హృదయ గవాక్షాలను తెరిచి
ఉదయాలను ఉల్లాసబరితం చేసే
పిచ్చుకల కిలకిల రావాలు ఏవి
ఆ మధుర స్వర దూతలు ఏవి !
సూర్యోదయ సూర్యాస్తమయాలలో
ఆ అలజడి ఆ అలికిడి ఏది
ఇంటి ముందు బుజ్జి పిల్లలై ఆడే
మనతో సహజీవనంచేసిన పిచ్చుకలు ఏవి !
వరి జొన్న కంకులు కట్టే చూరులు
పిట్టె గూళ్ళు ఉన్న ఇండ్లు ఉన్నాయా
అగ్గి పెట్టేల ఆకాశ హర్మ్యాలు వచ్చే
పిట్టల ఆవాసాలు చెదిరిపోయే!
క్రిమి సంహారక మందులు వచ్చే
చైనా నుండి జనం గుణపాఠం నేర్వక
జీవవైవిద్యం దెబ్బతిని చెట్లే కూలి
పిట్ట బ్రతుకే ప్రశ్నార్ధకమయ్యే !
పిచ్చుకలు నిరాడంబర జీవులు
మనిషికి జీవన పాఠం నేర్పిస్తాయి
పిట్ట కొంచెం తెలివి అమోఘం
అవి మన సంస్కృతికి చిహ్నాలు !
జనావాసాల్లో గూళ్ళు నిర్మించు
గుప్పెడు గింజలు తినే పిచ్చుకలను
ఇంటికి రా రమ్మని రప్పించు
రాబోయే ముప్పును తప్పించు!
(మార్చ్ 20 అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం)
– పి.బక్కారెడ్డి, 9705315250