జనధర్మోవిజయతే

చారిత్రిక, సాంస్కృతిక ప్రాధాన్యం అవిరతంగా సంతరించుకొన్న ఈ వరంగల్లు గడ్డ అలనాటి నుండి నేటి దాకా ఎందరెందరో కవులనూ, భక్తులనూ, పండితులనూ రచయితలనూ, ఉద్యమవీరులనూ, రాజకీయవేత్తలనూ, మేధావులనూ దేశానికి సగర్వంగా అందించింది. అట్లాంటి ఈ గడ్డ మీద వర్తమాన సామాజిక జీవితంలో పండిత సామాన్య కుటుంబంనుంచి ఉదయించి కేవలం స్వయంకృషితో ప్రశస్త స్థాయికి తానెన్నుకొన్న పత్రికారంగంలో ఎదిగిన మేధావి శ్రీ యం. యస్. ఆచార్య.
వ్యక్తిగా వ్యక్తిగా ఆయనలో కన్పించే సామాన్యత్వం, నిరాడంబరత్వం, అమాయకత్వం, మెత్తదనం. ఆయన కలంలో, ఆయన రచనల్లో ఏ మాత్రం కన్పించవు. తాను సంపాదకత్వం నిర్వహించే జనధర్మ, వరంగల్ వాణి పత్రికల్లోని ఆయన సంపాదకీయ రచనలనిండా వ్యాపించి కన్పించే వ్యక్తిత్వ స్వరూపమే వేరు. అక్కడ ఏ అక్షరంలోనూ దైన్యం ఉండదు. అసామాన్యంగా సామాన్యత్వం ప్రస్ఫుటమపుతుంది. ఋజుత్వం కొట్టవచ్చినట్టు కన్పిస్తుంది. అసిధారావ్రతంగా సాగిన శ్రీ ఆచార్య సంపాదక రచనలు లలిత పదవిన్యాసంతో సాగుతూనే, పదునుగా, భావ గాంభీర్యంతో, బిగువయిన రచనా సంవిధానంతో, కర్తవ్య భావనిష్ఠతో, ఏ వెరపూ లేని ధీరత్వంతో నిండి, సామాజికరంగంలో చీకాకుపరిచే రకరకాల సమస్యల చీకటి వలయాలను ఛేదించే వెల్తురు కత్తులు. సహానుభూతిని అనుభవించలేని కఠోర హృదయాల్లో కస్సున గుచ్చుకొనే వాడి వాటిలో ఉంది. సమస్యల చలిలో సతమతమయ్యే సామాన్యులకవసరమయిన వేడి ఉంది.
సమస్యలనేవి ఎప్పటికప్పుడు సరికొత్తదన్నట్టుగా దిన దినం లెక్కకు మిక్కిలిగా పొడుచుకు వస్తూనే ఉంటాయి. అవి కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా, రాజధాని మొనలు రాంపురం దాకా, ఇరాక్ నుంచి ఇంటి ముంగిలి దాకా, అంతరిక్షం నుంచి అవనీతలం దాకా వ్యాపించి ఇరుకున బెట్టేవికావచ్చు, జాగృతపరచేవి కావచ్చు, ఆలోచింపజేసేవి కావచ్చు, విశ్వంభరంను చుట్టివచ్చేవీ కావచ్చు. ఏమయితేనేం అన్నీ ప్రజాచైతన్యానికి అవసరమైనవే` సంపాదకీయ రచనకు ముడిసరుకులే. అంతర్రాష్ట్ర జలవివాదం, భాషాతత్వం, ప్రాంత, జిల్లా, స్థానిక అవసరాలు` విద్య వైద్యం, సాంస్కృతికం, ఘర్షణ, హర్షం, ఆమోదం, ఆర్తి, రైతుల ఇక్కట్లు, నేత కార్మికుల అగచాట్లు ఒక టేమిటీ? ఏ సమస్యలయినా, ఆయా సమస్యల్ని పరిలోకించే విధానం, పర్యాలోచించే రీతి, ఆ సమస్యల చుట్టూ అలుముకొన్న జిగులూ, బిగులూ, ఒక్కొకప్పుడు బిగుసుకొన్న పీటముళ్లూ, వాటిని విప్పేందుకు అవసరంగా భావించబడే సూచనలూ అన్నీ ఆ రచనకు మౌలిక భూమికలు, దైనిక- నిత్యసమస్యల్లో -వాటి సంకుచిత, విస్తృత వలయాల్లో తిరుగుళ్లు బడుతూ, కొట్టుట్టాడే సామాన్యులూ, మాన్యులూ` సమస్యల ప్రవాహంలో ఉక్కిరిబిక్కిరయ్యే వివిధస్థాయీ – వర్గాల ఆలోచనా సరళులూ, వీటితో బహుముఖంగా ప్రభావితమయ్యే సమాజం- ఈ అన్నింటి అవలోకనం, అనుశీలనం, అన్వయం, సమన్వయం ఆయన రచనల్లో జాల్వారుతూ ఉంటాయి.
వార్తలు ప్రచురించేప్పటి మానసిక పరిస్థితికీ, సంపాదకీయాలు – సంపాదక రచనలు చేసేప్పటి ఆలోచనా విధానానికీ సాధారణంగా పొంతన ఉండదు. అట్లాంటప్పుడు పత్రికా ప్రచురణకర్తలు గూడా సంపాదకులే అయిన సందర్భంలో ఏదో ఒక అలంబన కోసం సర్దుబాటు చేసుకోవటం ఈనాడు అతిసహజంగా కన్పిస్తూ ఉంటుంది. కాని` రూపంలో, ఇతరేతర పరిమితుల దృష్ట్యా పత్రికలు ‘చిన్నవే’ అయినా, వాటి రచనల్లో గూడా పలుకులోని పాటవం ఎంత ప్రభావవంతమయిందో, సంపాదక లేఖిని ఎంతటి శక్తివంతమయిన భావభేది కాగలదో అవగతం చేసుకొన్న శ్రీ ఆచార్య సంపాదకీయ రచనలు ఏనాడూ సర్దుబాటు మనస్తత్వాన్ని ప్రదర్శించిన దాఖలాలు లేవు. అవసరం వచ్చినప్పుడు ఎంతటి వారినయినా స్వపర భేదం లేకుండా పాళీని రామబాణంలా ఎక్కుబెట్టి ప్రయోగించడమే ఆయనకు తెలిసింది. అదే ఆయన స్వతంత్య్ర వ్యక్తిత్వానికి శ్రీరామరక్ష.
చౌకబారు రచనల వల్ల హాని
సమకాలీన సమాజంపై సంపాదక రచనల ప్రభావం ఎంతగాఢంగా ఉంటుందో, దానికి సమానాంతరంగా దాదాపు అదే దామాషాలో సమకాలీన సమాజగమన సరళి ప్రభావం కూడా సంపాదక రచనలపై ఉంటుంది. అవి ఏరకమయిన చెదురు బాటులకయినా, హావభావాలకయినా వారిని గురి చేసే, ప్రలోభాలకు లోబరచే అవకాశం కూడా ఉంది. రచనల వల్ల ఉదయించే ధ్వని- ప్రతిధ్వనులు, వాటికి హేతువయిన శబ్దతరంగాల ఊపును ఆయన ఏ విధమయిన హావభావాలకూ, ప్రభాలకూ లొంగింపచేయ లేదు. వాటిని ఆయన కలం ఎప్పుడూ పట్టించుకొన్నట్టుగానీ, లక్ష్యపెట్టినట్టుగానీ కన్పించదు. పాకిస్తాన్, చైనాలను అభిశంసించవలవచ్చినప్పుడు దేశీయత, దేశభక్తి ఎంతగాఢంగా తీవ్రంగా అభివ్యక్తమయిందో, రాష్ట్ర ప్రగతిని కాంక్షించేప్పుడు అందుకు అడ్డుపడే సైంధవ శక్తులను నిరసించే సందర్భంలో అంతగాఢంగా ధార్మిక కోసం ఉవ్వెత్తుగా వ్యక్త పడిరది. స్థానిక అవసరాలు తీరక, అక్కడి ప్రజానీకం ప్రగతి నిర్లక్ష్యానికి గురయి, కొందరు ‘ఏలికల’ సంకుచితతత్త్వం, తత్కారణంగా సాగిన దమననీతి వల్ల స్వాతంత్య్ర బహిర్ శ్వాస గూడా లుప్తమవుతున్నట్లు కన్పించే తరుణంలో విప్పిన పులి పంజా రచనా రూపంలో ప్రత్యక్షమయింది భావ అభిప్రాయ ప్రకటనేచ్ఛ, వాస్తవికాంశ ప్రకటనాభిలాష మహోదగ్ర మార్గాన ఉరవళ్లు పరవళ్లు తొక్కింది. ఈ స్థితి శ్రీ ఆచార్య రచనల్లో నేటికీ బీరువోకుండా వస్తున్నది. యావత్ ప్రగతి పరిపాలనా సౌష్ఠవం లోపించి, చేత కాని వాళ్ల చేతుల్లోకి పోయినప్పుడు – వాళ్లెంతటి ‘ప్రజారంజకు’ అయినా – పరిస్థితి ఎంత దిగజారిపోతూ ఉంటుందో, ఎంత చౌకబారుగా తయారయి మౌలికంగా హాని కలిగిస్తుందో సూటిగా, నిర్ద్వంద్వంగా రాయగల శ్రీ ఆచార్య ‘సాహసం’ ఇటీవలి సంపాదకీయాల్లోనూ సువ్యక్తం. బహుశః ప్రతి కక్షీయులకు గూడా ఇది సాధ్యం కాదేమో …:
స్వతంత్ర భావన, నిర్భీకత
ఇది శ్రీ ఆచార్య జనధర్మ. వరంగల్ వాణి పత్రికలకు పెట్టిన ఒరవడి. ఈ ఒరవడికి స్వావలంబన, స్వతంత్ర భావన, నిర్భీకత, ధార్మిక నిష్ఠ పెనవడి రూపొందిన అంతస్సూత్రం. ఈ పత్రిక ఏదో డబ్బు సంపాదించి నెత్తికెత్తుతుంది, లేదా ఎత్తుకున్నదని ఎవరూ అనటానికి అవకాశం లేదనేది నగ్నసత్యం. కాగా, ప్రజాస్వామ్యంలో నిర్భయంగా తనకు తోచిన, నమ్మిన నిజం చెప్పడం ప్రజాచైతన్యాన్ని తట్టి లేపటం. జరుగుతున్న అస్తవ్యస్త విధాన్ని ప్రజలకవగాహన పరచటం, ప్రజల అవసరాలకు అనుగుణంగా వారి వర్తమాన భవిష్యత్ యోగక్షేమాలను అల్లంత దూరం నుంచే దర్శించి, అవగాహన చేసుకొని ఒక నిర్దిష్ట నిర్దుష్టమయిన మార్గాన్ని నిరూపించటం – ఇట్లాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించటమే ప్రధానంగా నిర్దేశించుకోబడిరది, ఇదే ఈ రెండు ‘చిన్న’ పత్రికల ‘పాలసీ’ అని చెప్పవచ్చు, ఈ అంశాన్ని జనధర్మ ఆరంభ సంచిక సంపాదకీయంలోని ఈ కింద ఉటంకించిన భాగం సువ్యక్తం చేస్తుంది.
ప్రజాస్వామ్య సుస్థిరతకు పత్రికలే ఆయుధాలు
ప్రజాస్వామ్య సుస్థిరతకు పత్రికలు ప్రధాన సాధనాలు. కొందరు పార్టీలుగా ఏర్పడి ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపడం, ఓట్లు వేయడం వంటి పనులు మాత్రమే ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యం ఒక స్వతంత్ర దేశ ప్రజల జీవన విధానం. ఈ విధానంలో అధికారపు పెనగులాటతో నిమిత్తంలేని అపారమయిన సమాజం తన జీవనానికీ, విలువలకూ విశ్వాసాలకూ భద్రతనిచ్చే సాంఘిక వ్యవస్థ నిర్మాణానికి పురోగమించాల్సి ఉంది, ప్రభుత్వం అందుకనుకూలమైన వాతావరణం కల్పించవలసి ఉంటుంది. ఈ ప్రగతిపథంలో ప్రజలుగాని, ప్రభుత్వాధికారము చేపట్టిన వారు గాని వేయుతప్పటడుగుల వారించి, పురోగమించుటకు వలయు సూచన అందచేసీ, ఉన్నత సంప్రదాయాన్నేర్పరచు విమర్శనాశీలురగు విజ్ఞ ప్రజలకు పత్రిక ఉత్తమ సాధనం. ఈ సాధనమును సద్వినియోగ పరచుకొను ప్రజలున్న ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం వేళ్లుదన్ని, ఊడలుచారి, సుస్థిరమై విలసీస్తుంది, ఈ సుదృఢాభిప్రాయమే… ఈ సాహస కృషిని మన్నించి జనధర్మను తమ వాణీప్రసార యంత్రంగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి.
పెట్టుబడి దారుల అండదండలు వద్దు
ఇంతేకాదు, జనధర్మకు గుత్త పెట్టుబడిదారుల అండదండలు లేవనీ, ఒక పార్టీ ఒక వర్గం ఆలంబన అంతకన్నా లేదనీ, ‘త్వమేవ శరణం’ అని కాలక్షేపం చేయగల శక్తి గానీ, ఆసక్తి గానీ అసలే లేదనీ తమ పత్రిక ‘పాలసీ’ సూచించబడిరది. స్వయం నిర్దిష్టమయిన ఈ మార్గంలో జనధర్మ, వరంగల్ వాణి పత్రికలు భావప్రకటన స్వేచ్ఛను, సంపాదకీయ రచనల్లో కచ్చితంగా పాటించగలిగాయా? లేదా? అనే ప్రశ్నకు సహేతుక సమాధానం – ఆ పత్రికా సంపుటాలన్నింటినీ తిరుగవేయల్సినంత అవసరం లేకుండానే, ఈ సంపాదకీయాల సంకలనంలో నిర్ద్వంద్వంగా లభిస్తుంది.