- ప్రియాంకగాంధీపై బిజేపి నేత వ్యాఖ్యలు దారుణం
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, జనవరి 7: హైదరాబాద్‌లో గాంధీ భవన్, బిజెపి కార్యాలయాలపై జరిగిన దాడులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Mallu) స్పందించారు. ఎర్రుపాలెం మండలంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు పర్యటనలో ఉన్న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైందవ సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి గొప్పలు మాట్లాడే బిజెపి నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు, దిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రమేష్ బిదోరి.. ఎంపీ ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలను భారతదేశంలో స్త్రీల పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు.
శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేస్తాం..
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పటిష్టంగా అమలు చేస్తామని, బిజెపి కార్యాలయంపై యువజన కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఉప ముఖ్యమంత్రిగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఖండించినట్టు తెలిపారు. కొందరు బిజెపి నాయకులు దాడి గురించి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, ముందుగా మీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని, సంస్కృతి, సంస్కారం నేర్పాలన్నారు. ప్రియాంక గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిజెపి కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ సంస్కృతిని దిగజార్చే పరిస్థితి తెచ్చినందుకు బిజెపి నాయకులు సిగ్గుపడాలన్నారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా, రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యురాలు ప్రియాంక గాంధీ పై బిజెపి నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రియాంక గాంధీపై బిజెపి నాయకుడు చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేక తాత్కాలిక ఆవేశంతో కొంతమంది యువజన కాంగ్రెస్ నాయచేయడాన్ని ఖండిస్తున్నానని, ఈ ఘటనను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండించారని తెలిపారు. అహింసా, గాంధేయ మార్గంలో ఎదుటివారి తప్పులను ఎత్తిచూపుతూ ప్రజాస్వామ్యంగా ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టడమే తప్ప భౌతిక దాడులను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడు ప్రోత్సహించదన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన భావ స్వేచ్ఛ హక్కును వినియోగించుకొని తమ భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలకు ఏ పార్టీ కూడా పాల్పడద్దని అన్నారు.
పార్లమెంట్ సభ్యురాలు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పై మాజీ ఎంపీ, బిజెపి నాయకులు రమేష్ బిదోరి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించకుండా బిజెపి నాయకత్వం కండ్లు మూసుకొని నిద్ర పోతుందా అని ప్రశ్నించారు. రెండు రోజులవుతున్నా ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం ఇప్పటికే స్పందించి రమేష్ బిదోరిని సస్పెండ్ చేసి ఉండాల్సిందని, కనీసం స్పందించ లేదని మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ప్రోత్సహించేలా బిజెపి కేంద్ర నాయకత్వం గాలికి వదిలేయడం తగదని తీవ్రంగా ఖండించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఎర్రుపాలెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.