అవినీతి సొమ్ములను జూబ్లీహిల్స్ లో అడ్డగోలుగా పంచుతున్న కాంగ్రెస్ పార్టీ
ప్రలోభాలకు గురికాకుండా తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు
యూసుఫ్‌గూడలో రోడ్ భారీ ర్యాలీ
కాంగ్రెస్ నాయకుల్లో ఓటమి భయం కనిపిస్తోంది: కేటీఆర్
వోట్ల కోసం ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనం ప్రారంభం అవుతుందని. చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే షాక్‌కి అసలు మూడేళ్లు రేవంత్ రెడ్డి ఈ పదవిలో ఉంటారో.. లేక మూడు నెలల్లోనే దిగిపోతారో తేలిపోతుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పనితీరు చూసి.. దిల్లీలో వాళ్ల అధిష్టానం కూడా కత్తులు నూరుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల తరఫున బుద్ధి చెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకి వచ్చిందని… ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడించి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ.. రేవంత్ రెడ్డి అంత చిల్లరగా వ్యవహరించిన నాయకుడిని చూడలేదని మండిపడ్డారు కేటీఆర్. పెన్షన్ పెంచాలని అడిగినా.. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీసినా రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాదిమంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడుగుతే రేవంత్ రెడ్డి కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తూ వారిని విద్యకు దూరం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి విద్యార్థులు దాకా ప్రతి వర్గానికి మొండిచేస్తున్న రేవంత్ రెడ్డి కొత్తగా అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మరని కేటీఆర్ అన్నారు. అసలు గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమీ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తుందంటే మాత్రం ఎవరు నమ్ముతారని అన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలన ఉండేదో.. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు కేటీఆర్. పదేళ్ల పాటు అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణను, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఒకవైపు అభివృద్ధితో పాటు.. మరోవైపు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
అసలు.. కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో గుర్తుతెచ్చుకోవాలని కోరారు కేటీఆర్. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అందరినీ మోసం చేసిందని మండిపడ్డారు. తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను కూడా రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి అడిగిన కాలేజీ యాజమాన్యాలను సైతం బెదిరించారని మండిపడ్డారు. రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు బకాయిలు చెల్లించకుండా వారిని మనోవేదనకు గురిచేస్తున్నారని చెప్పారు. ఈ రెండేళ్లలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోని రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ ప్రజలను కూడా మోసం చేస్తారని అప్రమత్తం చేశారు.
ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి.. పేదల ఇల్లు కూలగొడుతున్నారని ఫైరయ్యారు కేటీఆర్. శనివారం, ఆదివారం వచ్చిందంటే పేదల ఇళ్లపైకి బుల్డోజర్ దండెత్తుతోందని మండిపడ్డారు. రెండేళ్లలోనే వేలాది ఇళ్లను నేలమట్టం చేసి పేదలను రోడ్డుపైకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇళ్లు కూలగొట్టే వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ప్రజలు కత్తి తమ చేతికి ఇస్తే.. బుల్డోజర్‌కు అడ్డంగా వెళ్లి పేదలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. బుల్డోజర్‌ను ఆపాలంటే కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
గతంలో సినిమా వాళ్లను జైల్లో పెట్టిన రేవంత్ రెడ్డి.. ఎన్నికల కోసం అదే సినిమా వాళ్లతో బలవంతంగా సన్మానం చేయించుకున్నారని చెప్పారు కేటీఆర్. అయితే.. సినీ కార్మికులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఇక.. పోలీసులను కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ ఎంతో ఇబ్బంది పెట్టిందని ఆయన గుర్తు చేశారు. పోలీస్ కుటుంబాలనే కొట్టించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని తీవ్రంగా మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీసులు, సినీ కార్మికులు సహా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని అన్నారు కేటీఆర్.
వోటు వేయకపోతే పథకాలు ఆపుతామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. అసలు ఎవడబ్బ సొమ్మని పథకాలు ఆపుతారంటూ సూటిగా నిలదీశారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే.. కాంగ్రెస్ గల్లా పట్టి పథకాలను అమలు చేసేలా నిలదీస్తామని చెప్పారు. అంతేకాకుండా.. కొందరు ఆకు రౌడీలు వోటు వేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వారి సంగతి కూడా తేలుస్తామని హెచ్చరించారు కేటీఆర్. గెలవకముందే బెదిరింపులకు దిగుతున్న ఈ కాంగ్రెస్ లీడర్లు.. పొరపాటున గెలిస్తే ఎన్ని అరాచకాలకు పాల్పడతారో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.
నియోజకవర్గానికి వచ్చి ముస్లింలను కూడా బెదిరించిన రేవంత్ రెడ్డికి మైనార్టీ సోదరులు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్. అసలు.. అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నారో చెప్పాలని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి.. గాంధీభవన్ మోహన్ భగవత్ నడిపిస్తున్నారని చెప్పిన ఇదే అసదుద్దీన్ ఒవైసీ.. ఇప్పుడు ఏం మారిందని రేవంత్‌కు సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
ఇక.. ఓడిపోతామని తెలిసి వోటు కోసం కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని అన్నారు కేటీఆర్. ఆ డబ్బులు తీసుకొని మిగితా బాకీ డబ్బుల గురించి నిలదీయాలని చెప్పారు. దొంగ దారిలో గెలవాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలంతా బుద్ధి చెప్పాలని అన్నారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చి మోసం చేసిందో మరోసారి గుర్తు చేసుకొని.. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు.. 4 కోట్ల మందికి న్యాయం చేసే మంచి అవకాశం దక్కిందని.. కాంగ్రెస్ దిమ్మతిరిగేలా.. కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు





