గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి

ఎన్ పిడిడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలని జాతీయ గృహ కార్మికుల వేదిక(ఎన్ పిడిడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ డిమాండ్ చేశారు. గృహ కార్మికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 16న అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్బంగా ఇందిరా పార్క్ లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ సభ్యులు వర్గీస్ తెక్కనాథ్ తో కలసి పలు డిమాండ్లతో కూడిన బ్రోచర్ ను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు.

సమావేశంలో పలు డిమాండ్లతో కూడిన బ్రోచర్ ఆవిష్కరిస్తున్న లిస్సీ జోసెఫ్, తదితరులు

తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షలకు పైగా గృహ కార్మికులు ఉండగా, ఒక హైదరాబాద్ లోనే 5 లక్షల గృహ కార్మికులు ఉన్నారని తెలిపారు. గృహ కార్మికులు ఇళ్లలో పనిచేసే సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మహిళలు, మైనర్లపై శారీరక, లైంగిక వేదింపులకు గురవుతున్నారని వారు అందోళన వ్యక్తం చేశారు. 2023 సంవత్సరంలో 4 వేలకు పైగా హింసాత్మక కేసులు నమోదయ్యాయని వారు తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ నేతలు అన్ జోసేవ్, శంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *