దేశం అభివృద్ధి చెందుతోందని పాలకులు గర్వంగా చెబుతున్నారు.మన దేశం నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదవ అతిపెద్ద శక్తిగా ఎదిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి ర్యాంకులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి ఎవరికి? ఈ గణాంకపు తళతళల వెనుక సామాన్య భారతీయుడి బతుకు భారమైపోతోంది. అభివృద్ధి ఫలాలు కొందరి చేతుల్లో కేంద్రీకృతమై, దాని భారము మాత్రం సమాజం మొత్తంపై మోపబడుతోందన్న చేదు నిజం ఈ రోజు భారత వాస్తవం.అభివృద్ధి అంటే కేవలం సంపన్న వర్గాల సంపద పెరగడమేనా? లేక సమాజంలోని కట్టకడపటి వ్యక్తి జీవితంలో వెలుగులు నింపడమా? అన్నది నేడు మనం వేసుకోవాల్సిన అతిపెద్ద ప్రశ్న ?
అభివృద్ధి అనేది లాభమా? లేక భారమా?
పెద్ద రహదారులు, భారీ ప్రాజెక్టులు, కార్పొరేట్ పెట్టుబడులు ఎక్స్‌ప్రెస్ వేలు, బుల్లెట్ రైళ్లు అభివృద్ధికి చిహ్నాలుగా చూస్తాం. కానీ ఆ రహదారుల కోసం వేలాది ఎకరాల సారవంతమైన భూమిని సేకరిస్తున్నారు. ఆ భూమిని కోల్పోయిన రైతుకు ఇచ్చే పరిహారం అతని తదుపరి జీవనోపాధికి సరిపోవడం లేదు. అయితే ఈ ప్రాజెక్టుల వల్ల నిజంగా లాభపడుతున్నది ఎవరు? ఒక మెగా ప్రాజెక్టు కోసం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ ప్రాజెక్టుల వల్ల వారి సంస్కృతి, జీవనాధారం నాశనమవుతున్నాయి. పెరిగిన ధరలతో బతుకు భారమైపోయిన మధ్యతరగతి వారందరూ ఆ అభివృద్ధికి చెల్లించిన మూల్యం ఎవరు లెక్కిస్తున్నారు? ఇవన్ని పోల్చిచూస్తే లాభం ఎవరికీ నష్టం ఎవరికీ అర్థం అవుతుంది. అభివృద్ధి పేరుతో తీసుకున్న అప్పులు దేశ ఖజానాను ఖాళీ చేస్తున్నాయి. ఆ అప్పుల వడ్డీ భారం పన్నుల రూపంలో ప్రజల మీద పడుతోంది. కానీ ఆ డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టుల లాభాలు మాత్రం కొద్ది కార్పొరేట్ సంస్థల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయి.
ఇది అభివృద్ధినా? లేక వనరుల అసమాన పంపిణీకి అధికార ముద్ర వేయడమా?
నేటి పాలనలో అభివృద్ధి అంటే కార్పొరేట్ పెట్టుబడులకు ఎర్రతాపీ వేసే విధానం. పర్యావరణ చట్టాలు సడలిస్తారు, భూసేకరణ సులభతరం చేస్తారు, పన్ను రాయితీలు ఇస్తారు. కానీ అదే సమయంలో రైతుకు గిట్టుబాటు ధర లేదు, కార్మికుడికి ఉద్యోగ భద్రత లేదు, యువతకు ఉపాధి హామీ లేదు. లాభాలు ప్రైవేట్, నష్టాలు పబ్లిక్ ఇదే నేటి అభివృద్ధికి మోడల్. ప్రాజెక్ట్ విఫలమైతే నష్టం ప్రభుత్వానిది, విజయం సాధిస్తే లాభం కంపెనీలది. ఇదేమి అభివృద్ధి? భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, సంపద పంపిణీలో భయంకరమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఆక్స్‌ఫామ్ వంటి అంతర్జాతీయ సంస్థల నివేదికలు దేశంలోని మొత్తం సంపదలో సుమారు 40% పైగా కేవలం 1% ఉన్నత వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. మరోవైపు, కిందనున్న 50% జనాభాకు దక్కుతున్న సంపద కేవలం 3% మాత్రమేనని వెల్లడించాయి.
ప్రభుత్వ విధానాలు ‘ట్రికిల్ డౌన్ సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నాయి. అనగా ప్రభుత్వం ధనవంతులపై పన్నులు తగ్గిస్తే వారు ఆ మిగిలిన డబ్బును కొత్త వ్యాపారాలలో పరిశ్రమలలో పెట్టుబడి పెట్టడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.ప్రజల ఆదాయం పెరిగి, వారు వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. చివరికి ఆ సంపద పైన ఉన్న ధనవంతుల నుండి కింద ఉన్న సామాన్యుల వరకు చేరుతుంది. అంటే పైన ఉన్న పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తే, ఆ లాభాలు క్రమంగా కింది స్థాయి వరకు చేరుతాయని భావించడం. కానీ వాస్తవంలో ఆ లాభాలు కార్పొరేట్ లాబీల్లోనే ఆగిపోతున్నాయి. మధ్యతరగతి మరియు పేద వర్గాలకు కేవలం పెరుగుతున్న ధరలు, పన్నుల భారం మాత్రమే మిగులుతున్నాయి.
సంపదను ప్రైవేటు చేతుల్లోకి మళ్లించడం ద్వారా మధ్యతరగతి బలి
ఈ దేశాన్ని మోసేది మధ్యతరగతి ప్రజలే. పన్నులు చెల్లించేది వారే, ధరల పెరుగుదల భరించేది వారే, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులూ కారు. అయినా పాలకుల అభివృద్ధి కథనాల్లో మధ్యతరగతి జీవితం ఎక్కడా కనిపించదు.దేశాభివృద్ధి కోసం నిధులు సేకరించడం ప్రభుత్వ బాధ్యత. అయితే, ఆ సేకరణ పద్ధతి పక్షపాతంగా ఉంది. ప్రత్యేక్ష పన్నుకంటే పరోక్షంగా GST ద్వారా ఒక సామాన్యుడు కొనే పాల ప్యాకెట్ మీద, బియ్యం మీద లేదా ఒక చిన్న వస్తువు మీద పడే పన్ను శాతం, ఒక కోటీశ్వరుడు కొనే అదే వస్తువుపై పడే పన్ను శాతంతో సమానం. దీనిని ‘రిగ్రెసివ్ టాక్సేషన్’ అంటారు. ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తోంది. కానీ అదే సమయంలో, సామాన్యుడిపై సెస్సులు, సర్ఛార్జీల రూపంలో భారం మోపుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గినప్పుడు కూడా భారత్‌లో తగ్గకపోవడానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధిక పన్నులతో ఖర్చులు ఆకాశాన్ని తాకుతాయి. అభివృద్ధి గణాంకాల్లో దేశం ముందుకు వెళ్తుంది, కానీ ఇంటి బడ్జెట్‌లో కుటుంబం వెనక్కి నెట్టబడుతుంది. అభివృద్ధి పేరుతో అడవులు నరికి నదులను మింగేస్తు, కొండలను చెరిపేస్తున్నారు. తాత్కాలిక ఆర్థిక లాభాల కోసం దీర్ఘకాలిక పర్యావరణ విపత్తులకు బీజం వేయడంతో వర్షాలు అస్తవ్యస్తం, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రకృతి ప్రతీకారం మొదలైంది. అభివృద్ధి కొందరికి లాభం ఇస్తే, పర్యావరణ నాశనం మాత్రం అందరికీ శిక్ష విధిస్తోంది.
వరదలు వచ్చినప్పుడు కార్పొరేట్ గదులు మునగవు పేదల ఇళ్లే మునుగుతాయి. GDP పెరుగుతోన్నప్పుడు ఆకలి తగ్గిందా? నిరుద్యోగం తగ్గిందా? సామాన్యుడి భద్రత పెరిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు అస్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే నేటి అభివృద్ధి మోడల్ మనిషి జీవితాన్ని కేంద్రంగా పెట్టుకోలేదు లాభాలను మాత్రమే పెట్టుకుంది. దేశం అభివృద్ధి చెందుతుందా అన్న ప్రశ్న కంటే, దేశ ప్రజలు బాగుపడుతున్నారా? అన్న ప్రశ్న ముఖ్యమైనది. ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగిన రోజే నిజమైన అభివృద్ధి మొదలవుతుంది. మనిషిని కేవలం ఒక ‘వినియోగదారుడి’లా కాకుండా, అభివృద్ధిలో భాగస్వామిగా చూడాలి. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, ఆ సంపద అందరికీ సమానంగా అందడం అంతకంటే ముఖ్యం.అభివృద్ధి కొందరిదైతే దేశం అభివృద్ధి చెందినట్లు కాదు . లాభాలు కొద్ది మందికే చేరి భారాలు కోట్ల మందిపై పడితే, ఆ అభివృద్ధి ఒక రోజు తిరుగుబాటుకు దారి తీస్తుంది. అభివృద్ధి భవనం అసమానతల పునాదులపై ఎక్కువ కాలం నిలబడలేదు. అభివృద్ధి అంటే భవనాలు కాదు బతుకులు. అభివృద్ధి అంటే గణాంకాలు కాదు గౌరవం. అభివృద్ధి అంటే కొందరి సంపద కాదు అందరి సంక్షేమం. పాలకులు గణాంకాల మాయాజాలం నుండి బయటకు వచ్చి, సామాన్యుడి కళ్లలో ఆనందాన్ని వెతికినప్పుడే అది నిజమైన ‘అభివృద్ధి’ అనిపించుకుంటుంది.
దుప్పటి మొగిలి





