కష్టజీవి కన్నీళ్ళే ఆయన కలానికి సిరా చుక్కలు.. తను రాసిన కవితలు మర ఫిరంగులు.. అక్షర తూటాలతో అగ్గి పుట్టించినా.. అతి తక్కువ పదాలతో ఆకాశమంత భావ వ్యక్తీకరణ చేసినా.. అది తనకే చెల్లింది. సామాజిక రుగ్మతలపై ఆయన ప్రతి కవితా విప్లవ బాణాలు సంధించింది. ఆ సాహిత్య శేఖరుడే అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాల జిల్లాలో 1954 జనవరి 12న అలిశెట్టి జన్మించారు. కరీంనగర్‌లో ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత ఫొటోగ్రఫీపై ఉన్న మక్కువతో స్టూడియోలను ప్రారంభించారు. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలో వాటిని ఏర్పాటు చేశారు. అటు, కవిగా కూడా విశేషంగా రాణించారు. సృజనాత్మకంగా, అతి తక్కువ పదాలతో ప్రజలకు అర్థం అయ్యేలా కవితలు రాయడం అలిశెట్టి ప్రత్యేకత. పేదరికం, బాధకు, కన్నీళ్లను తన కవితా వస్తువులుగా మలుచుకున్నారు.
పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కవిత్వాన్ని అస్త్రంగా సంధించారు. ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్త లేఖ, సిటీ లైఫ్ వంటి కవితా సంకలనాలు అలిశెట్టి వెలువరించారు. చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్ గా, కవిగా తనదైన ముద్ర వేసుకున్నారు. అలిశెట్టి కవితల్లో మచ్చుకు కొన్ని: ఆకాశమంత ఆకలిలో అన్నం మెతుకంత చందమామ – కంటికీ ఆనదు కడుపూ నింపదు మరణం నా చివరి చరణం కాదు అత్యధికంగా అత్యద్భుతంగా అస్తి పంజరాలను చెక్కే ఉలి – ఆకలి గడియారం పెట్టుకున్న ప్రతి వాడూ – పరిగెడుతున్న కాలాన్ని పట్టుకోలేడు.. అలిశెట్టి ఏ కవిత రాసినా అందులో నిజానిజాలు గోచరిస్తాయి.
కవిత్వాన్నే శ్వాసగా, ఆశగా చేసుకుని ఆయన బతికారు. ప్రజలను ఆలోచనా దృక్పథంలో మార్పు తీసుకురాగలిగారు. కవిత్వానికే తన జీవితాన్ని అంకితం చేశారు. చివరకు ఆ అక్షర యోధుడిని క్షయ వ్యాధి కబళించింది. అప్పుడు కూడా డబ్బు మనిషిలా నువ్వు జబ్బు మనిషిగా నేను – అందుకే నువ్వెప్పుడూ డాక్టరువి నేనెప్పుడూ పేషంటుని అని మినీ కవితలు రాస్తూ 1993 జనవరి 12న తుది శ్వాస విడిచారు. అలిశెట్టి జయంతి, వర్ధంతి ఒకే రోజు కావడం యాదృచ్చికం. భౌతికంగా అలిశెట్టి మన మధ్య లేకపోయినప్పటికీ కవితల రూపంలో ఆ అక్షర సూర్యుడు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
– సందీప్ రావు అయిల్నేని