మంత్రివర్గ విస్తరణ, ముఖ్యమంత్రి నిస్సహాయతనే ఎక్కువ వ్యక్తం చేసిందన్నఅభిప్రాయం కలిగించింది. కానీ, ఆ తరువాత, పాలనకు, తనకు ఇబ్బంది కలిగిస్తున్న సహచరులకు మందలింపులు అందడంతో, ఆయనలో ఆత్మస్థైర్యం పెరుగుతోందన్న సూచనా కనిపించింది. మరోవైపు కుటుంబ కలహాలు, కాళేశ్వరం కమిషన్ హాజరులు, ఏసీబీ కేసులు- వీటితో బిఆర్‌ఎస్ ఉక్కిరిబిక్కిరిగా ఉంది. తెలంగాణ బిజెపి వ్యూహాత్మకమో, సామర్థ్యలోపమో, అక్కడే ఉండిపోయిన గొంగడిలాగా నిర్వ్యాపకంగా ఉన్నది. ఈ అన్నికారణాల వల్ల, రేవంత్ రెడ్డి సాపేక్షంగా స్థిరంగా, మెరుగుగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ, ఆయనలో తన పంతాల వల్ల కొనసాగిస్తున్న వ్యక్తిత్వవైఖరులు కానీ, చూపించే ప్రాధాన్యాలు కానీ ఇప్పుడు కాకపోయినా, రేపైనా సమస్యలు కొనితెచ్చే విధంగానే ఉన్నాయి.

మళ్లీ నీళ్లే నిప్పులై రాజకీయాన్ని మండిస్తున్నాయి. బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ అధికార, ప్రతిపక్షాలను తీవ్ర సంవాదంలోకి దించాయి. ప్రత ఒక్కరి విశ్వసనీయత, రాష్ట్ర నిబద్ధత, తెలంగాణ ప్రేమ ఇప్పుడు బోనెక్కుతున్నాయి. ప్రభుత్వం మీద ఉన్నఅసంతృప్తులు, బిఆర్‌ఎస్ ఎదుర్కొంటున్నఅవినీతి, అక్రమాల ఆరోపణలు అన్నీ తెరవెనక్కి వెళ్లి, ఆంధ్రప్రదేశ్ తో కొత్త పోరాటం ముందుకు వచ్చింది.
బుధవారం నాడు తెలంగాణ అఖిలపక్ష ఎంపీల సమావేశంలో రేవంత్ రెడ్డి ఏం చేశారు? బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఎంతదూరమైనా వెడతాం అన్నారా? లేక, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ లో ఉందో తెలియక తడబాటు పడ్డారా? చంద్రబాబు నాయుడికి కూడా గట్టి సూచన చేశారా? కేవలం సమస్య అంతటికీ కెసిఆర్ మూలకారణమని మాత్రమే అన్నారా? కృష్ణాగోదావరి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ చూపిస్తున్న అలక్ష్యం, అలసత్వం ఇప్పటి తక్షణ సమస్యా? బిఆర్‌ఎస్ హయాంను బోనులో నిలబెట్టడడం అత్యవసరమా? ? గురువారం నాడు ఢిల్లీలో రేవంత్ కేంద్రమంత్రితో ఏం మాట్లాడారు? గత ప్రభుత్వం ఎక్కువ నీటి కోసం బేరమాడితే, ఇప్పుడు తక్కువ డిమాండ్ చేస్తున్నారా? బాబుకు దాసోహం అన్నారా? చంద్రబాబుతో లోపాయికారీ విధేయత, చెలిమి ఎవరిది? బిజెపితో చెట్టపట్టాలు, అనుమానపుసంబంధాలు ఎవరివి? రాష్ట్రంలో ఎవరన్నా, తమ సొంత రాజకీయ ప్రయోజనాలు కాక, తెలంగాణ గురించి, తెలంగాణ కోసం మాత్రమే ఆలోచించేవాళ్లున్నారా?
ఎదుటివారిని గేలిచేయడానికి బాగానే ఉంటుంది కానీ, ఒక ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని జలవ్యవస్థలన్నిటి గురించీ అవగాహన ఉండి పెద్దగా ఒరిగిందీ లేదు, ఇంకో ముఖ్యమంత్రికి బేసిన్ల గురించి బేసిక్ లు తెలియనందువల్ల కొంపమునిగిందీ లేదు. అటువంటి పరిజ్ఞానం బ్యూరోక్రసీ దగ్గర, ప్రభుత్వాలకు సహాయం చేసే రంగనిపుణుల దగ్గర పుష్కలంగా ఉంటుంది. రాజకీయ నాయకత్వానికి కూడా వనరుల గురించి, ప్రజల గురించి విస్తృతమైన జ్ఞానం ఉండడం తప్పనిసరిగా వారిని దార్శనికులను చేస్తుంది, నిజమే. కానీ, ఇప్పుడు మనకు ఈ పాటి పాలకులే పదివేలు. దూరదృష్టులు, వైతాళికుల కోసం ఆశించేంత విలాసం ఎక్కడ? తెలిసినవారి నుంచి అవగాహన అరువు తెచ్చుకుని వ్యవహరిస్తే చాలు, నోటికి వచ్చిన గణాంకాలు చెప్పకపోతే చాలు, నష్టం చేసే వాదనలు చేయకపోతే చాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గర నుంచి ప్రజలు ఆశిస్తున్నది, రాష్ట్ర ప్రయోజనాలను సరైన తీరులో రక్షించడానికి ప్రయత్నం చేయడం. , ఆయన ఆ పని సమర్థంగా, సంకల్పశుద్ధితో చేస్తారన్న ఆశ లేదంటూ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఆయన సమస్యలు ఆయనకు ఉండవచ్చు. అదే సమయంలో ఆయన పరిమితులు, పంతాలు కూడా అందుకు దోహద పడుతుండవచ్చు. ఎన్నికల వాగ్దానాలను పూర్తిస్థాయిలో అమలుచేయలేకపోవడానికి, ఎప్పటినుంచో గొప్పగా చెబుతున్న ప్రాజెక్టులను మొదలుపెట్టలేకపోవడానికి నిధుల కొరత, రుణాల అలభ్యత కారణాలు అయి ఉండవచ్చు. అనేక అంశాలలో త్వరితగతిని నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి కాంగ్రెస్‌పార్టీలో సహజంగానే పై నుంచి, పక్కనుంచి ఏర్పడే ఒత్తిడుల ప్రభావం ఉండవచ్చు. వీటన్నిటి కారణంగా, పార్టీపైనా, ప్రభుత్వం పైనా ఆయనకు ఎంత పట్టు ఉన్నది అన్న ప్రశ్న పదే పదే తలెత్తుతున్నది. మంత్రివర్గ విస్తరణ, ముఖ్యమంత్రి నిస్సహాయతనే ఎక్కువ వ్యక్తం చేసిందన్న అభిప్రాయం కలిగించింది. కానీ, ఆ తరువాత, పాలనకు, తనకు ఇబ్బంది కలిగిస్తున్న సహచరులకు మందలింపులు అందడంతో, ఆయనలో ఆత్మస్థైర్యం పెరుగుతోందన్న సూచనా కనిపించింది. మరోవైపు కుటుంబ కలహాలు, కాళేశ్వరం కమిషన్ హాజరులు, ఏసీబీ కేసులు- వీటితో బిఆర్‌ఎస్ ఉక్కిరిబిక్కిరిగా ఉంది. తెలంగాణ బిజెపి వ్యూహాత్మకమో, సామర్థ్యలోపమో, అక్కడే ఉండిపోయిన గొంగడిలాగా నిర్వ్యాపకంగా ఉన్నది. ఈ అన్నికారణాల వల్ల, రేవంత్ రెడ్డి సాపేక్షంగా స్థిరంగా, మెరుగుగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ, ఆయనలో తన పంతాల వల్ల కొనసాగిస్తున్న వ్యక్తిత్వవైఖరులు కానీ, చూపించే ప్రాధాన్యాలు కానీ ఇప్పుడు కాకపోయినా, రేపైనా సమస్యలు కొనితెచ్చే విధంగానే ఉన్నాయి.
రేవంత్ కు ఉండే ప్రత్యేక సమస్య ఏమిటంటే, ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉండడం. రేవంత్-చంద్రబాబు మధ్య పాత అనుబంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న అభిప్రాయం జనంలో ఉన్నది. ఆ అనుబంధాన్ని గురుశిష్యుల సంబంధమో మరొకటో అంటే తాను ఊరుకునేది లేదని గతంలో రేవంత్ ఒకసారి హెచ్చరించారు కానీ, తాను చంద్రబాబుకు సన్నిహితంగా లేనని నిరూపించుకోవాలని కూడా ఆయన ప్రయత్నించడం లేదు. గోదావరి జలాలు వెయ్యి, కృష్ణా జలాలు ఐదొందలు టిఎంసీలు ఇచ్చి తక్కినవి ఎపి వాడుకోవచ్చునని రేవంత్ అన్నారని విమర్శిస్తూ, బిఆర్‌ఎస్ నాయకులు హరీశ్‌రావు ‘ఇది బాబుకు దాసోహం కావడమే’ అన్నారు. ఏపీ మీద, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏ మాత్రం సాత్విక వైఖరి చూపినా అది రేవంత్ గతాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. పదేపదే ఖండిస్తున్నా సరే, రాజకీయ సంవాదం లో అది ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది. కాబట్టి, బనకచర్ల వ్యవహారంలో రేవంత్ కత్తిమీద సాము చేయవలసి ఉంటుంది. తన గురువుగారికి చెప్పి, సమస్య పరిష్కరించాలని రేవంత్‌ను బిజెపి నాయకులు కూడా వ్యంగ్యంగా డిమాండ్ చేయడమేమిటి? ఏపీలో టీడీపీ మిత్రపక్షంగా ఉండీ, తెలంగాణలో ఇట్లా ఎట్లా మాట్లాడగలుగుతారు?
కాళేశ్వరం వివాదం నుంచి దృష్టి మళ్లించడానికి బిఆర్‌ఎస్ బనకచర్ల ను పైకి తెచ్చిందని కాంగ్రెస్ వారు మొదట విమర్శించారు. గోదావరిని పెన్నా బేసిన్ కు అనుసంధానం చేయాలన్న చంద్రబాబు ప్రతిపాదన ఆషామాషీ కాదనీ, దానికి అనేక పర్యవసానాలుంటాయని గ్రహింపు కలిగిన తరువాత, మొదట మంత్రులు మాట్లాడడం మొదలుపెట్టారు. బుధవారం నాడు రేవంత్ రెడ్డి మెరుగైన స్పష్టతతో మాట్లాడిన తరువాత, ఇప్పుడు ఈ వివాదం పూర్తిరూపం తీసుకున్నది. తెలంగాణ ఐక్యస్వరాన్ని వినిపించవలసిన అఖిలపక్షం వాకౌట్లు, పరస్పర విమర్శలతో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో తలపడవలసి వస్తే, రేవంత్ రెడ్డి అందుకు సిద్ధపడరని, మెతకగా వ్యవహరిస్తే, అది తమకు ఒక రాజకీయ ఆయుధం అవుతుందని బిఆర్‌ఎస్ ఆశిస్తున్నది. సమస్యను, పరిష్కారాన్నినివేదించిన తీరుతో బిఆర్‌ఎస్ విభేదిస్తున్నది కానీ, కేంద్రజలశక్తి మంత్రిని కలిసి సమర్పించిన విజ్ఞాపనంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ఫిర్యాదు చేసినంతవరకు అందరూ ఏకీభవించేదే. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి ని ప్రతిపాదిస్తున్నారు. ఆ ఘట్టాన్ని కూడా ప్రజలు, ప్రతిపక్షం, పౌరసమాజం వేయికళ్లతో గమనిస్తుంటారు.
రేవంత్ కు ఉండే ప్రత్యేక సమస్య ఏమిటంటే, ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉండడం. రేవంత్-చంద్రబాబు మధ్య పాత అనుబంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న అభిప్రాయం జనంలో ఉన్నది. ఆ అనుబంధాన్ని గురుశిష్యుల సంబంధమో మరొకటో అంటే తాను ఊరుకునేది లేదని గతంలో రేవంత్ ఒకసారి హెచ్చరించారు కానీ, తాను చంద్రబాబుకు సన్నిహితంగా లేనని నిరూపించుకోవాలని కూడా ఆయన ప్రయత్నించడం లేదు. గోదావరి జలాలు వెయ్యి, కృష్ణా జలాలు ఐదొందలు టిఎంసీలు ఇచ్చి తక్కినవి ఎపి వాడుకోవచ్చునని రేవంత్ అన్నారని విమర్శిస్తూ, బిఆర్‌ఎస్ నాయకులు హరీశ్‌రావు ‘ఇది బాబుకు దాసోహం కావడమే’ అన్నారు. ఏపీ మీద, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏ మాత్రం సాత్విక వైఖరి చూపినా అది రేవంత్ గతాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. పదేపదే ఖండిస్తున్నా సరే, రాజకీయ సంవాదం లో అది ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది. కాబట్టి, బనకచర్ల వ్యవహారంలో రేవంత్ కత్తిమీద సాము చేయవలసి ఉంటుంది. తన గురువుగారికి చెప్పి, సమస్య పరిష్కరించాలని రేవంత్‌ను బిజెపి నాయకులు కూడా వ్యంగ్యంగా డిమాండ్ చేయడమేమిటి? ఏపీలో టీడీపీ మిత్రపక్షంగా ఉండీ, తెలంగాణలో ఇట్లా ఎట్లా మాట్లాడగలుగుతారు?
ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని, దాన్ని సాధించిన వ్యక్తిగా రేవంత్ ను చెబుతారు. ఆయన ప్రయత్నం, శ్రమతో పాటు, అనేక పరిస్థితులు కలసివచ్చాయని ఆయన గుర్తించాలి. రేవంత్ రెడ్డికి ఫలానా మైనస్‌పాయింట్లున్నాయని విమర్శకులు వేటి గురించి చెబుతున్నారో, వాటన్నిటి గురించి తెలిసి ఉండీ కూడా తెలంగాణ ఓటర్లు ఆయనను గెలిపించారు. అట్లాగని, ఆ ప్రతికూల అంశాలను ఎప్పటికీ అనుమతిస్తూ పోతారని కాదు. అధిష్టానం అనుమతించినంత కాలమో, కేంద్రం కుట్రచేయనంతకాలమో కొనసాగి విరమించుకోవాలని అనుకునే రకం కాదు రేవంత్ రెడ్డి. కొనసాగాలని, మళ్లీ గెలవాలని ఆశించే వ్యక్తి కాబట్టి, అందుకు కావలసిన ప్రాతిపదికలను కూడా ఆయన నిర్మించుకోవాలి. తెలంగాణ ప్రజలు ఏ అంశాలపై భావోద్వేగాలతో కూడిన అభిమానాలను, వ్యతిరేకతలను కలిగి ఉన్నారో గ్రహించాలి. సెంటిమెంట్ తో ఆటలాడకూడదు.
తెలంగాణ అస్తిత్వానికి, ఉద్యమానికి సంబంధించిన జ్ఞాపకాలు జనం మనస్సులో నిద్రాణంగా అయినా సజీవంగా ఉన్నాయి. రాజకీయ స్పర్ధలు వాటికి అప్పడప్పుడు నిద్రాభంగం కలిగిస్తాయి. పొరుగురాష్ట్రం తో ఏర్పడే వివాదాలకు పచ్చిగడ్డిని కూడా మండించే లక్షణం ఉంటుంది. బనకచర్ల విషయంలో గట్టి తెలంగాణవాది లాగా రేవంత్ రెడ్డి పోరాడకపోతే, బిఆర్‌ఎస్ ఇక పెద్దగా శ్రమపడనక్కరలేదు.
ఎవరు ఒప్పుకున్నా లేకున్నా, తెలంగాణ సమాజానికి అతి నెగిటివ్ భావోద్వేగం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మళ్లీ వస్తున్నాడు అని జనాన్ని భయపెట్టి, కెసిఆర్ రెండోసారి పెద్దమెజారిటీతో గెలవగలిగారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు ఇష్టుడిగా ఉండిన గతం వర్తమానంలో రేవంత్‌కు పెద్ద ప్రతికూల అంశం, బిఆర్‌ఎస్‌కు సానుకూల అంశం. దీనిని ఇప్పటికైనా గ్రహించినందువల్లనే కావచ్చు, చంద్రబాబునాయుడుకు రేవంత్ ‘సూచన’ చేశారు. కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి ప్రాజెక్టులు పూర్తి అవుతాయనుకుంటే పొరపాటని, ఎవరితోనైనా మాట్లాడడానికి తనకు భేషజాలు లేవని, అప్పటికీ కాకుంటే, తమ పద్ధతులు తమకు ఉంటాయని రేవంత్ రెడ్డి బుధవారం నాటి సమావేశంలో అన్నారు. ఆ మాత్రం గట్టిగా ఆయన మాట్లాడడం విశేషమే. తెలంగాణ రాష్ట్రప్రయోజనాలు, రాజకీయ అవసరాలు రేవంత్ ను అదే స్థాయిలో, ఇంకా హెచ్చు స్వరంతో మాట్లాడమని ఒత్తిడిచేస్తాయి. అందుకు ఆయన సిద్ధంగా ఉండాలి. చంద్రబాబు విషయంలో మెతకగా ఉంటూ, కెసిఆర్‌ను ఎంత విమర్శించినా ఉపయోగం లేదు. బిఆర్‌ఎస్ తన పునరుజ్జీవం కోసం తెలంగాణవాదం మీదనే ఆధారపడబోతున్నది. తెలంగాణ సెంటిమెంటు మీద తనకున్న విముఖత లేదా నిర్లిప్తతను వదులుకోకపోతే, రేవంత్ నిరాయుధంగా మిగులుతారు.
తెలంగాణ రాష్ట్రచిహ్నాలలో మార్పుచేర్పులు తేవడం, తాను స్వయంగా ఒక్కసారి కూడా ‘జై తెలంగాణ’ అని నినదించకపోవడం, తన ఆంతరంగికులలో, ఇష్ట అధికారులలో ‘ఆంధ్రులకు’ ఎక్కువ చోటు కల్పించడం వంటి అంశాలు జనం చర్చించుకుంటుంటారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో తెలంగాణ ప్రాంతీయులకు ప్రత్యేక హోదా పదవులు కట్టబెట్టారని అక్కడి వారు విమర్శించినట్టే, తెలంగాణవారు కూడా అధికారసీమలలో సంచరించేవారి ప్రాంతీయత విషయంలో పట్టింపుతో ఉంటారు. కానీ, తెలంగాణ సెంటిమెంటును ప్రదర్శించడం విషయంలో కానీ, గౌరవించడం విషయంలో కానీ, రేవంత్ రెడ్డికి ఎంతోకొంత సంకోచం మాత్రం ఉంది. అది పంతం కూడా కావచ్చు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందంతా కెసిఆర్‌కు సంబంధించిందే అన్న పొరపాటు అభిప్రాయం కూడా ఆయనకు ఉండవచ్చు.
తెలంగాణ అస్తిత్వానికి, ఉద్యమానికి సంబంధించిన జ్ఞాపకాలు జనం మనస్సులో నిద్రాణంగా అయినా సజీవంగా ఉన్నాయి. రాజకీయ స్పర్ధలు వాటికి అప్పడప్పుడు నిద్రాభంగం కలిగిస్తాయి. పొరుగురాష్ట్రం తో ఏర్పడే వివాదాలకు పచ్చిగడ్డిని కూడా మండించే లక్షణం ఉంటుంది. బనకచర్ల విషయంలో గట్టి తెలంగాణవాది లాగా రేవంత్ రెడ్డి పోరాడకపోతే, బిఆర్‌ఎస్ ఇక పెద్దగా శ్రమపడనక్కరలేదు.