”సూపర్ ఫోర్‌లోకి ఇండియా పాకిస్థాన్ చేరుకున్నాయి కాబట్టి, ఆనంద్ కు ఈ థాంక్ లెస్ జాబ్ సెప్టెంబర్ 21 ఆదివారం కూడా కొనసాగుతుంది. ఇండియా, పాక్ మరో సారి తలపడుతున్నాయి. సెప్టెంబర్ 28 నాటి ఫైనల్ లో కూడా ఈ రెండే తలపడే అవకాశాలు దండిగా ఉన్నాయి. ఈ రెండుదేశాల మధ్య ఏం జరిగినా, అది ఒక వైరపూరిత వాతావరణంలోనే జరుగుతుంది. నియమాలకు లోబడి, రిఫరీలు, అంపైర్ల కనుసన్నలలో జరిగినా సరే, అది ఒక యుద్ధరంగంగానే చిత్రితమవుతుంది. ప్రస్తుతం నెలకొని ఉన్న బహుముఖ సంక్షోభ పరిస్థితుల్లో పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది.”
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ క్రీడాభిమాని. ఎక్స్ లో యాక్టివ్ గా ఉంటారు. పోయిన ఆదివారం నాడు ఆయన ఒక ట్వీట్ చేశారు. గణేశ్ ఉత్సవాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి నగర ముస్లిములు మిలాద్ ఉన్ నబి ఊరేగింపును ఆ రోజుకు వాయిదా వేసుకున్నారు. పోలీసులకు బాగా ఆ రోజు బాగా పని ఒత్తిడి. ముస్లిమ్ పెద్దల సహకారం వల్ల, పోలీసుల బందోబస్తు వల్ల ఆ రోజు ఊరేగింపు ప్రశాంతంగా జరగడమే కాకుండా, రాత్రి ఎనిమిదింటికల్లా ముగిసిపోయింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుండగా, ఆ రోజు జరుగుతున్న ఆసియా కప్ ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్ ఫలితం ఎట్లా ఉండబోతోందో సూచన కనిపించింది. ఇండియా గెలవబోతోంది. ఆ ఉత్సాహంలో నగరపౌరులు విజయయాత్రలు తీయడం, వాటికి ఇంకా ఎక్కడైనా కొనసాగుతున్న చిన్నాచితకా మిలాదున్ నబి ఊరేగింపులు తారసపడితే ఉద్రిక్తతలకు ఆస్కారం ఉండడం- ఈ ఊహాచిత్రం ఆనంద్ కళ్ల ముందు పరచుకుని, మళ్లీ తన సిబ్బందిని అలర్ట్ చేశారు. ఇంకో గంటన్నర అదే ఒత్తిడితో విధినిర్వహణ. ఎంతటి కంచిగరుడసేవ కదా, అని విసుక్కున్నారు కూడా.
మతపరమైన ఉద్రిక్తతలు కానీ, సమాజంలోని మరే సంఘర్షణలు, ఉద్యమాలు, పోరాటాలు కానీ, పోలీసుల సృష్టి కాదు. వాటి వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు ‘అశాంతి’కి, ‘అభద్రత’కు దారితీయకుండా చక్కబరచవలసిన భారం మాత్రం వారి మీద పడుతుంది. రాజకీయ పరిపాలనా వ్యవస్థల వైఫల్యం మాత్రమే కాదు, వాటి అధికారాలను, ప్రయోజనాలను మరింతగా పెంచుకునే స్వార్థక్రీడ కూడా సమాజంలో అనేక ప్రతిఫలనాలకు కారణమవుతుంది. లేకపోతే, సరదాగా ఆడుకునే ఒక ఆట, ఎందుకు ఆవేశాలను సృష్టించాలి? జాతీయత, దేశభక్తి వంటి గంభీరమైన భావనలు, ఎందుకు క్రీడామైదానంలో పుట్టే ఉద్రేకరసాలతో కలగలసి, సామాజిక రంగస్థలంలో నెత్తురై ప్రవహించాలి?
సూపర్ ఫోర్‌లోకి ఇండియా పాకిస్థాన్ చేరుకున్నాయి కాబట్టి, ఆనంద్ కు ఈ థాంక్ లెస్ జాబ్ సెప్టెంబర్ 21 ఆదివారం కూడా కొనసాగుతుంది. ఇండియా, పాక్ మరో సారి తలపడుతున్నాయి. సెప్టెంబర్ 28 నాటి ఫైనల్ లో కూడా ఈ రెండే తలపడే అవకాశాలు దండిగా ఉన్నాయి. ఈ రెండుదేశాల మధ్య ఏం జరిగినా, అది ఒక వైరపూరిత వాతావరణంలోనే జరుగుతుంది. నియమాలకు లోబడి, రిఫరీలు, అంపైర్ల కనుసన్నలలో జరిగినా సరే, అది ఒక యుద్ధరంగంగానే చిత్రితమవుతుంది. ప్రస్తుతం నెలకొని ఉన్న బహుముఖ సంక్షోభ పరిస్థితుల్లో పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది.
ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కాల్పులు లేని యుద్ధం కాదు, చప్పట్లతో కూడిన యుద్ధం- అని మైక్ మార్కూస్ అనే క్రీడా రాజకీయ వ్యాఖ్యాత వ్యాఖ్యానించాడు. క్రికెట్ జాతీయవాదం అన్న భావన మీద విస్తృతంగా చర్చించిన రాజకీయ సాంస్కృతిక మనోవిశ్లేషకులు ఆశీష్ నందీ, దానికి ఇండియా-పాకిస్థాన్ పరిధికి మించిన వివరణ ఇచ్చారు. భారతీయ తాత్విక, భావోద్వేగ వ్యక్తీకరణలకు క్రికెట్ ఒక వేదిక అని, వలసవాద వారసత్వాలను వదిలించుకోవడానికి ధిక్కరణలతో కూడిన స్వతంత్రతలను ప్రదర్శించే రంగమని ఆయన అంటారు. వీరి వ్యాఖ్యానాలు, దేశంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణానికి పూర్వదశలో చెప్పినవి అయినా, వర్తమానానికి మరింతగా అన్వయించి విస్తరించుకోగలిగినవి. క్రికెట్ ప్రయాణంలో వర్తమాన భారతచరిత్రను చూస్తారు రామచంద్రగుహ. నిజమే, దేశాన్ని ఇంతగా ‘ఏకం’ చేయగలిగే మాధ్యమం మరొకటి లేదు. మతతత్వానికి కూడా దీనికున్నంత శక్తి లేదు. రెండూ చెట్టాపట్టాలు వేసి నడుస్తున్నాయి కాబట్టి సరిపోయిందికానీ, మత జాతీయవాదం, క్రికెట్ రెండూ ప్రత్యర్థిశిబిరాలలో నిలబడితే సన్నివేశం అనూహ్యమే.
“మరోవైపు సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య ఒడంబడిక కుదరడం, తీవ్రపర్యవసానాలు కలిగిన పరిణామం. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, ఇస్లామిక్, అరబిక్ దేశాలకు అణ్వస్త్రఛత్రాన్ని అందించే చర్యగా అంతర్జాతీయ సమాజం చూస్తుండగా, తన పొరుగు శత్రువు అయిన పాకిస్థాన్‌ను అది మరింత పటిష్టం చేస్తుందన్న ఆందోళన భారత్‌కు కలగడం వాస్తవం. ప్రపంచంలో రూపొందుతున్న బహుళధ్రువ సమీకరణాల్లో, సైద్ధాంతికత లేని వ్యూహాత్మక అటానమీ చెల్లుబాటు కాదనడానికి, భారత్ తన మిత్రదేశమైన సౌదీతో దూరం కావలసిరావడం ఒక ఉదాహరణ కావచ్చు. అమెరికాకు ఇష్టం లేని ఒప్పందాన్ని పాకిస్థాన్, సౌదీ ధైర్యం చేసి కుదుర్చుకున్నాయి. ఒకనాడు ఉప్పునిప్పుగా ఉన్న సౌదీ, ఇరాన్ ఇప్పుడు ఎడం తగ్గించుకుంటున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కొత్త సమీకరణాలనో, కూటములనో ఏర్పరచుకుంటే, అవి పాకిస్థాన్ ను మరింత బలపరుస్తాయి. భారతదేశం దౌత్యపరంగా ఎక్కడ విఫలమవుతోంది? టెర్రరిజంలో పాకిస్థాన్ ప్రమేయం గురించి ప్రపంచం ఎందుకు నమ్మడంలేదు? అన్ని విధాల ప్రతికూల స్థితిగతుల మధ్య చిక్కుకున్న భారత రాజకీయనాయకత్వానికి ఈ సమయంలో ఒక ప్రభావవంతమైన, అనుకూలమైన ప్రచారాస్త్రం కావాలి. మోదీ ప్రభుత్వపు జాతీయవాద గుర్తింపును పునరుద్ధరించే వాతావరణం కావాలి. లేనిపక్షంలో బిహార్‌లో చుక్కెదురై, దాని గొలుసుకట్టు ప్రభావాలతో అనేక పర్యవసానాలు ఎదుర్కొనవలసి రావచ్చు.”
పెహల్గామ్, ఆపరేషన్ సిందూర్ తరువాత, రెండుదేశాలు ఎందుకు ముఖాముఖీ ఆడాలి? లేదా ఎందుకు ఆడకూడదు? ఈ చర్చ క్రీడాభిమానుల్లోనూ, సాధారణుల్లోనూ చాలానే జరిగింది. క్రికెట్ ఒక రాజకీయ క్రీడ అయినప్పటికీ, ఆ ఆటను అభిమానించే వర్తమాన తరం యువజనం, అది కలిగించే ఉత్సాహోద్రేకాలను ఆనందించడానికి బాగా అలవాటు పడినవారు. అవతలిపక్షం సామర్థ్యాలను, నైపుణ్యాలను గుర్తించి, ఆనందించలేకపోతే, క్రీడాస్ఫూర్తి ఎప్పుడూ సంపూర్ణం కాదు. ఆ లెక్కన చూస్తే, క్రీడలు, వైమనస్యాలను పలచన చేయాలి. కానీ, ప్రేక్షకులు, వీక్షకులు అందరూ ఆట కొనసాగుతున్నప్పుడు క్రీడానందాన్ని, ఫలితాలను జాతీయ అర్థంలోను స్వీకరించడం అలవాటు చేసుకున్నారు. ఆప్ వంటి రాజకీయపార్టీలూ, సామాజిక మాధ్యమాలలో ఒక మోస్తరు మర్యాదస్తులైన వ్యాఖ్యాతలూ మాత్రం, ఆడడానికి నిరాకరించడం ద్వారా నిరసన తెలపాలని భావించారు. ఆటను అనుమతిస్తున్న కేంద్రప్రభుత్వపు దేశభక్తిని నిలదీశారు. ఎందువల్లనో ప్రభుత్వం ఆటను బహిష్కరించడం మీద ఆసక్తి చూపలేదు. ఇండోపాక్ మ్యాచ్ అందించే ఈ జాతీయ, క్రీడానందాలను వదులుకోవడం ఇష్టం లేక, రెంటిలో ఏదో ఒకదాన్నే ఆశ్రయించలేక, పరస్పరం ఆడకూడదనే వాదానికి జనంలో కూడా పెద్ద ఆదరణ దొరకలేదు. ఆటలోనే గట్టి సమాధానానికి అవకాశం ఉందన్న ఆశ కూడా బలంగా ఉండి ఉండవచ్చు. మొత్తానికి దుబాయ్‌లో ధగధగల కాంతుల మధ్య, ఒక నియంత్రిత వాతావరణంలో, ఆపరేషన్ సింధూర్ భావనాత్మక ప్రతిరూపాన్ని, ఇంటరాక్టివ్‌గా వీక్షించవచ్చునని జాతీయవాద క్రీడాభిమానులు అనుకున్నారు. గతంలో జాత్యహంకార దక్షిణాఫ్రికాతో ఆడకూడదనే విలువ కోసం డేవిస కప్ అవకాశాన్ని వదులుకున్న ఇండియా కాదిది, ఆడవలసివచ్చినప్పుడు వెనక్కు తగ్గడం భీరుత్వం అవుతుందనే పౌరాణిక పౌరుషవిలువలను వరిస్తున్న భారత్ ఇది. ఆడేది ఆడేదే కానీ, కరచాలనాలు లేకుండా నిరసననో, తృణీకారాన్నో చూపడం ద్వారా ఉభయదేశాల మధ్య ఉద్రిక్తతల ఉనికిని పరిగణించినట్టు అవుతుందని క్రికెట్ వ్యవస్థలూ రాజకీయ పాలనా వ్యవస్థలూ భావించి ఉంటాయి.
ఆపరేషన్ సిందూర్ నుంచి ఆశించిన ఫలితం కేంద్రప్రభుత్వానికి దక్కలేదు. పాకిస్థాన్ మీద చర్యను అతి త్వరలోనే ముగించినందుకు దేశప్రజలలో అసంతృప్తి కలిగింది. పెహల్గామ్ హత్యాకాండ తరువాత దెబ్బతిన్న జాతీయ మనోభావాలకు, ప్రతికారం జరగలేదన్న అభిప్రాయం ఏర్పడింది. ఆ ఆపరేషన్ వివరాలలో కూడా విరుద్ధ కథనాలు ప్రచారం కావడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాట మీదనే కాల్పుల విరమణ జరిగినట్టు పదే పదే చెప్పుకోవడం, మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. పాకిస్థాన్‌లోని సైనికాధికారులు, ఉగ్రవాద నెట్‌వర్క్‌కు చెందినవారు ఇస్తున్న ప్రకటనలను ఉటంకిస్తూ, ఆపరేషన్ సిందూర్ ఘనతను చెప్పుకోవలసిన దుస్థితి ఏర్పడింది. తగిన ప్రతికథనాలను వ్యాప్తి చేయడంలో మునుపటి సామర్థ్యాన్ని కేంద్రం కానీ, అధికారపార్టీ కానీ చూపించలేకపోయాయి. ఈ లోగా, దేశంలోనూ ప్రభుత్వ ప్రతిష్ఠ కొద్దికొద్దిగా మసకబారడం మొదలయింది.
అమెరికాకు మనకూ మధ్య సుంకాల యుద్ధం ఉద్రిక్తమై, రష్యా, చైనాలకు దగ్గర కావలసి వచ్చింది. కలవరపడిన ట్రంప్ తిరిగి మచ్చిక మాటలు మాట్లాడడం, అందుకు మోదీ సంతోషించడం, తిరిగి ట్రంప్ ఇండోపాక్ సైనికసంఘర్షణను నిలిపివేసింది తనే అని ప్రకటించడం, ఇవన్నీ ప్రభుత్వాన్ని ఒక దౌత్య సంక్లిష్టతలోకి నెట్టాయి. బిహార్ ఎన్నికల ప్రచారంలో సిందూర్ గురించి తక్కువగాను, చొరబాటుదారుల వల్ల కలిగే హాని గురించి ఎక్కువగానూ బిజెపి నేతలు చెప్పుకోవలసి వస్తోంది. చొరబాటుదారుల సమర్థకురాలిగా కాంగ్రెస్‌పార్టీని నిందించడం తప్ప బిజెపి దగ్గర సమర్థమైన ఆయుధం ఏమీ లేకుండా పోయింది. రాహుల్‌గాంధీ ఓట్‌చోరీ ప్రచారం ప్రభావం ఎంతో కొంత కనిపిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య ఒడంబడిక కుదరడం, తీవ్రపర్యవసానాలు కలిగిన పరిణామం. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, ఇస్లామిక్, అరబిక్ దేశాలకు అణ్వస్త్రఛత్రాన్ని అందించే చర్యగా అంతర్జాతీయ సమాజం చూస్తుండగా, తన పొరుగు శత్రువు అయిన పాకిస్థాన్‌ను అది మరింత పటిష్టం చేస్తుందన్న ఆందోళన భారత్‌కు కలగడం వాస్తవం. ప్రపంచంలో రూపొందుతున్న బహుళధ్రువ సమీకరణాల్లో, సైద్ధాంతికత లేని వ్యూహాత్మక అటానమీ చెల్లుబాటు కాదనడానికి, భారత్ తన మిత్రదేశమైన సౌదీతో దూరం కావలసిరావడం ఒక ఉదాహరణ కావచ్చు. అమెరికాకు ఇష్టం లేని ఒప్పందాన్ని పాకిస్థాన్, సౌదీ ధైర్యం చేసి కుదుర్చుకున్నాయి. ఒకనాడు ఉప్పునిప్పుగా ఉన్న సౌదీ, ఇరాన్ ఇప్పుడు ఎడం తగ్గించుకుంటున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కొత్త సమీకరణాలనో, కూటములనో ఏర్పరచుకుంటే, అవి పాకిస్థాన్ ను మరింత బలపరుస్తాయి. భారతదేశం దౌత్యపరంగా ఎక్కడ విఫలమవుతోంది? టెర్రరిజంలో పాకిస్థాన్ ప్రమేయం గురించి ప్రపంచం ఎందుకు నమ్మడంలేదు? అన్ని విధాల ప్రతికూల స్థితిగతుల మధ్య చిక్కుకున్న భారత రాజకీయనాయకత్వానికి ఈ సమయంలో ఒక ప్రభావవంతమైన, అనుకూలమైన ప్రచారాస్త్రం కావాలి. మోదీ ప్రభుత్వపు జాతీయవాద గుర్తింపును పునరుద్ధరించే వాతావరణం కావాలి. లేనిపక్షంలో బిహార్‌లో చుక్కెదురై, దాని గొలుసుకట్టు ప్రభావాలతో అనేక పర్యవసానాలు ఎదుర్కొనవలసి రావచ్చు.
ఈ నేపథ్యంలో క్రికెట్ కరచాలనాల వివాదాన్ని చూడాలి. గతవారం మ్యాచ్ లో విజయం సాధించినా దానిలో జాతీయవాద సంతృప్తిని చూడకుండా, కేవలం క్రీడానందాన్నే పొందిన భారతీయ వీక్షకుల పరిపక్వతనో, నిర్లిప్తతనో గుర్తించాలి. మరి రానున్న ఒకటి లేదా రెండు మ్యాచ్‌లలో కూడా అటువంటి సంయమనమే కనిపిస్తుందా? కనిపించాలని కోరుకోవాలి. మన ఆవేశాలు ఎవరికీ ఇంధనాలు కాకూడదు!




