- ప్రైవేటు రంగం భాగస్వామ్యం కోసం కొత్త పాలసీలు
- తొలిసారిగా ఆఫ్ షోర్ మైనింగ్ ప్రారంభించాం
- 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాలే లక్ష్యం
- కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
గత పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర గనుల శాఖ అద్భుత ప్రదర్శన కనబరిచిందని అత్యంత వేగంగా పరుగులు పెడుతున్న రంగంగా అభివృద్ధి చెందిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం గోవాలో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. గనుల రంగంలో ఎక్స్‌ప్లొరేషన్ లైసెన్స్ విధానం తీసుకురావడం, క్రిటికల్ మినరల్స్ కోసం అతిపెద్ద వేలం నిర్వహించడం ద్వారా మైనింగ్ రంగంలో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించామన్నారు. గ్లోబల్ క్రిటికల్ మినరల్ రంగంలో మనం కీలక పాత్ర పోషిస్తున్నాం. అదే సమయంలో గనుల రంగంలో ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేసేందుకు పాలసీలు, సంస్కరణలు తీసుకొచ్చాం. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలతో పాటు మైనింగ్ రంగంలో నాణ్యత, పారదర్శకత తీసుకొచ్చాం. సమీప భవిష్యత్తులో దేశంలోని మైనింగ్ రంగాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలిపేందుకు మరింతగా కృషి చేస్తున్నాం. అందుకే దేశవ్యాప్తంగా ఖనిజాల అన్వేషణ చేపట్టడమే కాకుండా వివిధ దేశాల సహకారం కూడా తీసుకుంటున్నాం. ప్రస్తుతం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లెడ్, జింక్, డైమండ్, గోల్డ్, కాపర్, వెనేడియం వంటి క్రిటికల్ మినరల్స్ అన్వేషణ కోసం ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో 13 బ్లాకుల వేలం ప్రారంభించాం.
వేలం ద్వారా పొందిన ఎక్స్‌ప్లొరేషన్ లైసెన్స్ ద్వారా ప్రైవేటు కంపెనీలు కూడా దాదాపు వెయ్యి చదరపు కి.మీ. వరకు ఖనిజాల అన్వేషణ చేపట్టే అవకాశం ఉంటుంది. సరికొత్త విధానం ద్వారా పారదర్శకత, సమర్థత, ఇన్నొవేషన్ కు ప్రోత్సాహం ఉంటుంది. ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాం. గతంలో ఖనిజాల అన్వేషణ విషయంలో ప్రైవేటు రంగ సంస్థలకు పెద్దగా అవకాశాలు లేవు. అందుకే ఈ ఇబ్బందులను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2023లో మైన్స్ అండ్ మినరల్ (డెవలప్‌మెంట్ రెగ్యులేషన్) చట్టాన్ని తీసుకొచ్చి, నూతన లైసెన్స్ జారీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జూనియర్ మైనింగ్ కంపెనీలు, ప్రత్యేకమైన ఎక్స్ ప్లొరేషన్ సంస్థలు, గ్లోబల్ పెట్టుబడిదారులకు భారత మైనింగ్ రంగంలో అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నాం. పెట్టుబడిదారులు, ఎక్స్ ప్లోరేషన్ సంస్థలకు రియల్ టైం డేటా అందించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీ తీసుకొచ్చాం. క్రిటికల్ మినరల్ సరఫరా వ్యవస్థలో గ్లోబల్ లీడర్ గా ఎదగాలన్న లక్ష్యాన్ని ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో సులువుగా చేరుకుంటామన్న ఆకాంక్ష మాకుంది.
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ లెక్కల ప్రకారం లిథియం, సెలీనియం వంటి ఖనిజాల డిమాండ్ 2030 నాటికి మూడింతలు, 2040 నాటికి నాలుగింతలు అవుతుంది. రానున్న రోజుల్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ, సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్, రక్షణ, ఏరోస్పేస్, సెమీ కండక్టర్లు, చిప్ తయారీ రంగం, మెడికల్ టెక్నాలజీ, ఫర్టిలైజర్ తయారీలో క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచ పటంలో భారత్ ను నిలపాలంటే క్రిటికల్ మినరల్స్ చాలా ముఖ్యం. గతంలో ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వొచ్చేది. – 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యంతో పాటు పరిశ్రమల అభివృద్ధిని చేరుకునేందుకు క్రిటికల్ మినరల్స్ చాలా కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.16 వేల కోట్ల బడ్జెట్, రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రారంభించింది.
ఇప్పటివరకు దేశంలో విజయవంతంగా 24 క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్ ను వేలం వేశాం. అర్జెంటీనాలో ఇప్పటికే లిథియం బ్లాకుల్లో అన్వేషణ ప్రారంభించాం. ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో కూడా బ్లాకుల్లో క్రిటికల్ మినర్స్ అన్వేషించేందుకు యత్నిస్తున్నాం. అలాగే తొలిసారిగా ఆఫ్ షోర్ మైనింగ్ కూడా ప్రారంభించాం. తొలి 13 ఆఫ్ షోర్ మినరల్స్ బ్లాక్స్ వేలం ప్రారంభించాం. మైనింగ్ రంగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు టెయిలింగ్ పాలసీ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ నినాదంతో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆత్మనిర్భర భారత్ సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.