– యువతకు ఆధునిక శిక్షణ అందిస్తాం
– విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ట్రైనింగ్ ఇప్పిస్తాం
– మంత్రి వివేక్ వెంకటస్వామి
సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి రూ.45 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో రూ.40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు డైరెక్టర్, ఉపాధి కల్పన అండ్ శిక్షణ శాఖ ఏ.నిర్మల క్రాంతి వెస్లీ, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితెతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి వివేక్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ నెల 15వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన పెన్షన్లకు సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో రూ. 4000 వేల కోట్లతో 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఐటీఐలను రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరిస్తోందన్నారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించామని, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైపెండ్ అందిస్తున్నామని తెలిపారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని విదేశీ భాషల శిక్షణ అందిస్తున్నామని, రుద్రంగికి జర్మన్ భాషా శిక్షకుడిని పంపించి 100 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగపడే విధంగా ఏటీసీల్లో నూతన కోర్సులు ప్రవేశపెడతామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి కలెక్టర్లు, ఎస్పీలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..రుద్రంగిలో 1986లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటై విద్యాభివృద్ధికి దోహదపడిందన్నారు. వడపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లు అభివృద్ధి చేయిస్తున్నామని, విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయించామని వివరించారు. త్వరలో హ్యామ్ ద్వారా వివిధ రోడ్లు అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు కోసం రూ.45 కోట్ల భూసేకరణ చేపట్టామని తెలిపారు. ఆయా పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఆలయ విస్తీర్ణం పెరుగుతుందని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వేములవాడ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, వాగుపై రెండో వంతెన నిర్మాణం తుది దశకు చేరుకుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం పక్కగా అమలు చేస్తోందన్నారు. రుద్రంగి ఏటీసీలో 288మంది విద్యార్థులు ఏడు కోర్సుల్లో శిక్షణ పొందే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. మర్రిపల్లిలో రైతు విజ్ఞాన కేంద్రం, ఆధునిక గోశాల కోసం చెరో 40 ఎకరాలు కేటాయించినట్లు వెల్లడించారు.
పరిశ్రమలకు ఉపయోగపడే శిక్షణ
ఏటీసీల ద్వారా ప్రస్తుత పరిశ్రమలకు ఉపయోగపడే శిక్షణ ఇస్తారని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ప్రత్యేక చొరవతో అడ్వాన్సడ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ అవసరమైన కోర్సులు రూపొందించారని తెలిపారు. ఏటీసీల్లో ఏడు కోర్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, ఇతర ఆధునిక కోర్సులలో శిక్షణ అందించి.. ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని తెలిపారు. నియోజకవర్గంలోని యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. స్థానిక ఏటీసీ కేంద్రం ఈ ప్రాంతం వారికి చాలా కీలకమని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ ముకుంద రెడ్డి, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసాచారి, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, మైనింగ్ శాఖ ఏడీ క్రాంతి, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్, సర్పంచ్ గండి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



