అటవీ నిర్మూలన కార్యకలాపాలను ఆపాలి
సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : ప్రపంచ వ్యాప్తంగా అటవీ, జీవవైవిధ్య, విస్తృత పర్యావరణ క్షీణత అత్యంత ప్రమాదకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ లో ప్రపంచంలోనే భారతదేశం రెండో స్థానంలో ఉందని, అందులో దక్షణ భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ ఉందని అన్నారు. ఇది ప్రజల జీవితాలు, జీవనోపాధికి హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా భారత సాంస్కృతిక సహకార, స్నేహ సంఘం (ఇస్కఫ్), ఆల్ ఇండియా తంజీమ్ -ఏ – ఇన్సాఫ్ సంయుక్తాధ్వర్యంలో హైదరాబాద్, బాగ్ లింగంపల్లి, సుందరయ్య పార్క్ వద్ద గురువారం ప్రదర్శన నిర్వహించింది. సయ్యిద్ అజీజ్ పాషా తోపాటు ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షులు రేఖల గోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి ప్రభాకర్, నాయకులు ఎ.విజయ లక్ష్మి, ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మునీర్ పటేల్, సిపిఐ ముషీరాబాద్ నియోజకవర్గం సహాయ కార్యదర్శి సురేందర్ తదితరులు ప్లకార్డులు చేతబూని భూమి మనుగడ, మన ప్రాధాన్యత. భూమి అందం మన కర్తవ్యం. ఆకుపచ్చగా ఆలోచించండి, శుభ్రంగా జీవించండి, రేపటి కోసం ఈరోజే భూమిని కాపాడండి అని నినాదాలు చేస్తూ నిర్వహించిన ప్రదర్శన పలువురిని ఆకర్షించాయి.
ఈ సందర్బంగా సయ్యిద్ అజీజ్ పాషా మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా, ప్రబలమైన పారిశ్రామికీకరణ, ప్రభుత్వాల తిరోగమన విధానాలు పర్యావరణానికి భారీ ముప్పును కలిగిస్తున్నాయని, దేశంలో 2019 నుండి 2022 వరకు 5.8 మిలియన్ చెట్లు నరికివేయబడ్డాయని, ఉపగ్రహ సర్వేలో 11% పూర్తిగా పెరిగిన చెట్లు నరికివేయబడ్డాయని తేలిందని, దక్షిణ భారతదేశంలోని తెలంగాణలో అత్యధికంగా 2014 నుంచి 2024 వరకు 11,422 హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ సంక్షోభం, క్షీణిస్తున్న గాలి నాణ్యత, అటవీ నిర్మూలన, ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం ప్రజల జీవితాలను ప్రమాదంలో పడవేస్తున్నాయని, ఇది గ్లోబల్ వార్మింగ్ కు నిదర్శనమన్నారు. ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 45°సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఇది నీటి వనరులను, వ్యవసాయం, ప్రజల ఆరోగ్యాలపై ప్రభావితం చేసిందని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం 1997 క్యోటో ప్రోటోకాల్, 2015 పారిస్, సిఓపి-19, బాకు వంటి అంతర్జాతీయ ఒప్పందాలను ఖచ్చితంగా బలోపేతం చేయవలసిన అవసరం ఉందని అన్నారు.
పట్టణ ప్రకృతి దృశ్యానికి ప్రాణం పోసే పర్యావరణపరంగా సున్నితమైన కంచా గచ్చిబౌలి అడవిని తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం వేలం వేయడానికి అక్కడ ఉన్నసహజ గడ్డి, చెట్లను నరకడం, వన్యప్రాణులకు హాని జరగడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు జోక్యంతో కంచా గచ్చిబౌలి అడవి భూములు రక్షించబడ్డాయని చెప్పారు. గ్రీన్ హౌస్ వాయువుల విడుదల నుండి ప్రపంచాన్ని రక్షించడంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఇంటి నిర్మాణానికి అనుమతి పొందే ముందు రెండు చెట్లను నాటాలనే ముందస్తు షరతును బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తుందని, దీనిని జిహెచ్ఏంసి మరియు ఇతర మునిసిపాలిటీలను అమలు చేయాలనీ సయ్యిద్ అజీజ్ పాషా విజ్ఞప్తి చేసారు.
రేఖల గోపాల్ మాట్లాడుతూ ఊహించలేని వేడి తరంగాలు, వరదలు మరియు తుఫానులు తీవ్రతరం అవుతున్నందున, గ్లోబల్ వార్మింగ్ మొత్తం ప్రపంచానికి అతిపెద్ద ప్రమాద సంకేతం అని, మన జీవితాలకు అనూహ్యమైన నష్టాన్ని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ను ఒక్కసారి వాడకానికి నో చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణ పచ్చదనాన్ని పెంచడానికి చట్టాలు మరియు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆయన నొక్కి చెప్పారు. కడారి ప్రభాకర్, మాట్లాడుతూ అంటార్కిటికా, పచ్చని భూముల వద్ద హిమానీనదాలు చాలా వేగంగా కరిగిపోతున్నందున, ప్రస్తుత పర్యావరణాన్ని మెరుగుపరచడానికి బహుముఖ విధానం అవసరమని అన్నారు. మునీర్ పటేల్ మాట్లాడుతూ పర్యావరణం పై ప్రజా అవగాహన ప్రచారం, సమాజ భాగస్వామ్యాన్ని అవసరమన్నారు.