– తప్పుచేస్తే చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు
– ప్రజలసొమ్ము కాబట్టి విచారణకు హాజరు కావలసిందే
– ప్రొ.కోదండరాం
ప్రజల సొమ్ము ఖర్చు చేసిన సందర్భంలో కమిషన్ ముందు హాజరుకావడం అనివార్యమని, లక్షల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ఎదుర్కొనడాన్ని తప్పుగా భావించకూడదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. కేవలం కేసీఆర్ విచారణకు హాజరైనందుకే కొందరు రాద్దాంతం చేయడం సమంజసం కాదన్నారు. బుధవారం నాంపల్లిలోని టి.జె.ఎస్ రాష్ట్ర కార్యాలయంలో జన సమితి గ్రేటర్ హైదరాబాద్ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సభకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయి అప్పు మాత్రం మిగిలింది అని అన్నారు.
కమిషన్ ముందు హాజరై నిజాలు చెప్పడం కేసీఆర్ బాధ్యత” అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజా సమస్యలను వింటోందని, గత ప్రభుత్వంలో అలాంటి అవకాశం కూడా రాలేదని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని సమస్యల పరిష్కారానికి నగర కమిటీ శ్రేణులు కృషి చేశాయి. రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జన సమితి మరింత క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. ప్లీనరీ సమావేశానికి ముందుగా గోషామహల్ లో కోదండరాం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.
ఆచార్య జయశంకర్ కు పూలమాల వేసి నివాళులర్పించి, అమరవీరులను స్మరిస్తూ కళాకారుల ఆటపాటలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు హాజరయ్యారు. ఈ సభలో పార్టీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్ రావు, నగర ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేష్, పల్లె వినయ్, కార్మిక విభాగం అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మహిళా జన సమితి అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి పుష్పలత గౌడ్, రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి, ముజాయుద్దీన్, నగర నాయకులు అఫ్జల్, ఇస్మాయిల్, రవికాంత్, ఎం.లక్ష్మణ్, జైపాల్ రెడ్డి, జహీర్, జహురుద్దీన్, మెరుగు శ్రీనివాస్ యాదవ్, కాకునూరి సుధాకర్, గోవింద్, సురేష్, రమేష్, మాణిక్యం, శివలక్ష్మి, ఇంద్రాణి, రాజు, సుమంత్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.