
‘అచ్చం మా అమ్మలా వుంది’ అప్పటికి యే పదోసారో అనుకున్నాడు తండ్రి, పెళ్ళిదుస్తుల్లో వున్న కూతుర్ని చూసి మురిసి ముచ్చటపడి. కళ్ళుపట్టని అందాల అలంకృత పెళ్ళికూతుర్ని చూసి ‘అమ్మలా కాదు, బుట్టబొమ్మలా వుంది’ నవ్వాడు మావయ్య. ‘ఆమె బొమ్మే, ఆమెకు సొంత అభిప్రాయాలు లేవు, తలిదండ్రులు చెప్పినట్టు నడుచు కుంటుంది ఆ అమ్మాయిని యిష్టపడ్డ కుర్రాడు గొణుక్కున్నాడు, దూరంగా నిలబడి. తమ ప్రేమకోసం తలిదండ్రుల్ని యెదిరించి తనపక్కన నిలబడలేదని. ‘లేదు, తను నీమీద ప్రేమతోనే చేసింది, రేపు పెళ్ళయ్యాక వాళ్ళ యింట్లోవాళ్ళు నిన్ను లేపెయ్యకుండా’ వేసేశాడు వాడి మిత్రుడు.
నవవధువుగావున్న మనుమరాలిని చూస్తుంటే యెందుకో తనపెళ్ళి గుర్తుకువచ్చింది అమ్మమ్మకి. అప్పుడు పెళ్ళిచూపుల్లో పెళ్ళికొడుకుని చూడలేదు. పెళ్ళిలో సగమే తెలెత్తింది. సగం చూడలేదు. తిట్లు తింది. తలపైకెత్తి అలా మగరాయుడిలా చూడకూడదని. శోభనమప్పుడు సిగ్గూబిడియంతో తలెత్తలేదు. కార్యక్రమం జరిగాక నిద్రపోతున్న అతణ్ణి చూసి ‘వీడా నామొగుడు?’ అనుకుంది. ఆపై అమ్మమ్మకు వాళ్ళ అమ్మ అన్నమాటా గుర్తుకువచ్చింది. ‘నా పెళ్ళి నాకు గుర్తులేదు, నాకు వూహ తెలియనప్పుడు, యింకా చెప్పాలంటే కూర్చోడం కూడా సరిగా రానప్పుడు గోడచేర్పులాగ పళ్ళెరం పెట్టి మరీ చేశారట’. ‘పోనీలే, నాలుగోతరం దగ్గరకు వచ్చేసరికి కాలం మారింది’ అనుకుంది అమ్మమ్మ.
‘ఏమి మారింది? మంచి సాఫ్ట్‌వేర్ వుద్యోగం చేస్తూ కూడా యివ్వాల్సింది యివ్వాల్సి వస్తోంది. సమానచదువు. సమాన వుద్యోగం. కానీ ఆడామగా సమానం కాదు. నా కొడుకు దగ్గరున్నదంతా వూర్చుకుపోతోంది నా మనమరాలు’ అనుకుంది పెళ్ళికూతురి నాయనమ్మ. ‘నా కూతురు బంగారు బొమ్మ’ అని దిష్టి తీసింది కాసిన తల్లి. ‘పెళ్ళిలో అందరూ పెళ్ళికళ వుట్టిపడే బొమ్మలే. పెళ్ళి తరువాత కళ పోయినా, బొమ్మలుగా వుంటేనే గొడవలూ గొల్లూ లేకుండా సంసారాలు సాగుతాయి’ పెళ్ళికూతురి వదిన యే అనుభవమో యేమో గొణుక్కుంది. ఆ వదినా అన్నల కూతురు అంటే పెళ్ళికూతురి మేనకోడలు బొమ్మతో ఆడుతూవచ్చి పెళ్ళికూతురు వొడిలో కూర్చుంది. ‘తోడి పెళ్ళికూతురు’ అన్నారు కొందరు. ‘తోక పెళ్ళికూతురు’ అన్నారు కొందరు, ఆట పట్టిస్తూ. ‘నేనే అసలు పెళ్ళికూతురుని’ నవ్వింది ఆ ఆరేళ్ళ పిల్ల.
ఆ పిల్ల తండ్రి ‘మరి తోడి పెళ్ళికూతురు యెవరు?’ ఆట పట్టించడానికి అడిగాడు. అసలు పెళ్ళికూతుర్ని చూపించింది ఆ పిల్ల. అందరూ నవ్వుకున్నారు. భోజనాల సమయం కావడంతో అంతా యెటువాళ్ళు అటువెళ్ళారు. ఆ పిల్ల పెళ్ళికూతురు వొడిలో కూర్చొని తనవొళ్ళో బొమ్మని పెట్టుకొని ‘ఏయ్ పెళ్ళికూతురా? నీకు పెళ్ళికొడుకు నచ్చాడా? లేదా? ఎవరు నచ్చారో చెప్పు?’ అని అడిగింది. బొమ్మమెడలో హారాన్ని సర్దింది. పెళ్ళికూతురు అంతా గమనిస్తోంది. ‘ఏయ్ నిన్నే నోరువిప్పు, మాట్లాడు, నీ నోరు యెవరు కుట్టేశారు?’ బొమ్మని పట్టుకు కదిపింది పిల్ల. బొమ్మ యేమీ మాట్లాడలేదు. ‘అత్తా… యీ బొమ్మ మాట్లాడితే బాగుణ్ను కదా?’ అడిగింది పిల్ల. పెళ్ళికూతురు వులిక్కిపడింది.
-బమ్మిడి జగదీశ్వరరావు





