హైదరాబాద్, జులై 1: ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్ మరణించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. హిప్నాటిస్టుగా ఆయన పేరు పొందారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్వగృహం వద్ద అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్ పార్థీవదేహాన్ని ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. 1949లో బీవీ పట్టాభిరామ్ జన్మించారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. ఆయన తండ్రి పేరు రావ్ సాహెబ్ భావరాజు సత్యనారాయణ. కౌమారదశలో కాలి వైకల్యం కారణంగా.. ఆత్మన్యూనతా భావాన్ని జయించేందుకు ఇంద్రజాలికుడిగా, రచయితగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కాకినాడలో ఉన్నత విద్యను ఆయన అభ్యసించారు. ఆ సమయంలో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి వద్ద ఆ విద్యను ఆయన నేర్చుకున్నారు. ఒకటి రెండు టాలీవుడ్ చిత్రాల్లో సైతం ఆయన నటించారు.దాదాపు అర్థ శతాబ్దం పాటు ఆయన ఇంద్రజాలికుడిగా, సైకాలజీస్టుగా సమాజానికి సేవలందించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ, ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. అలాగే ఇదే యూనివర్సిటీ నుంచి యోగా, హిప్నోటిజనంలో పీహెచ్‌డీ చేశారు. భారత ఆహార సంస్థలో ఆయన ఉద్యోగిగా విధులు నిర్వహించారు. పలు పురస్కారాలను సైతం ఆయన అందుకున్నారు.
ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్ మృతి
