- 1200 మందికి పైగా యువత ప్రాణత్యాగాలు
- బీఆర్ ఎస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
- నిజాయతీ పాలనే మా లక్ష్యం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2: అన్ని పార్టీలకన్నా ముందుగా బీజేపీ(BJP) తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీనేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు పేర్కొన్నారు. గల్లీ నుంచి దిల్లీ దాకా బీజేపీ పోరాడిందని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం దేశ పార్లమెంట్లో గళమెత్తిందని తెలిపారు. ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు, లాఠీలతో విరుచుకుపడినప్పుడు, దేశ వ్యాప్తంగా బీజేపీ ఎంపీలు తెలంగాణ యువతకు అండగా నిలిచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఉదయం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీజేపీ అన్ని జిల్లాల్లో ఉత్సాహంగా, ఘనంగా జరుపుకుంటోందన్నారు. తెలంగాణ ప్రజలందరికీ బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం 1200 మందికిపైగా యువతులు, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు ఆందోళనలు కొనసాగినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ హామీ ఇచ్చిన బంగారు తెలంగాణ సాధించలేదని, ఆయన కుటుంబం మాత్రం బంగారమైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడిపారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ప్రధానిగా ఉన్న సోనియాగాంధీని “తెలంగాణ పాలిట దెయ్యం” అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి రాగానే ఆమెను దేవతగా పొగడటం ద్వంద్వ వైఖరిని చూపిస్తోందన్నారు. మిగులు బడ్జెట్తో ప్రారంభమైన తెలంగాణ ఈ రోజు రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఇది టీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల వల్లే అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పునర్ నిర్మించాలంటే బీజేపీనే ప్రత్యామ్నాయమని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నీతి, నిజాయితీతో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా, అభివృద్ధి చేస్తామని ఒట్టేసి చెబుతూ తెలంగాణ రాష్ట్రాన్ని నీతి, నిజాయితీతో, అంకితభావంతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇది బిజెపి మాట.. నరేంద్ర మోదీ గారి మాట అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.





