– కొత్తగా ‘6 సీ’లతో దోపిడీ
– బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తయినా పరిపాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని, ఖజానా ఖాళీ అయి అప్పు కూడా పుట్టని దయనీయ స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని, ప్రజలు వాటిని మర్చిపోయేలా కొత్తగా 6 (సీ)ల దోపిడీ పాలనను సాగిస్తోందని ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
1. క్రైం : శాంతిభద్రతలు క్షీణించి బెయిల్‌పై వచ్చి హత్యలు చేసే స్థాయికి నేరాలు పెరగడం
2. కరప్షన్ : పతాక స్థాయికి చేరిన అవినీతి
3. కమీషన్లు : ప్రతి పనిలోనూ కమీషన్లు దండుకోవడం
4. కాంట్రాక్టులు : కాంట్రాక్టుల పేరిట నిధుల మళ్లింపు
5. హైకమాండ్ : పదవుల రక్షణ కోసం దిల్లీ పీఠానికి కప్పం కట్టడం
6. ఆధిపత్యం: ప్రజలపై, వ్యవస్థలపై ఆధిపత్యం చలాయించడం
ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి దోచుకోవడం, దాచుకోవడం, దిల్లీకి మూటలు పంపి పదవులు కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రోజురోజుకూ ప్రభుత్వ అప్పులు పెరిగిపోతూ ఆస్తులు తరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో మంత్రుల ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయని, అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు వందల కోట్ల అప్పును నిమిషాల వ్యవధిలో చెల్లించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. మంత్రులకు కప్పం కడితే పదవులు పదిలంగా ఉండే పరిస్థితి దాపరించిందన్నారు.
40సార్లు అధికారుల మార్పు – ఐఏఎస్, ఐపీఎస్‌లపై వేధింపులు
ప్రభుత్వానికి పరిపాలనపై అస్సలు పట్టు లేదని, రెండున్నరేళ్లలోనే 40 సార్లకుపైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిం<Áని ప్రభాకర్ అన్నారు. తమ అక్రమాలకు తలొగ్గని అధికారులను బదిలీల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల మధ్య సఖ్యత, సమన్వయం లేకపోవడంతో గొడవలు బయటపడతాయనే భయంతోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రి పరిధిలోనే విద్యాశాఖ ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో రోజుకోచోట ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతున్నాయంటూ దీనికి ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అవినీతి కేసుల్లో తెలంగాణ అధికారులే టాప్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో తెలంగాణ అధికారులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని ప్రభాకర్ తెలిపారు. గత ఏప్రిల్ నుంచి జూన్ మధ్య (మూడు నెలల్లోనే) ఏసీబీ 67 కేసులు నమోదు చేసిందంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. పట్టుబడిన అధికారుల నుంచి మంత్రులు వసూళ్లకు దిగి విచారణను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు.
బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ నాటకాలు
బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని బయటకు తీస్తాం..నిధులు కక్కిస్తాం అని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ విచారణలన్నింటినీ తొక్కిపెట్టిందని విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఫార్ములా-ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసుల విచారణలను నీరుగార్చిందని విమర్శించారు. దీంతో బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒకే నాణానికి బొమ్మ-బొరుసు అని స్పష్టమవుతోందన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ను రాబోయే రోజుల్లో ప్రతిచోటా బీజేపీ శ్రేణులు వెంటాడి, వేటాడి నిలదీస్తారని ప్రభాకర్ హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





