ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు మానవ జీవన విధానాన్ని సుఖమయం చేశాయి. అయితే వీటి జీవితకాలం కొంతవరకే ఉంటుంది. తరువాత వీటిని బయట పడేయవలసిందే. ఏదైనా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలు ఉద్దేశించబడిన ఉపయోగానికి అనర్హంగా మారినప్పుడు దాని గడువు తేదీని దాటిన తరువాత వాటి ఉపయోగం ఉండదు. ఇటువంటి వాటిని ఎలక్ట్రానిక్ వ్యర్థాలు లేదా ఇ-వ్యర్థాలు అంటారు. గృహ వినోదపరికరాలు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, లేప్టాప్స్, స్మార్ట్ టివిలు, సర్వర్లు, మానిటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, జిరాక్స్ యంత్రాలు, డివిడిలు, బ్లూరేలు, రిమోట్లు, స్మార్ట్ వాచీలు, చార్జర్లు మొదలైన ఉపకరణాల నుండి ఇ-వ్యర్థాలు వస్తాయి. గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ 2024 ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 6.2 కోట్ల టన్నుల ఇ-వ్యర్థాలు ఉత్పత్తి చేయబడ్డాయి. సంవత్సరానికి తలసరి సగటున 7.8 కిలోలకు సమానం. వీటిలో కేవలం 22.3% మాత్రమే అధికారికంగా సేకరించి రీసైకిల్ చేస్తున్నారు. 2030 నాటికి 8.2 కోట్ల టన్నులు ఇ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. సగటున ప్రతీ సంవత్సరం 25 లక్షల టన్నులు పెరుగుతున్నాయి.
దుష్ర్పభావాలు:
ఇ-వ్యర్థాలు సకల జీవరాసులతో సహా పర్యావరణానికి కూడా భారీ ప్రమాదాన్ని కలిగిస్తాయి. వీటిలో విషపూరిత పదార్థాలు ఉండడం వలన వీటిని ప్రమాదకరమైన వ్యర్థాలుగా పరిగణిస్తారు. రాగి, వెండి, బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలు ఉంటాయి. శాస్త్రీయంగా ప్రాసెస్ చేసిన తర్వాత వీటిని తిరిగి పొందవచ్చు. లిక్విడ్ క్రిస్టల్, లిథియం, పాదరసం, నికెల్, సెలీనియం, పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పిసిబి), ఆర్సెనిక్, బేరియం, బ్రోమినేట్స్ ఫ్లేమ్ రిటార్డెంట్స్, కాడ్మియం, క్రోమ్, కోబాల్ట్, రాగి, సీసం వంటి విష పదార్థాలు కూడా
ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరం. భారీ లోహాలు సూక్ష్మ పరిమాణంలో ఉండటం కూడా పర్యావరణానికి గణనీయమైన ముప్పును కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనధికారిక రీసైక్లింగ్ రంగంలో కోట్లమందిలో గర్భిణీలు, బాలకార్మికులు కూడా ఉంటున్నారని, వీరికి ఎక్కువ ప్రమాదం అని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ), అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ల నివేదికలు తెలుపుతున్నాయి. ఈ విషపదార్థాలు గర్భంలోని పిల్లల నుండి కౌమారదశలో ఉన్న పిల్లల వరకు వారి కేంద్ర నాడీవ్యవస్థ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. ఊపిరితిత్తుల నిర్మాణ అభివృద్ధిని, పనితీరును ప్రభావితం చేస్తాయి. పిల్లల అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలలో మార్పులు కోలుకోలేని హాని కలిగిస్తాయి. వారి జీవితాంతం వారిని ప్రభావితం చేస్తాయి. లెడ్ (సీసం) మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చిన్నారుల ఎదుగుదలను అడ్డుకుటుంది. బేరియం మెదడు వ్యాపు వ్యాధికి దారితీస్తుంది. కణజాలాన్ని నాశనం చేస్తుంది. గుండె, కాలేయాన్ని దెబ్బతీస్తుంది. హెక్సావాలెంట్ క్రోమియం
డిఎన్ఎ వ్యవస్థను నాశనం చేస్తుంది. ఫాస్ఫరస్ జ్ఞాపకశక్తిని నశింపజేస్తుది. బెరీలియం క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. మెర్క్యురీ మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మహిళల్లో పిల్లల్ని కనే సామర్ధ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఇ-వ్యర్థాలు వేడెక్కినప్పుడు అందులో ఉండే విషపూరిత రసాయనాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో కనిపించే సీసం, జింక్, బేరియం మొదలైనవి మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అలాగే, ఇ-వ్యర్థాలు పల్లపు ప్రదేశాలను కలిసినప్పుడు, విషపూరిత రసాయనాలు నేల, నీటిలోకి ప్రవేశిస్తాయి. ఇది భూగర్భజల కాలుష్యానికి దారితీస్తుంది. ఇది మానవ ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తుంది.
ఇ – వ్యర్థాల నిర్వహణ:
ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలు వాటి ఉపయోగకరమైన జీవితం తరువాత అవి ఇ-వ్యర్థాలుగా మారినప్పుడు వాటిని శాస్త్రీయ పర్యావరణ అనుకూలమైన పద్ధతిలో నిల్వచేసి ప్రాసెస్ చేయాలి. లేకపోతే మానవునికి, పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తాయి. ఉపయోగకరమైన భాగాలు లేదా పదార్థాన్ని తిరిగి పొందడానికి ప్రాసెసింగ్ కోసం అశాస్త్రీయ పద్ధతులు పాటించకూడదు. తగురీతిలో రీసైక్లింగ్ చేయకపోతే సీసం వంటి తెలిసిన న్యూరోటాక్సికెంట్లతో సహా 1000 వేర్వేరు రసాయన పదార్థాలను పర్యావరణంలోకి విడుదలవుతాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి ఇ-వ్యర్థాల రవాణాను నియంత్రించాలని అంతర్జాతీయ నిబంధనలు ఉన్నప్పటికీ తక్కువ మధ్య ఆదాయ దేశాలు (ఎల్ఎంఐసీ) లకు చట్టవిరుద్ధంగా రవాణా నిరంతరం కొనసాగుతోంది. భారత పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇ-వేస్ట్ (మేనేజ్మెంట్) నిబంధనలు 2022 ను తక్షణమే అమల్లోకి తీసుకురావడానికి 2024 మార్చి 8 న ఇ-వేస్ట్ (మేనేజ్మెంట్) సవరణ నిబంధనలు 2024 ను తీసుకు వచ్చింది. అంతర్జాతీయంగా బాసెల్ కన్వెన్షన్ ఇ-వ్యర్థాలు వాటి నిర్వహణతో సహా ప్రమాదకర వ్యర్థాల చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన సమగ్ర పర్యావరణ ఒప్పందం. 2019లో బాసెల్ కన్వెన్షన్ నిషేధ సవరణ అమల్లోకి వచ్చింది. ఒక దేశం నుండి మరో దేశానికి ఇ-వ్యర్థాలతో సహా ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించడాన్ని ఇది నిషేధిస్తుంది.
మన దేశంలో పరిస్థితి:
యునైటెడ్ స్టేట్స్ చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-వేస్ట్ ఉత్పత్తిదారుగా మన దేశం ఉంది. భారతదేశం 2019లో 32 లక్షల టన్నుల ఇ-వ్యర్థాలను ఉత్పత్తి చేసింది. చైనా (ఒక కోటి టన్నులు), యునైటెడ్ స్టేట్స్ (69 లక్షల టన్నులు) ఉత్పత్తి చేసింది. 2018-19లో దేశంలో ఉత్పత్తి చేయబడిన ఈ-వ్యర్థాలలో కేవలం 10% మరియు 2017-18లో ఉత్పత్తి చేయబడిన వాటిలో 3.5% మాత్రమే భారతదేశం సేకరించింది. ఫ్రాస్ట్ & సుల్లివన్ అంచనాల ప్రకారం భారతదేశంలో మొత్తం ఇ-వ్యర్థాల పరిమాణం 2025 నాటికి కనీసం ఒక కోటి టన్నులకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. భారతదేశంలో దాదాపు 450 రిజిస్టర్డ్ ఇ-వేస్ట్ రీసైక్లర్‌లు ఉన్నాయి. ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగం 2025 వరకు ఆదాయంలో 14% వార్షిక వృద్ధి రేటుతో వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 2020-2021లో భారతదేశం 3.4 లక్షల టన్నుల ఇ-వ్యర్థాలను ఉత్పత్తి చేసింది. ప్రతి సంవత్సరంలో సుమారు 31 శాతం పెరుగుదల నమోదవుతుంది. మొదటి మూడు స్థానాలలో మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
సరైన పద్ధతులు అవసరం:
వీటి శుద్ధి సాధారణ చెత్తకి పాటిస్తున్న పద్దతులలో కాకుండా జాతీయ కాలుష్య నియంత్రణా మండలి సూచించే పద్దతులని పాటించాలి. సాధారణ ప్రజలకు వీటి శుధ్ధి గురించి పెద్దగా తెలియదు. కావున సంబంధిత అధికారులు తెలియజేయాలి. ప్రజలు కూడా వారికి సహకరించాలి.
-జనక మోహన రావు దుంగ
యం.యస్సీ ( ఫిజిక్స్ )
8247045230