ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ వ్యవహారశైలిపై తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి. గౌతమ్ అదానీ గ్రూప్ అక్రమాలపై ఇప్పుడు ఆంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. భారత ప్రభుత్వ అధికారులకు 2,2029 కోట్ల రూపాయలమేర ఆ సంస్థ లంచాలిచ్చిందంటూ అమెరికా అదానీపై అభియోగం మోపడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ గ్రూప్ వ్యవహారంపైనపలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందాలన్నిటినీ విరమించుకోవాలన్న డిమాండ్ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నది. అదానీ గ్రూప్‌పై మొదటినుండీ కాంగ్రెస్ అగ్రనేత, లోకసభలో ప్రతిపక్ష నేతకూడా అయిన రాహుల్‌గాంధీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ గ్రూప్ అవినీతి వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తం కావడంతో అదానీని అరెస్టు చేయాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు.
అంతవరకు బాగానే ఉన్నా నిజంగానే ఈవిషయంలో రాహుల్ సత్యనిష్టాపరుడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంగతేమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా అదానీ తో సంబంధం పెట్టుకున్న తెలంగాణరాష్ట్ర వ్యవహారంపై రాహుల్ ముందుగా స్పందించాలని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర వ్యవహారాలను చూస్తుంటే ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదనిపిస్తున్నదంటూ ఆయన ఆరోపిస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుపడులకోసం దేశ విదేశ వ్యాపార, వాణిజ్య సంస్థలను ఆహ్వానించే పనిలో ఉంది. అందులో భాగంగా ఇటీవల అదానీ గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకుంది. సుమారు 12వేల 400 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆ గ్రూప్ పెట్టేవిధంగా ఒప్పందాలు జరిగాయి.
ఇందులో పవర్ జనరేషన్ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, సిమెంట్ యూనిట్స్, ఏరో స్పేస్ యూనిట్స్‌లాంటి పలు పరిశ్రమలను నెలకొల్పేవిధంగా ఎంఓయును తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది. కాగా యువతకు ఉపాధి కల్పించే విషయంలో వారికి ఆయా వృత్తులపై తగిన శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశ్యంగా నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దాని కార్యకలాపాలు విస్తృత పర్చే క్రమంలో అదానీ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలను విరాళంగా స్వీకరించడాన్ని కెటి రామారావు తప్పుబడుతున్నారు. ఒక పక్క అక్రమాలకు పాల్పడిన అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదానీ నుండి వందకోట్ల రూపాయలను స్వీకరించిన విషయంపై ఎందుకు స్పందించడంలేదని వాదిస్తున్నారు. అవినీతిపరుడని అంటున్న అదానీ నుంచి విరాళాలు తీసుకోవడం దేనికి సంకేతమన్నది ఆయన ప్రశ్న. ఇప్పటికైనా తీసుకున్న విరాళాన్ని వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రత్యారోపణ చేస్తున్నది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోకూడా ఆదాని గ్రూప్ కార్యకలాపాలు సాగాయన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ గ్రూప్‌తో ఒప్పందం జరిగిన మాట వాస్తవమేనని పేర్కొంటున్నది.
అయితే వారికి ఇప్పటివరకు కనీసం ఇంచు భూమిని కూడా కేటాయించలేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అంటున్నారు. చట్టాలకు లోబడే తెలంగాణలో వ్యాపారాలకు అనుమతిస్తామని, అదానీ గ్రూప్‌పై వొచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే ఆ గ్రూప్ పెట్టుబడులపై పునరాలోచన చేస్తామన్నారు. ఇదే విషయంపై రాహుల్ స్పందిస్తూ అదానీతో అంటకాగిన వాళ్ళెవరైనా, ఏపార్టీ వారైనా శిక్షను ఎదుర్కోవాల్సి వొస్తుందని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం గమనార్హం. లంచం ఆరోపణలు ఎదుర్కునే రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలో ఉన్న విచారణ జరిపించాల్సిందేనన్నారు రాహుల్. ఇదిలాఉంటే భారత మార్కెట్‌ను దెబ్బతీయడానికే కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని బిజెపి ఆరోపిస్తున్నది. గతంలో అనేక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీ గ్రూప్ పెట్టుబడులను ఎందుకు స్వాగతించాయో చెప్పాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబితపాత్ర ఎదురుదాడి చేస్తున్నారు. ఏదియేమైనా ఈ అంశంపై జెఏసిని ఏర్పాటచేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.