“భాజపా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి—నాయకత్వం చుట్టూ ఉన్న అనిశ్చితి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి దృఢమైన నేతలున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఓ సమగ్రమైన, వర్గాలన్నింటిని ఆకట్టుకునే నాయకత్వం ఇంకా రూపు దాల్చలేదు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే మొదటగా అవసరమైనది—స్థిరమైన, స్పష్టమైన, ప్రజలతో కలిసిపోయే నాయకత్వ నిర్మాణం. తెలంగాణ ప్రత్యేకత, భాషా స్వభావం, ప్రాంతీయ చరిత్ర, ఉద్యమ భావజాలం— అర్థం చేసుకునే నాయకత్వం లేకపోతే పార్టీ గ్రామీణ తెలంగాణ లోకి చొచ్చుకు పోలేని వాస్తవం గణాంకాలే తెలియజేస్తున్నాయి.”
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి బీఆర్ఎస్ ఆధిపత్యం, కాంగ్రెస్ సంప్రదాయ బలం, కొత్త ఆశావాదంతో ముందుకు వచ్చే భాజపా—ఇలా రాష్ట్ర రాజకీయ వేదిక త్రిముఖంగా మారింది. 2014లో భాజపా వోటు శాతం 7.1 మాత్రమే ఉండగా, 2018లో అది 6.9కు తగ్గింది. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో 19.45శాతం వోట్లను సాధించి నాలుగు సీట్లు గెలుచు కోవడం పార్టీకి తెలంగాణలో ఉత్సాహాన్నిచ్చింది. 2020 జి హెచ్ ఎం సి ఎన్నికల్లో 48 డివిజన్లు సాధించడం భాజపాను రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 8 సీట్లు, 13.90శాతం వోట్లను తెచ్చుకోవడం పార్టీకి నిర్మాణాత్మక దిశను చూపినప్పటికీ, ఈ బలం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా వ్యాపించ లేకపోవడం ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం.
తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో 2023 తరువాత స్పష్టమైన విషయం—కాంగ్రెస్ పునరుద్ధరణ మరియు బీఆర్ఎస్ క్షీణత. ఈ ఇద్దరి పక్కన భాజపా నగర మరియు అర్బన్ పరిధుల్లో మాత్రమే ప్రధాన బలం పొంద గలిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భాజపా వోటు శాతం 18–26 మధ్య ఊగిసలాడినప్పటికీ, గ్రామీణ తెలంగాణలో మాత్రం 7–10 శాతం మధ్యనే నిలిచి పోయింది. తెలంగాణలో 54 శాతం బీసీ జనాభా, 18 శాతం ఎస్సీ, 9శాతం ఎస్టీ, 12 శాతం ముస్లిం మైనారిటీ—ఇలాంటి విభిన్న సామాజిక నిర్మాణంలో భాజపా సమగ్ర మద్దతును పొందడంలో ఇంకా దూరంగానే ఉంది. 2023 ఎన్నికల్లో బిసి లలో భాజపా వోటు శాతం సుమారు 22 ఉన్నప్పటికీ, అది గెలుపు సీట్లు తెచ్చే స్థాయికి చేరలేదు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ప్రభావం 8–12 శాతం మధ్య మాత్రమే ఉండటం పార్టీకి పెద్ద అడ్డంకి. మైనారిటీ ఓటు శాతం 2 శాతం కంటే తక్కువగా ఉండటం మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
తాజా సర్వేలు సూచిస్తున్న విధంగా తెలంగాణలో జాతీయ నాయకత్వాన్ని ప్రాధాన్యం ఇస్తున్న వోటర్లు 38–42శాతం మధ్య ఉన్నారు. ఇది భాజపాకు గొప్ప అవకాశం. అదే సమయంలో, 2023 తరువాత కాంగ్రెస్‌పై అసంతృప్తి 27 శాతానికి పెరిగింది, బీఆర్ఎస్‌పై అసంతృప్తి 41శాతంగా ఉంది. ఈ పరిస్థితిలో భాజపాకు ఉన్న అవకాశాలు స్పష్టంగా పెరిగాయి. కానీ ఈ అవకాశాలను నిజంగా గెలుపుగా మార్చడంలో కీలకంగా మారింది—పార్టీ అంతర్గత ఐక్యత మరియు నాయకత్వ స్పష్టత.
గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ తెచ్చిన సంక్షేమం, కులపరమైన శక్తి సమీకరణం, భూమి ఆధారిత ఆర్థిక వ్యవస్థ—ఇవన్నీ బలమైన కోటల్లాగా ఉన్నాయి. కాంగ్రెస్ ఇటీవల ఈ కోటలను పగుల గొట్టడంలో విజయవంత మవుతోంది. భాజపా ఈ స్థితి నుంచి బయటపడాలంటే ముఖ్యంగా ఆరెస్సెస్ అనుబంధ సంస్థలతో గ్రామ స్థాయిలో బలమైన ఆర్గనైజేషన్ నిర్మించాలి. భాజపాలో రెండవ పెద్ద లోపం—యువతను ఆకర్షించడంలో సరైన స్పష్టత లేకపోవడం. తెలంగాణలో 18–35 ఏళ్ల వయసు గల వోటర్లు 42 శాతం మంది ఉన్నారు. వీరిని ఆకర్షించే విధంగా ఉద్యోగ అవకాశాలు, స్టార్టప్ హబ్‌లు, డిజిటల్ విద్య, టెక్నాలజీ శిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ అవసరం. భాజపా ఇప్పటివరకు ఈ వర్గాన్ని చేరుకునే స్థాయి కమ్యూనికేషన్ మోడల్‌ను అభివృద్ధి చేయలేక పోయింది.
సాధారణ ఎన్నికల దిశగా చూస్తే భాజపాకు అత్యుత్తమ అవకాశం—జాతీయ భద్రత, అవినీతి రహిత పాలన, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమం కన్నా సాధికారతను ప్రాధాన్యం ఇచ్చే వివరణాత్మక నేరేటివ్. కేంద్రం చేపట్టిన హైవేలు, రైల్వేలు, దళిత బంధు ప్రత్యామ్నాయ పథకాలు, స్టార్టప్ ఇన్క్యుబేటర్లు, ఎంఎస్పీ పెంపు, రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ వంటి అంశాలను ప్రజలకు సాక్ష్యాధారాలతో సమగ్రంగా వివరించ గలిగితే పార్టీకి పట్టణ ప్రాంతాల్లో భారీ లాభం వచ్చే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, విద్యుత్ ఉత్పత్తిలో తగ్గుదల, ఉద్యోగ నియామకాల లేటు, వ్యవసాయ సంక్షోభం—ఇవి భాజపాకు బలమైన రాజకీయ ఆయుధాలు కావచ్చు.
అయితే బలం ఉన్నంతనే బాధ్యత కూడా ఉంది. తెలంగాణలో భాజపా నిజమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే తప్పనిసరిగా చేయాల్సింది—ఐక్యత, క్రమశిక్షణ, వర్గాలన్నింటిని కలుపుకునే రాజకీయ దృక్పథం, తెలంగాణ భావజాలాన్ని గౌరవించే ప్రచార శైలి. కేవలం వ్యతిరేకతతో గెలవలేము—పరిపూర్ణ ప్రజానాడిలో మమేకమై సానుకూల భావజాలంతో ముందుకు సాగాలి. రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో పరిస్థితులు మారుతున్నాయి; ప్రజలు మార్పు కోరుతున్నారు; అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఈ అవకాశాలను భాజపా సరిగ్గా ఉపయోగించుకుంటే రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీకి ఊహించని విజయ ఫలితాలు సాధ్యం.
తెలంగాణలో భాజపా ఈ రాజకీయ దశలో నిలిచి ఉన్నది—సామర్థ్యాలు ఉన్నా, అవి సంపూర్ణంగా వినియోగించని దశలో. ఇప్పుడు అవసరం—స్పష్టత, వ్యూహం, క్రమశిక్షణ, సామాజిక విస్తరణ, మరియు తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్న ప్రజానీకంతో మమేకత. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఈ నేలపై భాజపా నిజమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగ గలదు.
రామ కిష్టయ్య సంగన భట్ల
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్..
.9440595494





