కాంగ్రెస్ బలహీనతే రేవంత్ బలం

“జీవన్ రెడ్డి పాత తరం నాయకుడు. నిజాయితీపరునిగా, పోరాట యోధునిగా పేరుంది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు. నిజానికి జీవన్ 2019 మార్చిలో కరీంనగర్-మెదక్-నిజామాబాదు-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాతనే తిరిగి కాంగ్రెస్ బతికిబట్టకడుతుందన్న నమ్మకం ఏర్పడింది. ఆ ఊపులోనే 2019 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ మూడు లోక్ సభ స్థానాలను గెలిచింది.”
కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి నిష్క్రమణ అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. పాత కాంగ్రెస్ నాయకులంతా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కోబోతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆరెస్-లో చేరారు. చిన్నారెడ్డి, మాధవరెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, రాజగోపాల రెడ్డి కూడా చిన్నబుచ్చుకుని ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తమకు ఎటువంటి గుర్తింపు లేకుండా పోయిందని వారు బాధపడుతున్నారు. పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మరికొందరు మంత్రులది మరో రకంగా అసంతృప్తి. తమ ద్వారా వెళ్ళవలసిన ఫైళ్లను ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా తెప్పించుకుంటున్నదని, కార్యదర్శులకు అలా సూచనలు వెళ్లాయని వీరంతా లోలోపల మదనపడుతున్నారని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇటీవల ప్రైవేటు సంభాషణల్లో చెప్పారు.
అధికారుల ముందు తమను చులకన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరూ ఒకే ఒక అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు – రాకరాక పదేళ్ల తర్వాత అధికారం వచ్చింది ఇప్పుడు ఏమన్నా తేడా జరిగితే మొదటికే మోసం వస్తుందన్న గుంజాయిషీతో వారు తమకు ఎదురవుతున్న అవమానాలను దిగమింగుతున్నారని ఆ నాయకుడు చెప్పారు. అయితే ఈ నిబ్బరం ఎంతకాలం ఉంటుంది అన్నది ముఖ్యమంత్రి వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుందని ఆ నాయకుడు తెలిపారు. జీవన్ రెడ్డికి ఊపిరాడని పరిస్థితి తలెత్తిందని, మిగిలిన నాయకులకు ఇంకా అటువంటి పరిస్థితి రాలేదని ఆ నాయకుడు అన్నారు.
“బీహారులో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఓడిపోవడం అధిష్టానాన్ని చేష్టలుడిగేట్టు చేసింది. కాంగ్రెస్ అంటే భవిష్యత్తు అంతా రేవంత్ రెడ్డేనని, అయన మనుషులు మాత్రమే ఇకపై అధికారంలో ఉండడం కానీ, అధికారం చెలాయించడం కానీ జరుగుతుందని , రేవంత్ రెడ్డి ఆంతరంగికులకు ఉన్న విలువ మహా మహా కాంగ్రెస్ నాయకులకు కూడా లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి పాత నాయకులందరినీ పక్కకు తోసి తన మనుషులను అభ్యర్ధులుగా ముందుకు తెస్తారని ఆ నాయకుడు అంచనా వేస్తున్నారు. పాత తెలుగు దేశం నాయకులందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని, భవిష్యత్తులో ఏమి జరిగినా పార్టీ తన చెప్పుచేతల్లో ఉండే విధంగా అయన పావులు కదుపుతున్నారని ఆ నాయకుడు చెబుతున్నారు.”
జీవన్ రెడ్డి పాత తరం నాయకుడు. నిజాయితీపరునిగా, పోరాట యోధునిగా పేరుంది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు. నిజానికి జీవన్ 2019 మార్చిలో కరీంనగర్-మెదక్-నిజామాబాదు-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాతనే తిరిగి కాంగ్రెస్ బతికిబట్టకడుతుందన్న నమ్మకం ఏర్పడింది. ఆ ఊపులోనే 2019 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ మూడు లోక్ సభ స్థానాలను గెలిచింది. అప్పటికి ఉత్తమకుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. అయన కూడా నల్గొండ లోక్ సభ స్థానం నుంచి గెలుపొంది హుజూర్నగర్  అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. అక్కడి నుంచి పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్  టోకుగా కలిపేసుకుంది. ఆ తర్వాత జరిగిన హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అటుపిమ్మట 2020 డిసెంబరులో జరిగిన హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు కార్పొరేటర్ స్థానాలు మాత్రమే గెలిచింది.
దీంతో ఉత్తమ్ రాజీనామా చేశారు. అయన స్థానంలో పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. ఆ నిర్ణయాన్ని ప్రకటించే లోపు 2021 మేలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముందుకు వచ్చింది. అప్పటి ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణం వల్ల ఈ ఎన్నిక అవసరమైంది. అప్పటిదాకా సద్దు చేయకుండా ఉన్న జానారెడ్డి, ఉప ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తే తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యే దాకా పీసీసీ నియామకాన్ని ఆపాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారని, అదే సమయంలో రేవంత్ రెడ్డిని పీసీసీ పీఠం కోసం పైరవీ చేసుకోవలసిందిగా ముందుకు తోశారని ఆ సీనియర్ వాపోయారు.
“కేసీఆర్ ను ఏయే అంశాలపై తప్పుబడుతూ మాట్లాడారో రేవంత్ రెడ్డి కూడా అవే తప్పులు చేస్తున్నారు. మాట చేత వ్యవహారం అన్నీ మర్యాదల హద్దులు దాటుతున్నాయి. మొత్తంగా, అయన పార్టీని కాపాడడం లేదు. కొత్త శ్రేణులను సమీకరించకపోయినా పాత శ్రేణులు జారి పోకుండా చూసుకోవడం లేదు. కొనుగోలు చేసిన శాసనసభ్యులు తప్ప కొత్తగా ఒక్క నాయకుడు కూడా రేవంత్ పక్షాన చేరలేదు. పైగా పాత నాయకులు జారిపోతున్నారు. సాధారణంగా స్థానిక ఎన్నికల వేళ పెద్ద ఎత్తున అధికార పార్టీలోకి ఫిరాయింపులు ఉంటాయి. ఈ సారి అటువంటి కదలికలు కనిపించలేదు. ఎందుకంటే గెలిచిన ఏడాదిలోనే కేసీఆరే బాగుండే అనే అభిప్రాయం కలిగించారు. పథకాల అమలు జనం మెచ్చే విధంగా లేకపోవడం, కొత్తగా ఇస్తానన్నవి ఇవ్వలేకపోవడం, పైగా అంతులేని అతిశయాన్ని ప్రదర్శించడం కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.”
సాగర్ ఉప ఎన్నిక అయిపోగానే 2021 జూన్ లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షునిగా నియమించింది. జీవన్ రెడ్డికి అక్కడి నుంచి ఎదురు దెబ్బలు మొదలయ్యాయని అయన తెలిపారు. అయినా జీవన్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఇంతకాలం నిలబడ్డారని, బీఆర్ఎస్  నుంచి గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చి తన పైన రుద్దడం, రానురాను తనను పక్కన బెట్టి అతని మాటకే విలువ ఇవ్వడం జీవన్ రెడ్డి తట్టుకోలేకపోయారు. రాజ్యసభ ఎన్నిక ఆయనను మరింత దెబ్బతీసింది. కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటో రాజ్యసభ ఎన్నికతో మరింత స్పష్టత వచ్చిందని మరో సీనియర్ నాయకుడు చెప్పారు.
వైస్ రాజశేఖర్ రెడ్డి వంటి నాయకుడికి కూడా తన అంతరంగికుడు కేవీపీ రామచందర్ రావుకు రాజ్యసభ సీటు ఇప్పించడానికి నాలుగేళ్లు పట్టింది. కానీ రేవంత్ రెండు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ అధిష్టానం పై పూర్తి పట్టు సంపాదించగలిగారు. తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇప్పించుకోగలిగారు. బీహారులో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఓడిపోవడం అధిష్టానాన్ని చేష్టలుడిగేట్టు చేసింది. కాంగ్రెస్ అంటే భవిష్యత్తు అంతా రేవంత్ రెడ్డేనని, అయన మనుషులు మాత్రమే ఇకపై అధికారంలో ఉండడం కానీ, అధికారం చెలాయించడం కానీ జరుగుతుందని , రేవంత్ రెడ్డి ఆంతరంగికులకు ఉన్న విలువ మహా మహా కాంగ్రెస్ నాయకులకు కూడా లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి పాత నాయకులందరినీ పక్కకు తోసి తన మనుషులను అభ్యర్ధులుగా ముందుకు తెస్తారని ఆ నాయకుడు అంచనా వేస్తున్నారు. పాత తెలుగు దేశం నాయకులందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని, భవిష్యత్తులో ఏమి జరిగినా పార్టీ తన చెప్పుచేతల్లో ఉండే విధంగా అయన పావులు కదుపుతున్నారని ఆ నాయకుడు చెబుతున్నారు. తనకు అనుకూలంగా ఉండే విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కొందరు సీనియర్లకు ఇచ్చిన బీ- ఫారం వెనుకకు తీసుకుని తన మనుషులకు ఇప్పించుకున్నారని అయన గుర్తు చేశారు.
వచ్చే ఎన్నికల నాటికీ రేవంత్ పార్టీలో మరింత బలపడతారనడంలో సందేహం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లోగా సాధించే గొప్ప విజయాలేవీ కనిపించడం లేదు. ఒకవేళ కేరళ గెలిచినా ఆ గొప్పతనమంతా రేవంత్ కు నమ్మకస్తుడైన కేసీ వేణుగోపాల్ ఖాతాలో పడుతుందని, అది రేవంత్ నే బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ రేవంత్ రెడ్డిలో ఆత్మ విశ్వాసాన్నే కాదు అతిశయాన్ని కూడా పెంచుతున్నాయి. తాను ఏమి చేసినా చెల్లిపోతుందన్న ధోరణి ఆయనలో కనిపిస్తున్నది. అద్భుతాలు చేయలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. చాలా హామీల అమలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వేళ తప్పిన నిర్ణయాలు చేస్తున్నారు. ఉదాహరణకు రైతుబంధు రెండు వాయిదాలు దాటవేశారు. ఇప్పుడొక వాయిదా పంటల సీజన్ లో అయిపోయే దాకా సాగదీస్తున్నారు. పెంచి ఇస్తామన్న పెన్షన్లు ఇంతవరకు అయిపులేదు. ఉద్యోగాల జాతర లేదు, కేలండర్ లేదు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో గొప్ప ముందడుగు ఏమీ లేదు. ఇరవై ఎనిమిది మాసాలవుతున్నా ఎస్సెల్బీసీ ప్రాజెక్టులో కొత్తగా కిలోమీటర్ సొరంగం తవ్వ లేదు. పాలమూరు రంగారెడ్డిలో కొంత ముందడుగు పడినా అది కూడా సాగు లక్ష్యాలను చేరలేదు. కాళేశ్వరం ఇంకా బాగు చేయలేదు. కాళేశ్వరం ఎక్కువగా ఉపయోగపడేది కరువులు వచ్చినప్పుడే. గోదావరిలో పై నుంచి వరద వచ్చినప్పుడు కాళేశ్వరం నీటితో పని ఉండకపోవచ్చు. కానీ పై నుంచి ప్రతి సంవత్సరం నీరు రాదు. కాళేశ్వరం మరమ్మతు చేసి ఉపయోగంలోకి తీసుకు రాకపోతే అది నేరం అవుతుంది. అన్ని ప్రోజెక్టుల కింద భూసేకరణ పూర్తి చేసి సాగు నీటి కాలువల నిర్మాణం జరగాల్సి ఉంది. పెద్ద ప్రాజెక్టులు నిర్మించి చేతులు దులుపుకుంటే సరిపోదు. పొలాలకు చెరువులకు నీరందించినప్పుడే ఆ ప్రాజెక్టులు సార్ధకమయ్యేది. ఇంకా కేసీఆర్-ను తిట్టుకుంటూ కూర్చుంటే జనం హర్షించరు.

రేవంత్ రెడ్డి ఇన్ని పెండింగులు తన ఖాతాలో పెట్టుకుని మళ్ళీ నేనే గెలుస్తానన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు మాటలు మీరుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడిన భాషనే ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని మాట్లాడుతున్నారు. అప్పట్లో చప్పట్లు కొట్టినవాళ్లకు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు ఎబ్బెట్టుగా, వికారంగా అనిపిస్తున్నాయి. కొందరు శ్రేయోభిలాషులు ఈ విషయం ఆయన దృష్టికి తీసుకు పోయారని, భాష మార్చుకోవాలని సూచించారని, అయన మాత్రం తన ప్రత్యేకతే అది కదా అని సర్ది చెప్పుకున్నారని తెలుస్తున్నది. రేవంత్ అర్ధం చేసుకోవలసింది ఏమంటే సమయం సందర్భాన్ని బట్టి మాట తీవ్రత ఉండాలని. పదేళ్ల పరిపాలన నేపథ్యంలో సహజంగా ప్రబలే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా 2022-23 లలో కేసీఆర్- ను తిడితే అప్పుడు హర్షించి ఉండవచ్చు గాక, ఇప్పుడెందుకు హర్షిస్తారు? రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాలని సరిగ్గా అర్థం చేసుకోవడంలో విఫలమైనట్టు కనిపిస్తున్నది. తనకు విజయం తన నాయకత్వం నచ్చి, తన ప్రసంగాలకు మెచ్చి, తన ఒక్కడి కష్టం వల్లే వచ్చిందని నమ్మితే అంతకన్నా తెలివి తక్కువ తనం లేదు. కేసీఆర్-ను ఎదిరించడం అప్పట్లో మొనగానితనమే. ఆ ఒక్కటే గెలిపించదు. పదేళ్లు మొక్కవోకుండా నిలబడిన కాంగ్రెస్ నాయకత్వం కూడా పార్టీ విజయానికి దోహదం చేసిందన్నది నిజం. ఈ అన్ని ప్రతిభలకంటే ప్రధానంగా ఎన్నికలను ప్రభావితం చేసింది పదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రబలిన వ్యతిరేకత(Anty incumbency) . వ్యతిరేకత అన్నది ఒకసారి ఓడిస్తే బలహీనపడుతుంది. అనుకూలత కూడా అంతే. ఒకసారి గెలవడానికి పనికొస్తుంది. రెండవసారి గెలవడానికి ప్రజలు గుర్తుపెట్టుకోదగిన అనేక మంచి పనులు చేయాలి. ప్రజలకు ఆశపెట్టిన పథకాలన్నీ సరిగా అందేట్టు చూడాలి . అన్నీ చేసినా సరే, మాట, చేత, వ్యవహారం జనం మెచ్చాలి, కనీసం నొచ్చుకోకుండా చూసుకోవాలి.

కేసీఆర్ పై వ్యతిరేకత ప్రబలడానికి ఆరేడేళ్లు పట్టింది. రేవంత్ రెడ్డి రెండేళ్లలోనే కావలసినంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. మాట కూడా అభ్యంతరకరంగా ఉంటున్నది. అసెంబ్లీ వేదికగా తొక్కుడు భాష మాట్లాడుతున్నారంటేనే  అయన సంయమనం కోల్పోతున్నారని అర్థం. కేసీఆర్ ను ఏయే అంశాలపై తప్పుబడుతూ మాట్లాడారో రేవంత్ రెడ్డి కూడా అవే తప్పులు చేస్తున్నారు. మాట చేత వ్యవహారం అన్నీ మర్యాదల హద్దులు దాటుతున్నాయి. మొత్తంగా, అయన పార్టీని కాపాడడం లేదు. కొత్త శ్రేణులను సమీకరించకపోయినా పాత శ్రేణులు జారి పోకుండా చూసుకోవడం లేదు. కొనుగోలు చేసిన శాసనసభ్యులు తప్ప కొత్తగా ఒక్క నాయకుడు కూడా రేవంత్ పక్షాన చేరలేదు. పైగా పాత నాయకులు జారిపోతున్నారు. సాధారణంగా స్థానిక ఎన్నికల వేళ పెద్ద ఎత్తున అధికార పార్టీలోకి ఫిరాయింపులు ఉంటాయి. ఈ సారి అటువంటి కదలికలు కనిపించలేదు. ఎందుకంటే గెలిచిన ఏడాదిలోనే కేసీఆరే బాగుండే అనే అభిప్రాయం కలిగించారు. పథకాల అమలు జనం మెచ్చే విధంగా లేకపోవడం, కొత్తగా ఇస్తానన్నవి ఇవ్వలేకపోవడం, పైగా అంతులేని అతిశయాన్ని ప్రదర్శించడం కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *