కల్తీల లీలలు.. నాణ్యతకు తిలోదకాలు!

పట్టింపులేని అవినీతి నిరోధక శాఖలు

ఎక్కడ, ఎప్పుడూ చూసినా అవినీతి దుర్వాసనలు గుప్పుమంటున్నాయి. అనాదిగా స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల వరకు అన్ని విభాగాల్లో/స్థాయిల్లో అవినీతి భూతం రెచ్చిపోతున్నది. వార్డు మెంబర్‌ నుంచి కేంద్ర మంత్రుల వరకు అన్ని విభాగాల్లో ఆయా స్థాయిలో అవినీతి చెదలు దేశ శ్రేయస్సును భోంచేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో పని కావాలంటే అమ్యామ్యాలు ముట్టచెప్పాల్సిన అనివార్య అగత్యం ఏర్పడిరది. అక్రమార్జనలకు అంతు లేకుండా పోతున్నది. అవినీతి నిరోధక శాఖలు ప్రతి రోజు ఏదో ఒక అవినీతి చేపను వలపన్ని పట్టుకుంటున్నది, తర్వాత అవినీతికి తలవంచి వదిలేస్తున్నది. స్కామ్‌లు, లంచాలు నిత్యకృత్యం అయ్యాయి.

ప్రభుత్వ శాఖలో పని జరగాలంటే ముట్టచెప్పాల్సిందే అని ప్రజలు దృఢ అభిప్రాయానికి వస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పెంచి పోషిస్తున్న యంత్రాంగాలు, ఆహార సరుకుల కల్తీల లీలలు, నాణ్యతకు తిలోదకాలిస్తూ ప్రాజెక్టుల నిర్మాణాలు, పట్టపగలే లంచాలు తీసుకుంటున్న ప్రబుద్ధులు మన ముందు కాలరెగిరేస్తూ కార్లల్లో షికార్లు కొడుతున్నారు. మనిషిలో నైతికతకు గండి పడితే అవినీతి వరదలు ప్రవహిస్తాయని తెలుసుకోవాలి. అవినీతి చెదలుకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్‌ లేదా అప్రమత్తత విభాగాలను ఎన్ని ఏర్పాటు చేసినా ఆయా శాఖల స్వయం ప్రతిత్తికి భంగం కలిగించే విధంగా ప్రభుత్వ ప్రబుద్ధుల్లో చిత్తశుద్ధి లోపించి అనవసర స్వార్థ పూరిత జోక్యంతో మూడు పువ్వులు ఆరుకాయలుగా అక్రమార్కులు విర్దిల్లడం విచారకరం.

అవినీతి రహిత నవ భారత నిర్మాణానికి: భారత కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో పని తీరును మెరుగు పరచడం, పారదర్శకత పెంచడం, కెపాసిటీ బిల్డింగ్‌ కార్యక్రమాలు నిర్వహించడం, పిర్యాదుల విభాగాలను బలోపేతం చేయడం, ఆరోపణలు గుప్పుమన్నపుడు వెంటనే నిష్పాక్షిక విచారణ జరపడం, విజిలెన్స్‌ విషయంలో అత్యాధునిక డిజిటల్‌ సదుపాయాలను వినియోగించుకోవడం లాంటి లక్ష్యాలతో ప్రతి ఏట 28 అక్టోబర్‌ నుండి 03 నవంబర్‌ వరకు ‘‘విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు లేదా విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌’’ను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ వారోత్సవాల్లో భాగంగా దేశ సమగ్రతను కాపాడడం, అవినీతి నిర్మూలన, బంధు ప్రీతి చూపడం, పక్షపాతాన్ని పెంచి పోషించడం, లంచం ఇవ్వడమా కాదు లంచాన్ని తీసుకోవడం కూడా నేరమని అవగాహన పర్చడం కొనసాగుతున్నది. నవ భారతదేశాన్ని నిర్మించడానికి మన జీవితాల్లో నైతిక విలువలను పెంపొందించడం, ప్రోత్సహించడం అత్యవసరమని అవగాహన కల్పించడం కొనసాగుతున్నది.

దేశ శ్రేయస్సుకు నైతిక సమాజ స్థాపన: ‘‘దేశ శ్రేయస్సుకు నైతిక సమగ్ర సమాజ సంస్కృతి (కల్చర్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ ఫర్‌ నేషన్స్‌ ప్రాస్పరిటీ)’’ అనే థీమ్‌ను తీసుకొని ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నది. విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలకు పూర్వ కార్యక్రమాలుగా గత మూడు మాసాల నుంచి (16 ఏప్రిల్‌ – 15 నవంబర్‌ వరకు) పలు వేదికలను ఏర్పాటు చేసి అవగాహనను నిర్వహిస్తున్న విషయం మనకు తెలుసు. భారత రత్న సర్దార్‌ వల్లబ్‌బాయ్‌ పటేల్‌ జన్మదినాన్ని (31 అక్టోబర్‌) పురస్కరించుకొని ప్రతి ఏట విజిలెన్స్‌ అవగాహన వారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ‘భారతీయుడు’ అప్రమత్తంగా ఉండాలని, ఎల్లవేళల నిజాయితీ/చిత్తశుద్ధి అత్యున్నత ప్రమాణాల్లో ఉండాలని, అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతినబూనాలని ప్రజలను కోరుతున్నారు.

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌(సివిసీ): సంతానం కమిటీ’’ సిఫార్సుల ఆధారంగా దేశ సమగ్రత కాపాడడం, పారదర్శకత పెంచడం, జవాబుదారీతనాన్ని అమలు చేయడం, అవినీతి నిర్మూలన లాంటి ధ్యేయాలతో 1964లో భారత ప్రభుత్వం ‘సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌ లేదా సివిసీ’ అనబడే అత్యున్నత ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసింది. విజిలెన్స్‌ కార్యకలాపాల్లో సున్నితమైన ప్రాంతాల్లో సిబ్బంది పర్యవేక్షణ, పిర్యాదుల విచారణ, దుష్ప్రవర్తనలకు ఆస్కారం లేకుండా విధుల నిర్వహణకు సలహాలు ఇవ్వడం, కాంట్రాక్టుల పర్యవేక్షణ/ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం లాంటి ప్రధాన విధులతో సివిసీ, ఇతర విజిలెన్స్‌ శాఖలు పని చేస్తున్నాయి.

విజిలెన్స్‌ అవగాహన వారోక్సవాల్లో భాగంగా విద్యాలయాల్లో నైతిక ప్రవర్తన ప్రాధాన్య అంశాలను తీసుకొని పలు పోటీలను నిర్వహించడం, విజిలెన్స్‌ విభాగాలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, నైతిక ప్రవర్తన ప్రదర్శించిన సిబ్బందిని సన్మానించడం, విజిలెన్స్‌ అవగాహన ప్రతిజ్ఞను సామూహికంగా చేయించడం, దేశ శ్రేయస్సు కోరి నీతి నిజాయితీలను పెంచి పోషించడం లాంటి పలు కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. రాజకీయ నాయకుల్లో నైతిక ప్రవర్తన పెరిగితే ప్రభుత్వ శాఖల్లో కూడా అవినీతి తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నేడు మెజారిటీ ఎంఎల్‌ఎ, ఎంపీలు అవినీతి ఆరోపణల అభియోగాలను ఎదుర్కొంటున్నారు. దీపావళి పర్వదిన వేళల్లో మన జీవితాల్లో వెలుగులు ప్రసరించడానికి నైతిక సమాజ స్థాపన జరగాలని, ప్రతి ఒక్కరు అసలుసిసలైన ‘భారతీయుడు’ కావాలని, అవినీతి రహిత భారత కలలను సాకారం చేయడానికి అందరం చేయి చేయి కలిపి అవినీతి అనకొండలను ఆమెడ దూరం తరిమేద్దాం, నీతి నిజాయితీ వర్ధిల్లే సమాజ స్థాపనకు కృషి చేద్దాం.
-డా.బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page