-
మధురానగర్ లోని శిశు విహార్ కు తరలింపు
-
పిల్లల విక్రయాలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19 : చైతన్యపురి పరిధిలో అనుమానాస్పద వ్యక్తుల చేతుల్లో ఏడు మంది అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలను పోలీసులు రక్షించారు. ఇందులో ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులే.. బుధవారం అరెస్టైన వారిలో అమూల్య, వైశాలి భీమ్ రావు, జానాపల్లి కార్తీక్ , సజ్జన్ అగర్వాల్ , బానాల మంగయ్య, బోడాసు నాగరాజు, రామారాం అశొక్, షేక్ ఇస్మాయిల్, మాచర్ల వంశీకృష్ణ లు ఉన్నారు. ఇంకా ఈ పసిపిల్లలను కొనుగోలు చేసి దత్తత తీసుకున్న 17 మంది తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. పుట్టిన రెండు, మూడు రోజుల పసి శిశువులను వీరు కొనుగోలు చేస్తారని విచారణలో తెలిసింది. వీరికి విక్రయిస్తున్న ఏజెంట్లకు ఈ పసి పిల్లలను ఆర్థికంగా సతమతమవుతున్న వారి నుంచి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. కిడ్నాప్ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు యత్నిస్తున్నారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిసే వరకు మధుర నగర్ లోని శిశు విహార్ కు తరలించారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలి.. : మంత్రి సీతక్క
శిశువుల తల్లిదండ్రుల ఆచూకీ తెలిసే వరకు వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని శిశు విహార్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. ఈ ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చైల్డ్ ట్రాఫికింగ్ (child trafficking) పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.చిన్నారుల అక్రమ రవాణా మూలాలను ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంతానం లేని వారు దత్తత నియమాలు, నిబంధనలను అనుసరించి దత్తత తీసుకోవాలి. చట్ట విరుద్ధంగా తీసుకునే దత్తత చెల్లుబాటు కాదు.అక్రమ పద్ధతుల్లో దత్తత తీసుకుంటే చర్యలు తీసుకుంటాం. చైతన్యపురిలో రక్షించబడిన చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ దొరికేంతవరకు చిన్నారులు మా శాఖ సంరక్షణలో ఉంటారు. చిన్నారులు క్షేమంగా ఉన్నారు. తల్లిదండ్రుల ఆచూకీ లభించే అంతవరకు వారి బాధ్యత తామే తీసుకుంటామని మంత్రి సీతక్క వెల్లడించారు.

చిన్నారులను అక్కున చేర్చుకున్న శిశువిహార్
శిశువుల కోసం ప్రత్యేక గదిని సిద్ధం చేసిన సిబ్బంది
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19 : చైతన్యపురి పరిధిలో అనుమానాస్పద వ్యక్తుల చేతుల్లో ఏడు మంది అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలను పోలీసులు రక్షించారు. ఇందులో ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులే ఉన్నారు. అయితే వీరిని మధుర నగర్ లోని శిశు విహార్ కు తరలించారు. పోలీసు సిబ్బంది ప్రత్యేక వాహనంలో తోడుకొని వచ్చిన చిన్నారులను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ అధికారులు ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. శిశువిహార్ సిబ్బంది చిన్నారులకు డబ్బా పాలు పట్టి ఆలనా పాలనా చూస్తున్నారు. వీరి తల్లిదండ్రుల ఆచూకీ దొరికే వరకు చిన్నారులను తమ సొంత బిడ్డలా సాకుతామని సిబ్బంది పేర్కొన్నారు.





