ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మధ్య, చిన్న తరహా,సూక్ష్మ పరిశ్రమల (ఎంఎస్ ఎంఈ) విధానంలో మహిళలు, వెనకబడిన తరగతుల వారు, దళిత పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనాలు అందేలా చూడాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన రాష్ట్ర స్థాయి జిల్లా పరిశ్రమల కేంద్రాల జనరల్ మేనేజర్ల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త పాలసీ అమలుకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసిన ఎంఎస్ ఎంఈ కొత్త విధానం హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించారు. ఇందులో ఎంఎస్ఎంఈ పథకాల వివరాలు, ప్రభుత్వ రాయితీలు, రుణాలు పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు చేసే విధానంతో సహా అన్ని వివరాలు ఉన్నాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటులో వృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ఎంఎస్ఎంఈ ల అధికారులు సమన్వయంతో పనిచేయలని ఆదేశించారు. బిసీలు ప్రధాన లబ్దిదారులుగా ఉన్న పిఎం విశ్వకర్మ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. మరో పదేళ్లలో రాష్ట్ర బడ్జెట్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు పరిశ్రమల శాఖదే కీలక బాధ్యత అని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో క్లష్టర్ల అభివృద్ధి కోసం, కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడంపై పరిశ్రమల శాఖ అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు. జైకా మద్ధతుతో చేపడుతున్న ఎంఎస్ఎంఈ పథకాలు గరిష్ట స్థాయిలో కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని శ్రీధర్ బాబు కోరారు. ఎంఎస్ ఎంఈ కోసం అందుబాటులో పలు స్కీములు, మార్కెటింగ్ పద్ధతులు, శిక్షణకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషన్ డాక్టర్ మల్సూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన, సమీక్ష సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎస్. స్వామినాథన్, రామానంద శుక్లా, గౌరి మోన్వాని, ఆర్.శ్రీనివాస్, రవివర్మ, బావయ్య తదితరులు పాల్గొన్నారు.





