నన్ను బోనులో నిలబెడతారు
మీరంతా
ఈ దుఃఖావరణంలో
గూళ్ళు వదిలి
దూరాల్ని తొవ్వుకుంటూ
మెతుకు ను
ఈ టన్నెల్లో
కనుగొన్నాయా శ్రమలు
చేజారిన పీఠం
చేతిలోని పీఠం
పోసుకుంటున్న దుమ్మంతా బుర్దంతా
ఈ టన్నెల్లో కూల్తుందన్న సత్యం
ఆ చెమట చుక్కలకు తెలియదు
పసి పేగులకో వృద్ధ్యాప్యానికో
బతుకు నివ్వడం కోసం
జీవితాల తరుముకుంటూ వస్తే
నా గుండెల కత్తుకున్నాను
నా సొరంగంలో దుఃఖం పార్తుందను కోలేదు
మూడు గంటల సిన్మా చూసిన అనుభూతితో
మీ మనసంతా
ఒక విషాదాన్ని వేలాడేసుకొనో
కళ్ళల్లంతా
ఓ రెండు కన్నీటి చుక్కలు పులుముకొనో
ముఖం మీద
శుభం కార్డు తొడుక్కుంటారు కానీ
నా జీవిత కాలమంతా
ఈ నెత్తుటి చారికల తడి సల్పుతుంటుంది
ఏం చేయను
పాపం!
నేనెంత మొత్తుకున్నా
ఆ బతుకులకు వినిపించలేదు
పాలకులు శిథిలం చేసిన
నా ఎన్నుపూసల పొట్టపేగుల గురించి
నాకే పాపం తెలియదు
సాగునీరైయ్యో
తాగునీరైయ్యో
బతుకుల్లోకి ప్రవహించానే కాని
బతుకులు మింగేయలేదు
మెతుకులు మిన్గేయలేదు
మీరు నమ్మండి నమ్మకపొండి
ఈ శ్వాసల సమాధి
నేరం నాది కాదు
నేను సమాదైయ్యేలా ప్రేమించిన
అవినీతులది
నిజానికి
తెలంగాణ
బతుకు నిచ్చేది
బతక నిచ్చేది కాని
కొత్త బిచ్చగాళ్ళు నాకేసిన విస్తరైంది
– వడ్డెబోయిన శ్రీనివాస్
9885756071