మూడు రోజుల ఫొటో ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, పిఐబి,డిసెంబర్ 16: హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ ఫొటో ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ అవుట్‌రీచ్ ప్రోగ్రాం (ఐసీఓపీ)లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, హైదరాబాద్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సభనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్ధం… రెండేసి రాష్ట్రాలను ఒక దగ్గరకు తీసుకురావడం ద్వారా వాటి మధ్య సంస్కృతిక సంగమం ఉండాలన్న ఆలోచనకు తొలిసారిగా ప్రధానమంత్రి రూపకల్పన చేశారని అన్నారు. అన్ని సంస్థానాలను ఏకం చేయడంలోనూ, జాతీయ ఐక్యతను పెంపొందించడంలోనూ సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్రాలను అనుసంధానించాలనే ఆలోచన గొప్పదిగా అభివర్ణించిన ఆయన, ఈ ప్రదర్శనకు హాజరైన వారికి భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. భారతదేశం భిన్నత్వంతో కూడిన విశిష్టమైన నాగరికత, ఇది జాతీయ చైతన్యాన్ని పెంచుతుంది. ఈ వైవిధ్యం వివిధ నృత్యరీతులు, సంగీతం,కళ, పండుగలతో వెల్లివిరుస్తోంది. అంతర్లీనంగా ఉన్న ఏక్త్వ భావన సమష్టిగా అభివృద్ధి సాధించేందుకు శక్తినిస్తుంది. సరైన ఆలోచన, సరైన పనులు, సరైన చర్యలు చేయాలని సూచిస్తున్న ధర్మభావనను భారతదేశం అవలంబిస్తోందని దేవ్ వర్మ అన్నారు. ప్రతి సంస్కృతి ఇదే భావనను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రతి రాష్ట్రాన్ని అనుసంధానించడం సవాలే అయినప్పటికీ ఈ ఆధునిక పండగలు.. కూడా ఏక్త్వ భావనతో ఉన్నాయని అన్నారు.
ఉదాహరణకు తెలంగాణలో జరిగే బతుకమ్మలాంటి పండుగ హర్యానాలోనూ జరుపుకుంటూ ఉండొచ్చు. పండుగ చేసుకునే విధానం వేరైనప్పటికీ భావం ఒకటే అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలను జత చేయాలనే కార్యక్రమం ప్రత్యేకంగా ఉందని, ముఖ్యంగా ఇది చిన్నారులకు, పెద్దలకు ప్రయోజనం కలిగిస్తుందని ఆయన అన్నారు. వాతావరణం, సంస్కృతి, ఆహారంలో వైవిధ్యం ఉన్నప్పటికీ హర్యానా, తెలంగాణ లాంటి రాష్ట్రాల మధ్య సారూప్యతలను లోతుగా అన్వేషించేలా ఈ ప్రదర్శన ప్రోత్సహిస్తుందని, పురావస్తు ప్రదేశాలు, సాంస్కృతిక పద్ధతులు ఈ సంబంధాన్ని వెల్లడిస్తాయని వివరించారు. దేశంలో ఏ రెండు రాష్ట్రాలు ఒకేలా లేనప్పటికీ, భారత్ మూలవిలువలైన సరైన ఆలోచన, సరైన పని, సరైన మార్గం- వైవిధ్యమైన సంస్కృతులు, పాటలు, పండగల్లో స్థిరంగా కనిపిస్తూనే ఉంటాయి. రుగ్వేదంలోని ‘‘ఏకం సత్ విప్ర బహుధా వదంతి’’ అంటే ‘‘సత్యం ఒక్కటే: కాని దాన్ని పండితులు భిన్నమైన పద్ధతుల్లో చెబుతారు’’ అనే సూక్తిని ఈ ప్రదర్శన కళ్లకు కట్టినట్టు వివరిస్తుందని తెలిపారు. నేషనల్ మ్యూజియం, న్యూ దిల్లీ అదనపు డైరెక్టర్ జనరల్, సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ ఆశీష్ గోయల్, తన ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ, హర్యానా సంస్కృతిని తెలంగాణ ప్రజలకు చేరువ చేయడమే ఈ ఎగ్జిబిషన్ లక్ష్యమని అన్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో సందర్శకులను సాలార్ జంగ్ మ్యూజియం ఆకర్షిస్తుందని, ఏటా పది లక్షల మంది సందర్శిస్తారని వెల్లడించారు. మ్యూజియం సందర్శకులకు మెరుగైన, సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన అనుభవాన్నిచ్చేందుకు ఏర్పాటు చేసిన మూడు సెల్ఫ్ టికెటింగ్ కియోస్కులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు ప్రారంభించారు. సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్, ఐఐఎస్ అధికారి ఆశిష్ గోయల్.. పత్రికా సమాచార కార్యాలయం, సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ విభాగాల అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శృతి పాటిల్, మ్యూజియంను సందర్శిస్తున్న గవర్నర్ వెంట ఉన్నారు.
‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమంలో భాగంగా జత కూర్చిన తెలంగాణా %-% హర్యానాలకు సంబంధించిన చిత్రకళ, సాంస్కృతిక రూపాలు, వంటలు తదితర అంశాలను ప్రదర్శిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల మధ్య అనుసంధానం, పరస్పర అవగాహన పెంపు లక్ష్యంగా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భాషా, సంస్కృతులు, మతపరమైన గుర్తింపులనే విభిన్నమైన దారాలతో అల్లిన అందమైన తివాసి వంటి భారతదేశ సంస్కృతి, సంకీర్ణమైన జాతీయతా భావానికి ప్రతీకగా నిలుస్తోంది. ఉమ్మడి సంస్కృతీ సంప్రదాయాల ఆవిర్భావం.. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ విభాగమైన కేంద్రీయ కమ్యూనికేషన్స్ బ్యూరో (సీబీసీ), మూడు రోజుల ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలోని సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసింది. ఇందులో తెలంగాణా-హర్యానా రాష్ట్రాలకు చెందిన విభిన్న ఛాయాచిత్రాలను ప్రదర్శిస్తారు. జోడీ రాష్ట్రాల కళారూపాలు, ఆహారం, పండుగలు, స్మారక చిహ్నాలు, ప్రసిద్ధ పర్యాటక స్థలాలు సహా పలు అంశాలతో కూడిన 50 ప్యానళ్ళను ప్రదర్శిస్తున్నారు.. వీటి ద్వారా ఆయా అంశాల్లో ఇరు రాష్ట్రాల మధ్య గల సారూప్యత, భిన్నత్వం తేటతెల్లమవుతుంది. కార్యక్రమంలో భాగంగా చిత్రకళ, కవిత్వం, రంగస్థలం వంటి విభిన్న అంశాలపై నిపుణుల ప్రసంగాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 17 జరిగే కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ మహమ్మద్ అలీ బేగ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ గోరటి వెంకన్న వంటి ప్రముఖులు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. డిసెంబర్ 16,17,18 తేదీల్లో ఈ కార్యక్రమాలను ప్రజలు సందర్శించవచ్చు.