ప్రత్యక్ష యుద్ధాలు ఉండవు.. ప్రచ్ఛన్న యుద్ధాలే ..!

గత పది రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించి, ఇరాన్ సీనియర్ సైనికాధికారులు మరియు అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. దీనికి ప్రతిగా తెహ్రాన్ క్షిపణి దాడులకు పాల్పడి, అనంతర రోజులలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పరస్పరం దాడులు కొనసాగించాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ తన లక్ష్యాలను విస్తరించి, ఇరాన్‌లోని ఇంధన కేంద్రాలు మరియు తయారీ పరిశ్రమలను కూడా లక్ష్యంగా చేసుకుంది.  ఈ సంఘటనల మధ్య ట్రంప్ ఈ ఘర్షణకు ఇరాన్‌ను బాధ్యుడిగా పేర్కొంటూ, ఇజ్రాయెల్ సైనిక చర్యల్లో అమెరికా జోక్యం చేసుకోవచ్చని ..15 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్న రెండు రోజులకే ఇరాన్ అణ్వస్త్రాల స్థావరాలపై  బాంబుల వర్షం కురిపించారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీని వ్యతిరేకిస్తూ అమెరికా ఇజ్రాయిల్ కు మద్దతుగా నిలబడడం ..ఇరాన్ కు మద్దతుగా రష్యా ..చైనా అండగా నిలబడతాయన్న వార్తల   నేపథ్యంలో పరిణామాలు  మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. .

వర్తమానంలో  ప్రపంచ దేశాల మధ్య జరిగే యుద్ధాల స్వరూపం మారిపోయింది. ఒకనాడైతే దేశాలు పరస్పరం సైనికంగా ఎదురెదురు గా తలబడుతూ , రక్తపాతం చేసుకుంటూ యుద్ధాలు చేసేవి. కానీ నేడు  ప్రపంచంలో అటువంటి ప్రత్యక్ష యుద్ధాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీని ప్రధాన కారణం – అణుశక్తి పెరుగుదల, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరస్పరం ఆధారపడటం , అంతర్జాతీయ సమీకరణాలు. ఇప్పుడు దేశాల మధ్య జరుగుతున్నవి ప్రత్యక్ష యుద్ధాలు కాదుగానీ, ప్రచ్ఛన్నంగా సాగుతున్న శక్తి పోరు. ప్రచ్ఛన్న యుద్ధం అంటే సాంప్రదాయంగా సైనిక దళాలు ఢీకొనడం కాకుండా, గూఢచర్యం, ఆర్థిక ఆంక్షలు, మేధస్సు ఆధారిత వ్యూహాలు, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు, సైబర్ దాడులు వంటి మార్గాల్లో దేశాలు పురస్సరంగా శక్తి ప్రదర్శన  పోరు సాగించడాన్ని సూచిస్తుంది. దీనిలో ప్రజలపై ప్రత్యక్ష బాంబులు పడకపోయినా, దేశ వ్యవస్థలే కుదేలవుతాయి.

అమెరికా – సోవియట్ యూనియన్ మధ్య 1947 నుండి 1991 వరకు జరిగిన ‘కోల్డ్ వార్’ (Cold War) చరిత్రలో ప్రసిద్ధం. ఇందులో రెండు అణ్వాయుధాలు కలిగిన  దేశాలు ఎప్పుడూ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా, ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధి యుద్ధాల ద్వారా, ఆర్థిక, రాజకీయ, సైనిక ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాయి. వియత్నాం యుద్ధం, అఫ్ఘనిస్తాన్ లో సోవియట్ దూకుడు, క్యూబన్ మిస్సైల్ సంక్షోభం—ఇవన్నీ ప్రచ్ఛన్న యుద్ధాలను ప్రతిబింబిస్తాయి. ఈ రోజుల్లో ప్రచ్ఛన్న యుద్ధం మరింత సాంకేతికంగా మారింది. ఉదాహరణకు   దేశాల ప్రభుత్వ వెబ్‌సైట్లు, బ్యాంకింగ్ వ్యవస్థలు, ఎన్నికల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని సైబర్ దాడులు జరుగుతున్నాయి. అమెరికా, చైనా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ రంగంలో విస్తృతంగా పాల్గొంటున్నాయి.  అమెరికా అనేక దేశాలపై ఆంక్షలు విధించి ప్రచ్ఛన్నంగా వాటి రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా ఇవి ఉదాహరణలు. సోషల్ మీడియా వేదికగా ఇతర దేశాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఫేక్ న్యూస్, పాపులరిజం, టార్గెట్‌డ్ డిస్ఇన్‌ఫర్మేషన్ ప్రచారాలు చేస్తున్నారు. యెమెన్, సిరియా వంటి దేశాల్లో ప్రత్యక్షంగా శక్తులు లేని దేశాలు, పాక్షికంగా తమ మద్దతుదారుల ద్వారా యుద్ధాలు నడుపుతున్నాయి.

ఈ ప్రచ్ఛన్న యుద్ధాలకు ప్రధాన కారణం అణుయుద్ధ భయం ..అణ్వాయుధాల సమీకరణం వల్ల ఏ ఒక్క దాడి కూడా ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగడాన్ని నివారించుకుంటున్నాయి. ఆర్థిక పరస్పర ఆధార పడటం కూడా ఒక కారణం  ప్రపంచీకరణ వల్ల దేశాలు పరస్పరంగా ఆర్థికంగా బలంగా అనుసంధానమై పోయాయి. ప్రత్యక్ష యుద్ధం వలన అంతర్జాతీయ మార్కెట్ల కుప్పకూలే ప్రమాదం  ఉంది. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం వంటి సంస్థలు ప్రత్యక్ష యుద్ధాలను అడ్డుకునే దిశగా ప్రభావాన్ని చూపుతున్నాయి.

 

నేటి ప్రపంచం లో ప్రత్యక్ష యుద్ధాలు తప్పించుకుంటూ, ప్రచ్ఛన్న రూపంలో శక్తి ప్రదర్శన  పోరు సాగిస్తున్నది. ఇది గుట్టుగా, అంతర్ముఖంగా నడవడమే కాకుండా, ప్రజల మనోభావాలపై, ప్రభుత్వాల విధానాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధాల ప్రభావం కొన్నిసార్లు ప్రత్యక్ష యుద్ధాలకు మించినదిగా కూడా మారుతున్నది. అందువల్ల ప్రజాస్వామ్య దేశాలు ఇవి గుర్తించి, మేధస్సుతో, సహనంతో, తత్వచింతనతో  స్పందించాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page