు  చూస్తుంటే.  ప్రతి రోజు కేరళ నుంచి కాశ్మీర్ వరకు  జరుగుతున్న  ఉదంతాలు  చూస్తుంటే ఇది నిజమనిపిస్తుంది. ఈ రోజుల్లో సమాజంలో భార్య భర్త విడాకులు తీసుకోవడం, అక్రమ సంబంధాలు వంటివి పెరిగినట్లు అనిపిస్తోంది. ఆశ్చర్య మేమిటంటే ,  ఇది మామూలే అనే నిర్లిప్త ధోరణిని ప్రజలు వ్యక్తపరచటం.విడాకులు, అక్రమ సంబంధాల వల్ల  కుటుంబ వ్యవస్థ కూలిపోవటం, భార్యాభర్తల మధ్య పరస్పర అనుమానాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు, తద్వారా వారి పిల్లలు అనాధలు కావడం వంటి విషాదకర పరిణామాలు చోటుచేసుకుంటాయి. క్షణిక సుఖం కోసం  అక్రమ సంబంధాలు వివాహ వ్యవస్థ కే సవాల్ విసురుతున్నాయి.

     రెండు నెలల్లో  ముగ్గురు భర్తలను  మార్చిన  వనిత. ప్రేమ కాదన్నందుకు పదో తరగతి అమ్మాయి తల్లిని చంపిన ఉదంతం. తల్లీ కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకొని నవ వరుడిని చంపిన సంఘటన, చదువు చెప్పాల్సిన నలభై ఏళ్ల టీచర్ పడవ తరగతి అబ్బాయితో అక్రమ సంబంధం .  ఇటీవల ముగ్గురు  పిల్లల తల్లి(39) తన  కుమార్తెతో  వివాహం నిశ్చయమైన 24 సంవత్సరాల  వ్యక్తితో  లేచిపోయింది. హైదరాబాద్ లో  గురుమూర్తి అనే వ్యక్తి తన  భార్యను  అత్యంత కిరాతకంగా నరికి చంపి కుక్కర్లో  ఉడకబెట్టి చెరువులో  పడేశాడు. మరొక వ్యక్తి  మోరీలో  పడేసి సిమెంట్ తో కప్పి పడేసింది. అక్రమ సంబంధంతో  సుఖపడదామని ముక్కు పచ్చలారని ముగ్గరు అబ్బాయిలను విషం ఇచ్చి  చంపింది ఒక మహా తల్లి. భర్తకు  కరెంటు  షాకిచ్చి  చంపింది  ఒక  ఇల్లాలు. కర్ణాటక మాజీ  డీజీపీ ప్రకాష్ ను  అత్యంత దారుణంగా చంపింది  తన  భార్య. కేంద్ర మంత్రి మనవరాలిని  దారుణంగా హత్య చేశారు తన భర్త.  రెండేళ్లు కాపురం చేశాక లవర్ వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది మరో యువతి. పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన ఘటనలు, హత్యలు కోకొల్లలు. గతంలో ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఎక్కడో  జరిగింది అనుకునే వారు. కానీ  ఇప్పుడు తమ సమీప ప్రాంతాల్లో ఇలాంటి నేర ప్రవృత్తి  పెరిగి పోవడం దానికి  పేద ధనిక కులం మతం ప్రాంతం అన్నీ సమానంగా ఉంటున్నాయి.
     మనిషిని  అంతమొందించాలంటే ఎలా అని రోజుల కొద్దీ  ఆన్లైన్ లో తర్ఫీదు పొందుతున్నారు. పనికిమాలిన పనులు చేయడానికి  సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. డీప్ ఫక్ టెక్ ఫాగ్ చాలా టూల్స్ ద్వారా  మనుషులను  మోసం చేస్తున్నారు.  మనిషికి  కృతిమ మేధస్సు  ఎలా  సహాయపడుతుందో అలాగే వారి  ఆచూకీ తెలుపడానికి ఉపయోగపడుతోంది.  ఈ వార్తలు చూసినప్పుడు  క్షణిక సుఖం కోసం కుటుంబ విలువలు మంటగలుపుతున్నారు. ఇతరుల మోజులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు సమాజంలో ఎవరికైనా ఆపద వస్తే ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. నేడు పరిస్థితులు మారిపోయాయి ఏది జరిగినా మనకెందుకులే అనుకునే సంస్కృతి సమాజంలో పెరిగిపోయింది. వ్యక్తి ఎంత సేపు ఆర్థిక సంబంధాలు కొరకు మాత్రమే మానవ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు ఒకరితో మనం కలిసి ఉంటే మనకు వారు ఏ విధంగా ఉపయోగపడతారు అనే ఆలోచన సమాజంలో పెరిగిపోయింది. చివరికి కుటుంబ సభ్యుల అనుబంధాలు కూడా ఆర్థిక సంబంధాలు గా మారిపోవడం చాలా బాధాకరం.
    ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండేవారు. ఆ కుటుంబంలో ఉండే పెద్దవారు కుటుంబ సభ్యులకు వారికి తెలియ కుండానే వ్యక్తిత్వ వికాస బోధన చేసేవారు. వారి ప్రవర్తన చూసి పిల్లలు నేర్చుకునే వారు. భవిష్యత్తులో సమాజంలో ఏ విధంగా ఉంటే మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారో వారికి దిశ నిర్దేశం చేసేవారు. నేటి ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. న్యూక్లియర్‌ ఫ్యామిలీస్‌ ఏర్పడ్డాయి. ఆధునిక ప్రపంచంలో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు గా మారడానికి ప్రధాన కారణాలు తను మాత్రమే ఎదగాలని వ్యక్తిగత స్వార్థం, సామాజిక స్పృహ లోపించడం, సోషల్‌ మీడియా, ఉమ్మడి కుటుంబాలకు దూరంగా ఉండడం వంటివి. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణల వల్ల వారిద్దరి మధ్య మానవ సంబంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయి. సోషల్‌ మీడియా ప్రభావానికి లోనై ప్రజలు భౌతికంగా సంభాషించడం మానేసి చాలా రోజులైంది. వారి హావభావాలకు వేదికగా సోషల్‌ మీడియాని ఉపయోగించు కుంటున్నారు. వారికి సంతోషం వచ్చినా బాధలు వచ్చినా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఫేస్బుక్‌, ట్విట్టర్‌, యూ ట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా సాధనాలలో ఎక్కువ సమయం గడుపుతూ భౌతికంగా వ్యక్తుల మధ్య ఉండే సంభాషణలు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు దూరమవుతున్నారు. సామాజిక మాధ్యమాలలో ఉండే స్నేహితులు వారికి నిజమైన స్నేహితులుగా భావిస్తున్నారు. తద్వారా భౌతికంగా విద్యార్థి దశలో, ఉద్యోగంలోనూ సామాజిక జీవనంలో కూడా స్నేహితులకు దూరమవుతున్నారు. సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతూ వాటిలో వచ్చే లైక్లు, కామెంట్లు చూసి సంబరపడిపోతున్నారు. అవి లేకపోతే బాధపడుతున్నారు. మానసికంగా కుంగిపోతున్నారు. ప్రత్యక్ష అనుభూతులకు దూరమవుతున్నారు. సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టుల్లో నిజాలు గోరంతయితే దాన్ని కొండంతగా చూపించే పద్ధతికి అలవాటు పడుతున్నారు.ఊహాలోకంలో విహారిస్తున్నారు. అదే సర్వస్వం అనుకుంటున్నారు. ఇది వ్యక్తి సమగ్ర అభివృద్ధికి, వికాసానికి గొడ్డలి పెట్టులాంటిది.
      స్టేట్‌ ఆఫ్‌ మొబైల్‌ -2025 ప్రకారం భారతీయులు ప్రతిరోజు 5 గంటల పాటు స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగిస్తూ ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్న వారిలో ప్రపంచంలోనే ఎనిమిదవ స్థానంలో భారతీయులు ఉన్నారు. దేశజనాభాలో 48.24 మిలియన్ల మంది ప్రజలు సోషల్‌ మీడియాలో రోజు యాక్టివ్‌గా ఉంటున్నారు. భారతీయ జనాభాలో యాక్టివ్‌గా సోషల్‌ మీడియా ఉపయోగిస్తున్న ప్రజలు 34.6శాతం. వీరు సగటున 2.72 గంటలు ప్రతీ రోజు సోషల్‌ మీడియాలో గడుతున్నారు. ఇది గమనించిన రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో సోషల్‌ మీడియా వేదిక ద్వారానే అత్యధిక ప్రచారం చేయనున్నాయి. ఎన్నికల టైంలో ప్రజలు ఇంకా ఎక్కువ కాలం సోషల్‌ మీడియాలో గడిపే అవకాశం ఉంది. ప్రజల అవసరాలను గమనించిన సోషల్‌ మీడియా కంపెనీల యజమానులు వారి కాసుల పంట పండించు కుంటున్నారు. కోట్ల రూపాయలకు పడగెత్తుతున్నారు. ఒక వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలవారుగా రూపొందడంలో తల్లిదండ్రులు, సమాజం, నేర్చుకునే విద్య, చదివే పుస్తకాలు, చేసే వృత్తి పాటించే నైతిక విలువలు చాలా ముఖ్యమైనవి. వీటన్నిటికీ దూరమై కేవలం సోషల్‌ మీడియా లోనే వారి జీవితాన్ని గడుపుతూ పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందలేకపోతున్నారు. ప్రేమ ఆప్యాయత అనురాగాలకు దూరమవుతున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా బతుకుతున్నారు.
     సోషల్‌ మీడియా వల్ల అన్ని అనర్థాలే ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కొన్ని సందర్భాల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సామాజిక మాధ్యమాల్లో అందరూ స్పందించి వారికి సహాయం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలను సమస్యల పరిష్కారానికి వాడుతుండడం గమనార్హం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విద్యార్థులకు విషయ అవగాహన కల్పించడం కోసం కూడా సామాజిక మాధ్యమాలు ఉపయోగ పడుతున్నాయి. ఒకప్పుడు విద్యార్థులకు, ఉద్యోగులకు ఏదైనా సృజనాత్మక ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించి మిత్రులతో చర్చించి దానికి పరిష్కారం కనుగొనేవారు.
కానీ ప్రస్తుతం ఏ సందేహం వచ్చినా ఏ ఆలోచన వచ్చినా దానికి సంబంధించి గూగుల్‌, యూట్యూబ్లో వెతకడం పరిపాటిగా మారింది. బాల్యంలోనే విద్యార్థులకు నైతిక విలువలు, మానవ సంబంధాలు, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన, వీటిని విద్యా విధానంలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. విద్యార్థులను, యువకులను ధనార్జక యంత్రాలుగా కాక మానవీయత కలిగిన వారుగా, మంచి పౌరులుగా రూపొందించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. అదే రేపటి తరానికి మార్గదర్శక మవుతుంది.
డా. ముచ్చుకోట. సురేష్ బాబు, 

 9989988912

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page