రైతులకు వ్యవసాయ సంచాలకుల సూచనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31: ఈసారి నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి పదిహేను రోజులు ముందుగా ప్రవేశించిన నేపథ్యంలో, యాసంగి వరి పండించిన రైతులు (farmers) ఇప్పుడు తమ పొలాల్లో పచ్చి రొట్ట పైరులను విత్తుకోవాలని వ్యవసాయ సంచాలకులు సూచించారు. మే 26న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు, 28వ తేదీనాటికి రాష్ట్రమంతా విస్తరించాయని ఈ నేపథ్యంలో రైతులు నేలస్వభావాన్ని బట్టి సరైన సమయంలో పంటలను విత్తుకోవాలని కోరారు. నేల 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతువరకు తడిసిన తర్వాత మాత్రమే వర్షాధార పంటలైన సోయాచిక్కుడు, కంది, పెసర, జొన్న, మొక్కజొన్న వంటి పైరు విత్తనాలను విత్తుకోవాలని ఆయన సూచించారు. విత్తే ముందు విత్తనశుద్ధి తప్పనిసరి అన్నారు.
జూన్ నెలలో అధికవర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నందువల్ల పొలాలనుంచి నీరు బయటకు వెళ్లే విధంగా కాల్వలు తవ్వుకోవాలని రైతులను కోరారు. మొక్కజొన్న, పత్తి పంటలను బోది సాళ్లపద్ధతిలో విత్తు కోవాలన్నారు. దీనివల్ల నీరు నిల్వ వుండే అవకాశముండదన్నారు. అదేవిధంగా సోయాచిక్కుడును ఎత్తు మడులు, కాల్వల పద్ధతిలో విత్తుకోవాలన్నారు. కందిని అంతరపంటగా సాగుచేయవచ్చన్నారు.